Balanced diet : గర్భంతో ఉన్నవారు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి?

గర్భిణీ(ప్రతీకాత్మక చిత్రం)

గర్భంతో ఉండే మహిళలు కడుపులో పెరుగుతున్న బిడ్డను దృష్టిలో పెట్టుకుని పోషకాహారం తీసుకోవాలి. గర్భం దాల్చిన తరువాత హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా శరీరం అనేక శారీరక మార్పులకు గురవుతుంది.

 • Share this:
  గర్భిణీ స్త్రీలను "ఇద్దరికోసం తినండి" అని పెద్దవాళ్లు అంటుంటారు. గర్భంతో ఉండే మహిళలు కడుపులో పెరుగుతున్న బిడ్డను దృష్టిలో పెట్టుకుని పోషకాహారం తీసుకోవాలి. గర్భం దాల్చిన తరువాత హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా శరీరం అనేక శారీరక మార్పులకు గురవుతుంది. అందుకే తల్లీ, బిడ్డల ఆరోగ్యం కోసం పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. తల్లి తినే ఆహారం శిశువుకు పోషకాహారానికి ప్రధాన వనరు. ఎలాంటి పోషకాహారం తీసుకోవాలంటే...

  1. సూక్ష్మ పోషకాలు
  కడుపులో పెరుగుతున్న పాపాయి శారీరక, మానసిక ఎదుగుదలకు కొన్నిరకాల సూక్ష్మపోషకాలు అవసరం. వీటిలో విటమిన్లు, ఖనిజాలు ముఖ్యమైనవి. వీటితో పాటు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఒమేగా -3 వంటి కొవ్వులు సరైన మొత్తంలో అందేలా జాగ్రతపడాలి. గర్భధారణ తరువాత.. తల్లికి అధికంగా అవసరమయ్యే పోషకాలను అందించడంలో, పాపాయికి తగిన శక్తి అందేలా చేయడంలో వీటి పాత్ర ఎంతో ఉంటుంది. కోడిమాంసం, చేపలు, తాజా పండ్లు, అన్ని రకాల ఆకుకూరలు, కాయధాన్యాలు వంటివి క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఇవన్నీ తల్లీబిడ్డలకు అందుతాయి.

  2. ప్రోటీన్(మాంసకృత్తులు)
  శిశువు శరీర కణజాల అభివృద్ధికి, అవయవాల ఎదుగుదలకు ప్రోటీన్ కృషిచేస్తుంది. మాంసకృత్తులు తల్లీబిడ్డల్లో రక్త సరఫరాను పెంచుతాయి. పిండ దశలో శిశువు రక్తప్రసరణను క్రమబద్దీకరించడానికి ఇవి తోడ్పడతాయి. నెలలు మారుతున్నాకొద్దీ ప్రోటీన్ అవసరాలు కూడా మారుతుంటాయి. మటన్, చికెన్, సాల్మన్ చేప, కాయలు, వేరుశెనగలు, బీన్స్ వంటివి ప్రోటీన్లకు వనరులు.

  3. కాల్షియం
  ఎముకల అభివృద్ధికి, శరీరం శోషించే ద్రవాలను నియంత్రించడానికి కాల్షియం అవసరం. గర్భిణులు వైద్యుల సలహాతో కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవాలి. పాలు, పెరుగు, జున్ను, ట్యూనా చేప, ముదురు ఆకుపచ్చరంగులో ఉండే కూరగాయలు, ఆకు కూరగాయల నుంచి ఇది సమృద్ధిగా లభిస్తుంది. సముద్రపు చేపలు, రొయ్యలు కూడా శరీరానికి కాల్షియంను అందిస్తాయి.

  4. ఫోలేట్
  ఫోలేట్ను ఫోలిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు. ఇది శిశువు నాడీ వ్యవస్థలో లోపాలు ఏర్పడకుండా చూస్తుంది. దీంతోపాటు శిశువు మెదడు, వెన్నుపాము ఎదుగుదల సక్రమంగా ఉండేలా చేస్తుంది. ఫోలేట్ లేదా ఫోలిక్ యాసిడ్ పొందటానికి కాలేయం, ఎండిన బీన్స్, కాయధాన్యాలు, గుడ్లు, వేరుశెనగలు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

  5. ఇనుము
  ఐరన్ తల్లీబిడ్డల్లో రక్త ప్రవాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇద్దరికీ తగినంత ఆక్సిజన్ అందేలా చూస్తుంది. ముదురు ఆకుపచ్చ కూరగాయలు, ఆకు కూరలు, సిట్రస్ జాతి పండ్లు, తృణధాన్యాలు, మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తుల నుంచి తగిన మొత్తంలో ఇనుము లభిస్తుంది.
  Published by:Narsimha Badhini
  First published: