హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Type 2 Diabetes Symptoms : టైప్ 2 డయాబెటిస్ లక్షణాలేంటి..? వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలి?

Type 2 Diabetes Symptoms : టైప్ 2 డయాబెటిస్ లక్షణాలేంటి..? వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టైప్ 2 డయాబెటిస్‌ పెద్దవాళ్లకు వస్తుంది. అయితే టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రెండూ బాల్యం లేదా యుక్తవయసులో ప్రారంభం కావచ్చు. వృద్ధులలో టైప్ 2 మధుమేహం అనేది సర్వసాధారణం. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఊబకాయం బారిన పడుతుండటం వల్ల.. యువకులలో టైప్ 2 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మధుమేహంలో (Diabetes) రెండు రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటిస్‌లో శక్తి కోసం కణాలలోకి గ్లూకోజ్‌ను తరలించే ప్రక్రియకు తోడ్పడే ఇన్సులిన్‌ను శరీరం తయారు చేయదు. టైప్ 2 డయాబెటిస్‌లో ఒక వ్యక్తి శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించదు, కాలక్రమంలో తగినంత ఇన్సులిన్‌ను తయారు చేయదు. సాధారణంగా టైప్ 1 డయాబెటిస్ 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తులకు వస్తుంది. దీన్ని నివారించలేం. కానీ టైప్ 2 డయాబెటిస్‌ను నివారించవచ్చు.

టైప్ 2 డయాబెటిస్‌ పెద్దవాళ్లకు వస్తుంది. అయితే టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రెండూ బాల్యం లేదా యుక్తవయసులో ప్రారంభం కావచ్చు. వృద్ధులలో టైప్ 2 మధుమేహం అనేది సర్వసాధారణం. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఊబకాయం బారిన పడుతుండటం వల్ల.. యువకులలో టైప్ 2 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. టైప్ 2 డయాబెటిస్‌కు చికిత్స లేదు. కానీ బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వ్యాయామం చేయడం వంటి జీవనశైలి మార్పుల ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. మీ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ఆహారం, వ్యాయామం వంటివి పనిచేయట్లేదని వైద్యులు నిర్ధారిస్తే.. అప్పుడు డయాబెటిస్ మందులు లేదా ఇన్సులిన్ థెరపీని సూచిస్తారు.

* టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు

మధుమేహం ఉన్నవారిలో దాదాపు 90% మందికి టైప్ 2 డయాబెటిస్ ఉంటుంది. సాధారణంగా జీవనశైలి మార్పులతో టైప్ 2 మధుమేహాన్ని నియంత్రించవచ్చు. కొందరికి మందులు కూడా అవసరం కావచ్చు. అయితే ఇది బాధితుల ఆరోగ్యంపై ప్రభావం చూపేంత వరకు, వారికి టైప్ 2 డయాబెటిస్ ఉందని కూడా తెలియకపోవచ్చు. మధుమేహం బాధితుల్లో ప్రతి నలుగురిలో ఒకరికి అసలు వ్యాధి ఉందనే విషయం కూడా తెలియదు. ఎందుకంటే వీరిలో వ్యాధి లక్షణాలు కనిపించవు. చాలామందిలో లక్షణాలు నెమ్మదిగా బయటపడవచ్చు. అసలు టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

* దాహం ఎక్కువగా వేయడం (More thirst)

రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు, బాధితుల మూత్రపిండాలు దాన్ని వదిలించుకోవడానికి ఎక్కువగా పని చేస్తాయి. ఈ ప్రక్రియలో వ్యక్తుల కణజాలం నుంచి ద్రవాలను పీల్చుకుంటాయి. దీంతో డీహైడ్రేషన్‌ ఎదురవుతుంది, కాబట్టి బాధితులకు దాహం ఎక్కువగా వేస్తుంది.

* ఆకలి పెరగడం (More hunger)

మధుమేహం వల్ల శరీర కణాలకు గ్లూకోజ్ అందదు. దీంతో శరీరానికి శక్తి అందదు కాబట్టి తిన్న తర్వాత కూడా ఆకలి ఎక్కువగా వేస్తుంది.

* తరచుగా మూత్ర విసర్జన చేయడం

శారీరక వ్యవస్థలోని అదనపు చక్కెరను వదిలించుకోవడానికి బాధితుల మూత్రపిండాలు ఎక్కువగా కష్టపడతాయి. ఫలితంగా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది.

* నోరు తడి ఆరిపోవడం

డయాబెటిస్ బాధితుల్లో అతి మూత్ర విసర్జన, డీహైడ్రేషన్ కారణంగా.. నోటిలో తేమ ఆరిపోయి నోరు పొడిబారినట్లు అనిపిస్తుంది.

* బరువు తగ్గిపోవడం

మధుమేహం బాధితులు ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం వల్ల వారి శరీరం చక్కెరతో పాటు కేలరీలను కూడా కోల్పోతుంది. దీనివల్ల ఎప్పటిలాగే తింటున్నప్పటికీ, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే బరువు తగ్గవచ్చు.

* అలసట (Fatigue)

డయాబెటిస్ ఉన్న వ్యక్తుల శరీరం, వారు తినే ఆహారం నుంచి శక్తిని పొందలేదు. దీంతో బలహీనంగా, ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపించవచ్చు. డీహైడ్రేషన్ కారణంగా కూడా అలసటగా, నిస్సత్తువగా అనిపించవచ్చు.

* చూపు మసకబారడం (Blurry vision)

హై బ్లడ్ షుగర్ వల్ల కంటిచూపు మసకబారడంతో పాటు వస్తువులపై ఫోకస్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది.

* తలనొప్పి

రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరిగినప్పుడు తీవ్రమైన తలనొప్పి కూడా వేధించవచ్చు.

* స్పృహ కోల్పోవడం

మధుమేహం ఉంటే రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు గురికావచ్చు. దీనివల్ల శరీరానికి శక్తి ఒక క్రమపద్ధతిలో అందక స్పృహ కోల్పోవచ్చు.

* ఇన్ఫెక్షన్లు, శరీరంపై గాయాలు

రక్తంలో చక్కెర పేరుకుపోతే.. రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫలితంగా శరీరంపై గాయాలు, ఇన్ఫెక్షన్లు నయం కావడాన్ని కష్టతరం చేస్తుంది.

* చేతులు, కాళ్ల జలదరింపు

టైప్ 2 మధుమేహం.. బాధితుల చేతులు, కాళ్లలోని నరాలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల తిమ్మిర్లు, జలదరింపు వంటివి ఎదురవ్వొచ్చు.

* చిగుళ్ల సమస్యలు

చిగుళ్ల సమస్యలు తరచుగా వేధించడం అనేది టైప్ 2 డయాబెటిస్ లక్షణం. చక్కెర వ్యాధి కారణంగా దంతాలు పెరిగే ఎముకలకు కూడా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల దంతాలు ఊడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

* పిల్లల్లో టైప్ 2 డయాబెటిస్

టైప్ 2 డయాబెటిస్ అనేది ఒకప్పుడు పెద్ద వయస్కుల్లోనే ఎక్కువగా కనిపించేది. పిల్లలు, యుక్తవయసు వారిలో ఈ వ్యాధి చాలా అరుదుగా బయటపడేది. కానీ 1990ల మధ్యకాలం నుంచి ఇది అన్ని ఏజ్ గ్రూప్‌ల వారిలో సర్వసాధారణంగా మారింది. జీవనశైలి మార్పుల కారణంగా చాలామంది యువకులు అధిక బరువు లేదా ఊబకాయం బారిన పడడం ఇందుకు ప్రధాన కారణం. ఊబకాయం అనేది ఈ వ్యాధికి ప్రమాద కారకంగా చెప్పుకోవచ్చు. పిల్లలు తగినంత వ్యాయామం చేయకపోవడం, ఏమాత్రం శారీరక శ్రమ లేకపోవడం లేదా రక్త సంబంధీకుల్లో ఎవరికైనా మధుమేహం ఉంటే.. వారికి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇన్సులిన్ పనితీరులో లోపాల కారణంగా, వయసు పెరిగే కొద్దీ టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి అనారోగ్యాలు కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా బాధితులు గుండెపోటు, కంటి సమస్యలు, కాలు లేదా పాదం వరకు తీసివేయడం, కిడ్నీ వ్యాధుల బారిన పడవచ్చు.

* వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలి?

టైప్ 2 డయాబెటిస్ సాధారణ లక్షణాలు ఏవైనా కనిపిస్తే.. వెంటనే వైద్యుల సలహాతో టెస్టులు చేయించుకోవాలి. వారు అసలు మధుమేహం ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. తీవ్రతను బట్టి మందులు లేదా జీవనశైలి మార్పులు సూచిస్తారు. డయాబెటిస్ ఇతర తీవ్రమైన సమస్యలకు కారణం కాకముందే వీలైనంత త్వరగా టెస్టులు చేయించుకొని చికిత్స తీసుకోవడం మంచిది.

First published:

Tags: Diabetes, Diabetic, Sugar

ఉత్తమ కథలు