ఇటీవల కాలంలో ఆరోగ్యం (Health)పై చాలా మంది అవగాహన పెంచుకుంటున్నారు. ఫిట్నెస్(Fitness) కోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. కొందరు అధిక బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే... మరికొందరు కండరాల ఆకృతిని పెంచుకోవడమే లక్ష్యంగా జిమ్‌లో తెగ వర్కౌట్స్ చేస్తుంటారు. అయితే ఆశించిన ఫలితాలను సాధించడానికి సరైన పద్ధతులు, అలవాట్లను కలిగి ఉండటం కూడా ముఖ్యమే. అయితే కండరాలను పెంచడం కోసం జిమ్‌లో వర్కౌట్స్ పూర్తి చేసిన తరువాత తప్పనిసరిగా కొన్ని అలవాట్లను పాటించాలి. తద్వారా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అరటిపండును వర్కౌట్లకు ముందు తీసుకుంటే జిమ్ చేయడానికి మెరుగ్గా సహాయపడుతుంది. అలాగే వర్కౌట్స్ తరువాత కూడా బాగా తింటే కండరాల ఆకృతి పెరగటానికి ఇది దోహదపడుతుంది. ఇలా ఫిట్‌నెస్‌లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి వర్కవుట్ చేసిన తర్వాత పాటించాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* స్ట్రెచింగ్స్
జిమ్‌లో వివిధ పరికరాలతో సాధన చేయడానికి ముందు వార్మ్ అప్ చేయడం, కండరాలు, కీళ్లను సాగదీయడం ప్రధానంగా చేస్తుంటారు. అయితే వ్యాయామం తర్వాత కూడా కండరాలను సాగదీయవచ్చు. దీంతో కండరాలు గాయపడకుండా నివారించవచ్చు. కొన్ని కండరాలు వ్యాయామం తర్వాత దృఢంగా మారుతాయి. వాటిని సాగదీయడం వల్ల అవి వదులుగా మారుతాయి. కండరాలలోని లాక్టిక్ యాసిడ్‌ను నివారించడంలో సాగదీత సహాయపడుతుంది. దీంతో శరీరానికి స్వాంతన చేకూరుతుంది.
* బాగా తినడం
వ్యాయాయం అధికంగా చేయడం వల్ల శరీరంలోని గ్లైకోజెన్ నిల్వలు తగ్గిపోతాయి. ఈ సమయంలో పోషక విలువలు ఉన్న భోజనం చేయడం ద్వారా శక్తిని తిరిగి పొందవచ్చు. పెరుగు, పీనట్ బటర్, శాండ్విచ్, చాక్లెట్ మిల్క్‌షేక్, హోల్-గ్రెయిన్ బ్రెడ్ వంటి ఆహార పదార్థాలు వ్యాయామం తర్వాత తీసుకునే వాటిలో ఉత్తమమైనవి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా కండరాల రికవరీ సమయాన్ని తగ్గిస్తాయి.
* డ్రింక్స్
శారీరక శ్రమ చేసినప్పుడు శరీరం ద్రవాలను వినియోగిస్తుంది. వ్యాయామం తర్వాత శరీరాన్ని రీహైడ్రేట్ చేసుకోవడం ముఖ్యం. కోల్పోయిన ద్రవాలను తగిన మొత్తంలో తిరిగి పొందడం కోసం నీరు లేదా ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలి. దీంతో కండరాల ఫ్లెక్సిబుల్‌గా ఉంటూ నొప్పిని నివారిస్తుంది.
* విశ్రాంతి
ఇది శరీరానికి చాలా ముఖ్యం. అయితే చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఏదైనా శిక్షణ తరువాత కొన్ని రోజులు విశ్రాంతి ఇస్తారు. దీంతో శరీరానికి స్వాంతన చేకూరుతుంది. కండరాలు త్వరగా కోలుకుంటాయి. వ్యాయామం తర్వాత కూడా సరైన విశ్రాంతి తదుపరి సెషన్‌కు సిద్ధంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, మనసును రిలాక్స్ చేయడంలోనూ ఒత్తిడిని దూరం చేయడంలోనూ సహాయపడుతుంది.
* పరిశుభ్రత
జిమ్‌లో చాలా మంది ఒకే యంత్రాన్ని లేదా పరికరాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో చెమట వాటికి అంటుకుంటుంది. తద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అన్ని రకాల క్రిములు ఉండేందుకు ఆస్కారం ఉంది. దీన్ని నివారించడానికి వర్కౌట్స్ తరువాత తలస్నానం చేయడం ఉత్తమం. దీంతో శరీరం రీఫ్రెష్ అనుభూతి పొందుతుంది. ఫిట్నెస్ కోసం జిమ్‌లో శ్రమించే వారు తీవ్రమైన వర్కౌట్స్ తరువాత పైన చెప్పిన చిట్కాలు పాటించి ఉత్తమం ఫలితాలు పొందండి.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.