హెల్దీ, ఫిట్ బాడీని మెయింటైన్ చేయాలంటే శరీరానికి కావలసిన విటమిన్లు, ఇతర పోషకాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా 40 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు ఐరన్ (Iron), కాల్షియం (Calcium), విటమిన్ డి (Vitamin) వంటి కొన్ని పోషకాలు చాలా అవసరం అవుతాయి. ఇతర కాలాల్లో కంటే వీరు చలికాలం ఈ పోషకాలను తీసుకోవడం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
* కాల్షియం, విటమిన్ డి
సాధారణంగా 40 ఏళ్ల నుంచి మహిళలలో ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వారు తగినంత కాల్షియం, విటమిన్ డి తీసుకోవాలి. అయితే వింటర్ సీజన్‌లో పొద్దున పూట సూర్యరశ్మి పెద్దగా రాదు. దీనివల్ల శరీరంలో విటమిన్ డి స్థాయిలు తగ్గుతాయి. విటమిన్ డి ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది. ఈ వయసులో ఉన్న వారు శీతాకాలంలో ఫిజికల్ యాక్టివిటీస్ పెద్దగా చేయలేరు. దానివల్ల ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది. అందుకే కాల్షియం, విటమిన్ డి లభించే ఆహార పదార్థాలు తీసుకోవాలి.
అంతేకాదు కాల్షియం, విటమిన్ డి గుండె, కండరాలు, నరాలు బాగా పనిచేయడానికి సహాయపడతాయి. కాల్షియం పొందడానికి డెయిరీ ప్రొడక్ట్స్, ఆకు కూరలు, రాగి వంటి ఆహారాలను డైట్‌లో భాగం చేసుకోవాలి. విటమిన్ డిని పుట్టగొడుగులు, గుడ్డు సొనలు, చేపలు, బలవర్థకమైన తృణధాన్యాలు వంటి ఆహారాల నుంచి పొందవచ్చు.
* ఐరన్
ఐరన్ అనేది శరీర కణాలకు ఆక్సిజన్ ఎక్కువగా అందించడానికి సహాయపడే ముఖ్యమైన పోషకం. 40 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న కొంతమంది మహిళల శరీరంలో ఐరన్ తగినంత ఉండదు. అధిక ఋతు రక్తస్రావం లేదా గర్భం కారణంగా ఐరన్ డెఫిషియన్సీ బారిన పడుతుంటారు. ఇది రక్తహీనతకు దారితీస్తుంది.
ఎనిమియా అని పిలిచే ఈ కండిషన్ నుంచి బయట పడేందుకు ఐరన్-రిచ్ ఫుడ్స్ అయిన నట్స్, బీన్స్, ఆకు కూరలు, బలవర్థకమైన ధాన్యాలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ సిని తీసుకుంటే ఐరన్ శరీరానికి బాగా వంట పడుతుంది. ఇక చలికాలంలో ప్రజలు వెచ్చని ఫస్ట్ ఫుడ్స్ ఎక్కువగా లాగించేస్తుంటారు. వీటిలో కేలరీలు ఎక్కువగా, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు తక్కువగా ఉంటాయి. ఇది పోషకాహార లోపాలకు దారి తీస్తుంది, అందుకే ఐరన్-రిచ్ ఆహారాలు తీసుకోవడం మంచిది.
* ప్రోటీన్, విటమిన్ బి
వయసు పెరుగుతున్న కొద్దీ కండరాల బలం కోసం, చురుగ్గా కదలడానికి తగినంత ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువగా కూర్చోవడానికే పరిమితం అయ్యే ఈ వయసు మహిళల్లో సార్కోపెనియా అని పిలిచే మజిల్ లాస్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే వారు బీన్స్, కాయధాన్యాలు (Lentils), పాలు, కాటేజ్ చీజ్, పెరుగు వంటి ఉత్పత్తులు ద్వారా ప్రోటీన్ పొందాలి. వయసు పెరుగుతున్న కొద్దీ బలహీనపడే అవయవాల పనితీరును మెరుగుపరచడానికి విటమిన్ బి కూడా ముఖ్యం. పప్పుధాన్యాలు, ఆకు కూరలు వంటి ఆహారాల ద్వారా తగినంత విటమిన్ B పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health care, Healthy food, Women