ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు. ఈ పరిస్థితులు చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్నాయి. గుండె సమస్యలపై అవగాహన కల్పించుకోవడం అవసరమని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హార్ట్ ఎటాక్ అంటే ఏంటి? కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? రెండింటి మధ్య తేడా ఏంటి? ఈ సమస్యల లక్షణాలు, చికిత్స వంటి వివరాలను ఎలక్ట్రానిక్ సిటీ (బెంగళూరు), కావేరి హాస్పిటల్, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ రాజేష్ టి ఆర్ తెలియజేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..
కార్డియాక్ అరెస్ట్ లేదా సడన్ కార్డియాక్ డెత్ అనేది గుండె పనిచేయడం ఆగిపోయినప్పుడు సంభవించే ఊహించని మరణం. నేడు ప్రపంచంలో మరణాలకు అతిపెద్ద కారణాలలో ఇది కూడా ఒకటి. గుండె జబ్బుల సంబంధిత మరణాలలో సగానికి పైగా గుండె ఆగిపోవడం కారణంగానే సంభవిస్తున్నాయి. కార్డియాక్ అరెస్ట్ తర్వాత, రక్త ప్రసరణ ఆగిపోతుంది, బ్రెయిన్ డెడ్ అవ్వడానికి నాలుగు నుంచి ఆరు నిమిషాల సమయం ఉంటుంది. ప్రతి నిమిషానికి బతికే అవకాశాలు 7-10 శాతం తగ్గుతాయి. అయితే గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్‌లు ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ పదాలు ఒకేలా లేనప్పటికీ, తరచూ వీటి మధ్య కన్ఫ్యూజ్ అవుతుంటారు.
* గుండెపోటు అంటే ఏంటి?
గుండె పని చేయడానికి ఆక్సిజన్ ఉన్న రక్తం అవసరం. కరోనరీ ధమనులు ఈ రక్తాన్ని గుండెకు అందిస్తాయి. ఈ ధమనుల్లో రక్త ప్రసరణకు అవరోధాలు ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. గుండెకు రక్తం సరఫరా ఆగిపోతుంది. ఈ అడ్డంకులను తక్షణమే పరిష్కరించాలి, గుండె కండరాలకు శాశ్వత నష్టం కలగకముందే చికిత్స అందించాలి.
* సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి?
కార్డియాక్ అరెస్ట్ వస్తే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. బ్లడ్ ప్రెజర్ పడిపోతుంది, మెదడుతో సహా అన్ని అవయవాలకు రక్త సరఫరా ప్రభావితమవుతుంది. మెదడుకు రక్త ప్రవాహం ఉండక, సదరు వ్యక్తి స్పృహ కోల్పోతాడు. అత్యవసర చికిత్స అందించకపోతే తక్షణమే మరణం సంభవించవచ్చు. సడన్ కార్డియాక్ అరెస్ట్ కారణం గుండెకు సంబంధించినది కావచ్చు లేదా కాకపోవచ్చు.
* సడన్ కార్డియాక్ అరెస్ట్‌కు కారణాలు
అత్యంత సాధారణ కారణం అసాధారణమైన గుండె లయలు. దీన్ని వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ అంటారు. సాధారణంగా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ గుండె ద్వారా ఒక క్రమ పద్ధతిలో ప్రసారం అవుతాయి. ఇది గుండె గదుల వరుస సంకోచాన్ని ప్రారంభిస్తుంది. అప్పుడే రక్తం శరీరంలోని అన్ని అవయవాలకు ప్రభావవంతంగా పంప్ అవుతుంది. వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్‌ను వైద్యులు VF అని కూడా పిలుస్తారు. మల్టిపుల్ ఇంపల్సెస్ వేగంగా, ర్యాండమ్‌గా, ఆర్బిటరీ వేలో గుండె ద్వారా ఉత్పన్నమైనప్పుడు, ఇది గుండె అసమర్థమైన సంకోచానికి దారితీస్తుంది. రక్తపోటు పడిపోతుంది.
కరోనరీ ఆర్టరీ డిసీజ్ సడన్ కార్డియాక్ అరెస్ట్‌కు కారణమవుతుంది. ప్రత్యేకించి ప్రధాన కరోనరీ ధమనుల సున్నిత విభాగాలలో అవరోధాలు అభివృద్ధి చెందుతాయి. కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల గుండెపోటు వస్తుంది. రెండూ వేర్వేరుగా ఉన్నప్పటికీ, వాటి మధ్య లింక్ ఉంది. గుండెపోటుతో బాధపడుతున్న రోగికి దురదృష్టవశాత్తూ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో గుండె ఆగిపోవచ్చు. అయోర్టిక్ స్టెనోసిస్ వంటి వాల్యులర్ గుండె జబ్బులు సడన్ కార్డియాక్ అరెస్ట్‌కు కారణమవుతాయి.
* ఇండియాలో సడన్ కార్డియాక్ అరెస్ట్‌లు
భారతీయులు గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ సంఖ్య సంవత్సరాలుగా గణనీయంగా పెరుగుతోంది. WHO జనాభా లెక్కల ప్రకారం.. ప్రతి లక్ష మంది భారతీయులలో దాదాపు 4280 మంది కార్డియాస్ అరెస్ట్ వల్ల మరణిస్తున్నారు.
* సడన్ కార్డియాక్ అరెస్ట్ నిర్వహణ- బేసిక్ లైఫ్ సపోర్ట్
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అత్యవసర నిర్వహణను సులభతరం చేసింది. ఈ శిక్షణ ఇప్పుడు సులభంగా, ప్రభావవంతంగా బోధించవచ్చు. వైద్యపరమైన నేపథ్యం లేని వారు కూడా సులువుగా తెలుసుకోవచ్చు. ఈ శిక్షణను బేసిక్ లైఫ్ సపోర్ట్ లేదా సంక్షిప్తంగా BLS అంటారు. BLS చాలా సులభం, ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ పొందాలి. BLS టెక్నిక్ ద్వారా శిక్షణ పొందిన వ్యక్తి సడన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురైన రోగిని వైద్య సహాయం వచ్చే వరకు సజీవంగా ఉంచవచ్చు.
* BLS ఎలా చేయాలి?
ఒక వ్యక్తి కూలిపోయినప్పుడు అత్యంత సాధారణ కారణం సడన్ కార్డియాక్ అరెస్ట్. ముందుగా బాధితుడు, BLS ప్రొవైడర్ ఇద్దరికీ ఎన్విరాన్‌మెంట్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవాలి. అలా లేకపోతే బాధితుడిని సురక్షిత ప్రదేశానికి తరలించాలి.
తర్వాత వైద్య సహాయం కోసం కాల్ చేయాలి. శ్వాస, పల్సేషన్ కోసం చెక్ చేయాలి. కదలికల కోసం ఛాతీని, మెడలో పల్సేషన్లను పరిశీలించాలి. ఇందుకు 10 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు. రెండూ లేకపోతే, చెస్ట్ కంప్రెషన్స్ స్టార్ట్ చేయాలి. చెస్ట్ కంప్రెషన్, బ్రెత్ రేషియో 30: 2గా ఉండాలి. అంటే 30 సార్లు చెస్ట్‌ను కంప్రెస్ చేస్తే రెండు సార్లు నోటితో శ్వాస అందించాలి. బాధితులకు "హ్యాండ్స్-ఓన్లీ CPR" ప్రోటోకాల్ కూడా వినియోగించవచ్చు. ముఖ్యంగా ప్రస్తుత COVID సమయాల్లో, శ్వాస అందించకుండా, కేవలం చెస్ట్ కంప్రెషన్స్ చేయడం మంచిది. వైద్య సహాయం వచ్చే వరకు BLS బాధితుడిని సజీవంగా ఉంచుతుంది.
సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ. సకాలంలో చికిత్స అందకపోతే చాలా ప్రాణాంతకంగా మారుతుంది. సామాన్యులు కూడా ఉపయోగించగల సరళమైన పద్ధతి BLS. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా BLSలో శిక్షణ పొందాలి. ఇది నేర్చుకోవడం చాలా సులభం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health Tips, Heart Attack