World Rose Day 2021: మీకు తెలిసిన వాళ్లలో క్యాన్సర్‌తో పోరాడుతున్న వాళ్లు ఉన్నారా.. వాళ్లకు ఇది చెప్పండి..

ప్రతీకాత్మక చిత్రం

క్యాన్సర్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మందిని పొట్టనబెట్టుకుంటోంది. ధూమపానం, మద్యపానం, పురుగు మందుల అవశేషాలున్న ఆహార పదార్థాలు తీసుకోవడం వంటివి క్యాన్సర్‌‌కు ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో చిన్నారులు, మహిళలు కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు.

 • Share this:
  క్యాన్సర్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మందిని పొట్టనబెట్టుకుంటోంది. ధూమపానం, మద్యపానం, పురుగు మందుల అవశేషాలున్న ఆహార పదార్థాలు తీసుకోవడం వంటివి క్యాన్సర్‌‌కు ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో చిన్నారులు, మహిళలు కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ ప్రాణాలను హరించే ప్రాణాంతక వ్యాధే కానీ ప్రాథమిక దశలో గుర్తిస్తే ఈ మహమ్మారిని జయించవచ్చు. చాలామంది సెలబ్రెటీలు కూడా క్యాన్సర్‌ను మనోధైర్యంతో జయించి ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నారు. అలాంటి వారిలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, నటి సోనాలి బింద్రే, మనీషా కొయిరాలా వంటి నటీమణులు కూడా ఉన్నారు. క్యాన్సర్ బారిన పడ్డారన్న సంగతి తెలియగానే చాలా మంది గుండె నిబ్బరాన్ని కోల్పోతారు. క్యాన్సర్ కంటే అలాంటి వారిని భయమే మానసికంగా కుంగదీసి చంపేస్తుంది.

  క్యాన్సర్ వ్యాధి సోకిన వారికి జీవితం మీద ఆశలు కల్పించే విధంగా.. వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 22న ప్రపంచ గులాబీ దినోత్సవం(వరల్డ్ రోజ్ డే) నిర్వహించాలని ప్రతిపాదన చేసింది. అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 22న వరల్డ్ రోజ్ డేను జరుపుకుంటున్నారు. అయితే.. ప్రపంచ గులాబీ దినోత్సవం జరుపుకోవడం వెనుక ఓ పెద్ద కారణమే ఉంది. కెనడాకు చెందిన మెలిండా రోజ్ అనే బాలిక 12 ఏళ్ల వయసులో క్యాన్సర్ బారిన పడింది. ఆమె ఎక్కువ రోజులు బతకదని, కొన్ని వారాల్లో చనిపోతుందని వైద్యులు తేల్చి చెప్పారు. కానీ మెలిండా రోజ్ దృఢమైన ఆత్మ విశ్వాసంతో, మనోధైర్యాన్ని కూడగట్టుకుని ఆరేళ్లు బతికింది.

  అంతేకాదు.. ఆమె చనిపోయే లోపు తనలా క్యాన్సర్ బారిన పడి బాధపడుతున్న వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు, బతుకు మీద ఆశ కల్పించేందుకు ఆమె కవితలతో, ప్రసంగాలతో, సందేశాలతో తన వంతు ప్రయత్నం చేసింది. క్యాన్సర్ సరైన సమయంలో గుర్తించకపోవడం వల్ల చనిపోవడం ఖాయమని తెలిసినా ఆ వ్యక్తి బతికి ఉన్నంత కాలం సంతోషంగా ఎలా బతకాలో జీవించి చూపించిన ఆమె జీవితం క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఆదర్శం. కొన్ని వారాల్లో చనిపోతుందని డాక్టర్లు చెప్పినా తన బతికి ఉండాలన్న సంకల్ప బలమే మెలిండా రోజ్‌ను ఆరేళ్లు బతికేలా చేసింది. ఈ వరల్డ్ రోజ్ డేను పురస్కరించుకుని క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో మనోధైర్యాన్ని నింపే కొన్ని సందేశాలను చూద్దాం.

  * క్యాన్సర్ నాకు ఎన్నో విషయాలు నేర్పింది. నేను కీమోథెరపీ తీసుకుంటున్న సమయంలో నాకంటే చాలా వయసున్న పెద్ద వారిని చూశాను. వారు నాలో ఎంతగానో స్పూర్తిని నింపారు. అంత పెద్ద వారే ధైర్యంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పుడు నేను ఎందుకు క్యాన్సర్‌ను జయించలేను అని అనిపించింది. - యువరాజ్ సింగ్, టీమిండియా మాజీ క్రికెటర్

  * నీ ప్రయాణం కష్టతరమైనదే కావచ్చు. కానీ పోరాడటానికి ప్రయత్నించు. ఆశతో పోరాడు. ఏదో ఒక రోజు కాలం నీదవుతుంది. - సోనాలి బింద్రే, ప్రముఖ నటి

  * ప్రియమైన మిత్రులారా.. క్యాన్సర్ బారిన పడిన సమయంలో మీకు సంతోషాన్ని, ప్రశాంతతను కలగజేసే విషయాలపై దృష్టిపెట్టండి. ఇది ఎంతో ముఖ్యం. - మనీషా కొయిరాలా, ప్రముఖ నటి

  * సంతోషంగా జీవించడమే క్యాన్సర్‌ను జయించడంలో తొలిమెట్టు. క్యాన్సర్ 50 శాతం మందుల వల్ల నయమయితే.. మరో 50 శాతం సంకల్ప బలం వల్లనే సాధ్యమవుతుంది. - అనురాగ్ బసు, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్
  Published by:Sambasiva Reddy
  First published: