World Chocolate Day: నేడు చాక్లెట్ డే.. డార్క్ చాక్లెట్ తింటే కరోనా ఒత్తిడి తగ్గుతుందా?

ప్రతీకాత్మక చిత్రం (Image:Shutterstock)

కోవిడ్-19 కారణంగా ప్రపంచం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కోవటానికి చాక్లెట్ల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు.

  • Share this:
జూలై 7కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది నిర్వహిస్తోన్నవి 12వ వరల్డ్ చాక్లెట్ డే వేడుకలు. చాక్లెట్లు 16వ శతాబ్దం నుంచే ఉనికిలో ఉన్నాయి. అయితే వీటి గుర్తింపునకు ఒక రోజును కేటాయించాలనే ఆలోచన 2009లో వచ్చింది. వాస్తవానికి చాక్లెట్లను 1550లో ఒక ‘డెజర్ట్’గా ఐరోపాలో తయారు చేశారు. ఆ తరువాత ఇది ప్రపంచ దేశాలకు వ్యాపించింది. వినూత్నమైన తీపి వల్ల ప్రజలకు చేరువైంది. ప్రస్తుతం వివిధ రకాల చాక్లెట్లు, ఎన్నో రకాల ఫ్లేవర్లలో అందుబాటులో ఉన్నాయి. అన్ని వయసుల వారు వీటిపై మక్కువ చూపిస్తుంటారు. చాక్లెట్లు వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయని పరిశోధనల్లో తేలింది. దీంతో కోవిడ్-19 కారణంగా వ్యక్తుల్లో నెలకొన్న ఒత్తిడి, ఆందోళనలను డార్క్ చాక్లెట్లు నిరోధిస్తాయని కొందరు భావిస్తున్నారు.

విభిన్న ఫ్లేవర్లలో లభించే చాక్లెట్లు అందరినీ ఆకర్షిస్తుంటాయి. రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగా వీటికి మంచి ఆదరణ లభించింది. సంబంధాలు, భావోద్వేగాలకు గుర్తుగా చాక్లెట్లను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. అయితే కోవిడ్-19 కారణంగా ప్రపంచం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కోవటానికి చాక్లెట్ల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. మహమ్మారి కారణంగా ఎదురవుతున్న ఒత్తిడిని అధిగమించడంలో.. 70 శాతం కొకోవా ఉండే చాక్లెట్లు మంచి ప్రభావం చూపుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సైతం ఒక ట్వీట్‌లో తెలిపారు.

* ఒత్తిడి నుంచి ఉపశమనం
చాక్లెట్ల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని గతంలో నిర్వహించిన అనేక అధ్యయనాలు వెల్లడించాయి. రెండు వారాల పాటు ప్రతిరోజూ 1.4 ఔన్సుల డార్క్ చాక్లెట్ తీసుకుంటే.. మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే కార్టిసోల్, క్యాటెకోలమైన్స్ అనే హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఫలితంగా వ్యక్తుల మానసిక స్థితి మెరుగయ్యే అవకాశం ఉంటుంది. రక్తపోటును తగ్గించడం, జీవక్రియ వేగాన్ని పెంచడం, కడుపులో గట్‌ బ్యాక్టీరియా వృద్ధి.. వంటి ప్రయోజనాలు వీటి వల్ల ఉంటాయి. డార్క్ చాక్లెట్లు యాంటీవైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తింటే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* మానసిక ఆరోగ్యంపై ప్రభావం
కొకోవాతో తయారు చేసే డార్క్ చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. ఫైటోన్యూట్రియెంట్స్ అనే రసాయన సమ్మేళనాలు వైరస్‌లలోని నిర్దిష్ట ఎంజైమ్‌లు లేదా ప్రోటేజ్‌లను దెబ్బతీసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. డార్క్ చాక్లెట్‌లో లభించే ఫ్లేవనోల్స్, ప్రోయాంతోసైనిడిన్స్.. వంటివి కరోనా వైరస్‌లోని ‘MPro’ అనే మెయిన్ ప్రోటేజ్ యాక్టివిటీని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.

ఈ లక్షణాల ఆధారంగా చూస్తే.. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో లేదా పరిమితం చేయడంలో డార్క్ చాక్లెట్లు తమ వంతు పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. అయితే డార్క్ చాక్లెట్లను.. రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలలో ఒకటిగా మాత్రమే భావించాలి. ఒత్తిడిని నియంత్రించే ప్రధాన మార్గంగా వీటిని పరిగణించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: