World Breastfeeding Week : తల్లి పాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు ఇవీ...

World Breastfeeding Week : పిల్లలకు తల్లి పాల కంటే శ్రేష్టమైనవి ఇంకేవీ లేవు. ముఖ్యంగా బిడ్డ పుట్టిన 6 నెలల వరకూ... తల్లి పాలు తప్పనిసరి. అలా చేస్తే... భవిష్యత్తులో ఆ పిల్లలకు డయాబెటిస్, ఒబెసిటీ లాంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల పిల్లలు వైరస్, బ్యాక్టీరియాతో పోరాడగలరు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 2, 2019, 1:56 PM IST
World Breastfeeding Week : తల్లి పాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు ఇవీ...
తల్లి పాల వారోత్సవాలు
  • Share this:
ఆగస్ట్ 1 నుంచీ ఆగస్ట్ 7 వరకూ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్‌ జరుపుకుంటున్నాం. ఈ ఏడాది పిల్లలకు తల్లి పాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. తల్లీ, బిడ్డ మధ్య అనుబంధాన్ని పెంచేవి తల్లి పాలు. ముఖ్యంగా బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలలూ తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలి. ఆ తర్వాత మరో సంవత్సరం పాటూ పట్టిస్తే మంచిదని అమెరికాలోని పెడియాట్రిక్స్ అకాడమీ, అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్‌టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ తెలిపారు. కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు, ప్రోటీన్స్ వంటివి పిల్లలకు చాలా మంచివి. అలాగే... తల్లి పాలు వాళ్లకు సమతుల్య పోషకాలు అందిస్తాయి. కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ వంటివి తల్లిపాల వల్లే పిల్లలకు లభిస్తాయి.

* బిడ్డకు అన్నింటి కంటే ముఖ్యంగా తల్లిపాలే ఇవ్వాలి. అందువల్ల బిడ్డకు కావాల్సిన అన్ని పోషకాలూ లభిస్తాయి. పసికందులకు అవి ఎంతో శ్రేష్ఠమైనవి.

* బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల పిల్లలకు చాలా రకాల వ్యాధులు రాకుండా పోతాయి. తల్లి పాలలో విష వ్యర్థాల్నీ, సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌ని తరిమికొట్టే శక్తి ఉంటుంది. అందుకే తల్లిపాలు తాగించాలి.

* పిల్లలకు ఏడాదిన్నరపాటూ... తల్లి పాలు పట్టిస్తే... ఆ చిన్నారులకు భవిష్యత్తులో ఆస్తమా, అలర్జీల వంటివి రాకుండా ఉంటాయి.* పుట్టిన పిల్లలకు మొదటి ఆరు నెలలూ తల్లిపాలే పట్టిస్తే... ఇక వాళ్లకు అనారోగ్యాలూ, డయేరియా, ఇన్ఫెక్షన్ల వంటివి ఎక్కువగా రావు. మాటిమాటికీ వాళ్లను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాల్సిన పని ఉండదు.

* మీకు తెలుసా... తల్లి పాలు తాగుతూ పెరిగే పిల్లల మెదడు బాగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. వాళ్లకు IQ ఎక్కువగా ఉంటుందట.

* పిల్లలకు తల్లే సర్వస్వం. మాట్లాడటం రాని ఆ పసికందులు... తమ బాధను చెప్పుకోవడానికి తల్లివైపే చూస్తారు. తల్లి కూడా ఆ చిట్టి హృదయాల్ని అర్థం చేసుకోగలదు. వాళ్ల మధ్య ఆ బంధం బలపడేందుకు తల్లిపాలు కీలకం అవుతాయి. తల్లి స్పర్శ... చిన్నారికి ఎంతో హాయిని ఇస్తుంది. తల్లి చూపులు... పసికందుకు ఎంతో నచ్చుతాయి. తల్లితో ఉంటే సెక్యూరిటీగా ఉన్నట్లు ఫీలవుతూ చిన్నారులు ఆనందంగా ఉంటారు.* తల్లి పాలు తాగితే పిల్లలు ఎంత బరువు ఉండాలో అంతే ఉంటారు. అధిక బరువు, అసలు బరువు లేకపోవడం వంటి సమస్యలు పెద్దగా రావు.

* తల్లిపాలు తాగుతూ పెరిగే పిల్లలకు... భవిష్యత్తులో డయాబెటిస్, ఒబెసిటీ సమస్యలు రాకుండా ఉంటాయి. అందువల్ల ప్రతి తల్లీ... బిడ్డ పుట్టిన ఏడాదిన్నర పాటూ తన పాలు పట్టించడం ఎంతో మేలు చేసే నిర్ణయం.

* బిడ్డకు పాలు ఇచ్చే తల్లి కూడా బలమైన ఆహారం తీసుకోవాలి. ఆమె సంతోషంగా ఉన్నప్పుడే... బిడ్డకు సరైన పాలు ఇవ్వగలదు. అందువల్ల తల్లి పోషకాలు ఉండే ఆహారం తింటూ... సంతోషంగా ఉండాలి. ఈ విషయం కూడా తల్లి మర్చిపోకూడదు.

* బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా మంచిదే. ప్రధానంగా ఆమెలో అధిక కేలరీలు తగ్గేందుకు వీలవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో లావుగా అయ్యే తల్లి... ఆ తర్వాత సన్నబడేందుకు బిడ్డకు పాలు ఇవ్వడం ఎంతో మేలు చేస్తు్ంది. అలా పాలు ఇస్తూనే... ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ... సమతుల ఆహారం తీసుకుంటే... తల్లి అధిక బరువు తగ్గించుకునేందుకు వీలవుతుంది.

* మీకు తెలుసా... తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల... ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది గర్భాన్ని (Uterus) ప్రెగ్నెన్సీకి ముందు ఏ సైజ్‌లో ఉందో ఆ సైజ్‌కి తిరిగి వచ్చేసేలా చేస్తుంది. యుటెరస్ నుంచీ వచ్చే రక్తాన్ని ఆపేందుకు కూడా తల్లి బిడ్డకు పాలిచ్చే విధానం ఉపయోగపడుతుంది.

అందువల్ల ప్రతీ తల్లీ తమ బిడ్డలకు తమ పాలే ఇవ్వాలి. వీలైనంతవరకూ ఆ విధంగా ప్రయత్నించాలి. బిడ్డలు ఆరోగ్యంగా పెరిగితే... వాళ్లు బలమైన భావి భారత పౌరులుగా ఎదుగుతారు. ఈ దేశానికి రక్షణ కవచాల్లా, వీర సైనికుల్లా మారతారు. అందుకే ప్రతీ ఒక్కరికీ హ్యాపీ బ్రెస్ట్ ఫీడింగ్ డే.
First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>