Stroke in women: మగాళ్లతో పోల్చితే మహిళల్లోనే దాని వల్ల మరణాలు ఎక్కువ.. అసలు కారణాలివేనట..!

ప్రతీకాత్మక చిత్రం

మగవాళ్లతో పోలిస్తే దీని బారిన పడి చనిపోయే ప్రమాదం ఆడవాళ్లకే ఎక్కువగా ఉందని అధ్యయనాల్లో కనుగొన్నారు. మెదడుకు రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడటం, మెదడు రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల స్ట్రోక్ రావచ్చు. దీని వల్ల మెదడు కణాలు చనిపోతాయి.

  • Share this:
బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడి చనిపోయేవారి సంఖ్య ఏటా పెగుతుతోందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అయితే మగవాళ్లతో పోలిస్తే దీని బారిన పడి చనిపోయే ప్రమాదం ఆడవాళ్లకే ఎక్కువగా ఉందని అధ్యయనాల్లో కనుగొన్నారు. మెదడుకు రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడటం, మెదడు రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల స్ట్రోక్ రావచ్చు. దీని వల్ల మెదడు కణాలు చనిపోతాయి. ఫలితంగా శరీరం తిమ్మిరిబారడం, ఒక వైపు శరీర భాగాలన్నీ బలహీనంగా మారడం, సమన్వయ లోపం, చూపు మసకబారడం, మాట్లాడలేకపోవడం.. వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రపంచంలో ప్రతి రెండు సెకన్లకు ఒకరు స్ట్రోక్ బారిన పడుతున్నారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మరణాలకు బ్రెయిన్ స్ట్రోక్ రెండో కారణంగా నిలుస్తోంది. మహిళల్లో ప్రతి 10 మరణాల్లో ఆరు స్ట్రోక్ కారణంగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీని గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఆడవాళ్లకు స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా మహిళలకు ఎక్కువ ఆయుర్దాయం ఉంటుంది. అందువల్ల వారి వయసు పెరిగే కొద్దీ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. దీనికి తోడు మెనోపాజ్ తరువాత మహిళల్లో చోటుచేసుకునే హార్మోన్ల మార్పులు కూడా కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణం కావచ్చు.

ఎందుకు వస్తుంది?
కరోనరీ ఆర్టరీ డిసీజ్, ఇతర గుండె సంబంధ సమస్యలు ఉన్న మగవాళ్లకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నాన్ వాల్వులర్ ఆట్రియల్ ఫైబ్రిలేషన్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ వ్యాధులు ఉన్న మహిళలకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో కనుగొన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులను హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. కానీ మన దేశంలో స్ట్రోక్ వచ్చిన మహిళలను ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకువస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రాథమిక లక్షణాలు కనిపించిన 24 గంటల్లోపు బాధితులకు చికిత్స అందించాలి. ప్రస్తుతం ఈ వ్యాధికి థ్రాంబోలైటిక్, ఎండోవాస్కులర్ థెరపీ.. వంటి చికిత్స మార్గాలే అందుబాటులో ఉన్నాయి. ఈ చికిత్సల్లో కూడా మగవాళ్లకంటే ఆడవాళ్లు మెరుగ్గా ప్రతిస్పందించడం విశేషం.

సంరక్షణ లేకపోడమూ కారణమే
తీవ్రమైన స్ట్రోక్ వచ్చిన వారికి వీలైనంత తొందరగా సపర్యలు చేయాల్సి ఉంటుంది. కానీ మన దేశంలో మహిళలకు తగిన సంరక్షణ అందట్లేదు. వారి విషయంలో కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. దీనివల్ల కూడా మహిళల్లో స్ట్రోక్ మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. స్ట్రోక్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళలకు అందించాల్సిన ప్రాథమిక చికిత్స, సంరక్షణ పద్ధతుల గురించి అవగాహన కల్పించడం ద్వారా మరణాల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఇప్పటికే అనారోగ్యాలు ఉన్నవారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి లక్షణాలు కనిపించినా ఆలస్యం చేయకుండా చికిత్స అందించాలి. వీటివల్ల మహిళల్లో బ్రెయిన్ స్ట్రోక్ మరణాల శాతం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Krishna Adithya
First published: