మహిళలకు దేవుడు ఇచ్చిన అరుదైన వరం మాతృత్వం. అమ్మతనం ఆస్వాదించాలని ప్రతి మహిళ కలలు కంటుంది. కానీ ఇటీవల కాలంలో సంతాన లేమి సమస్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే డేటా (SRS) 2020 ప్రకారం, గత పదేళ్లలో ఇండియాలో సాధారణ సంతానోత్పత్తి రేటు (The General Fertility Rate-GFR) 20 శాతం తగ్గడం గమనార్హం. జీఎఫ్ఆర్ అనేది ఒక ఏడాదిలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న 1,000 మంది మహిళలకు పుట్టిన పిల్లల సంఖ్యను సూచిస్తుంది. ఇందుకు కారణాలేంటి? ఇన్ ఫెర్టిలిటీ రేట్ పెరగడం వల్ల ఎలాంటి ప్రభావాలు పడనున్నాయి? అనేది తెలుసుకుందాం.
సంతానోత్పత్తి రేటు తగ్గడానికి కారణాలు
SRS డేటా ప్రకారం.. భారతదేశంలో 2008 నుంచి 2010 వరకు మూడేళ్ల సగటు GFR రేటు 86.1గా ఉండగా, 2018-2020 మధ్య కాలంలో అంటే మూడేళ్ల సగటు పట్టణ ప్రాంతాల్లో 68.7కి తగ్గింది. మన దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణం మారిన జీవనశైలి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. లైఫ్‌స్టైల్‌తో పాటు ఇంకా పలు విషయాలు ప్రభావితం చేస్తున్నాయని వివరిస్తున్నారు.
35 ఏళ్లు లేదా అంత కంటే ఎక్కువ ఏజ్ వచ్చిన తర్వాత స్త్రీలు వివాహం చేసుకుని ప్రెగ్నెన్నీ ప్లాన్ చేసుకుంటే ప్రమాదకరమని తెలిపారు ఫరీదాబాద్ అకార్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రసూతి, గైనకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ దివ్యకుమార్. స్పెయిన్ వంటి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే వేగంగా భారతీయ మహిళల్లో అండాశయం వృద్ధాప్య దశకు చేరుకుంటుందని తెలిపారు.
సంతానోత్పత్తి రేటుని ప్రభావితం చేసే అంశాలు
మహిళలకు సగటున అందే విద్య , ఆర్థిక వ్యవస్థ, మత విశ్వాసాల వల్ల గర్భనిరోధక వ్యాప్తి రేటు పెరుగుతుందని చెప్పారు డాక్టర్ దివ్యకుమార్. ఫలితంగా సంతానోత్పత్తి రేటుపైన ప్రభావం పడుతుందన్నారు. కుటుంబ నియంత్రణ ఆలోచనల ప్రభావం కూడా ఉంటుందని పేర్కొన్నారు.
GFR తగ్గుదల వల్ల కలిగే పరిణామాలు
సాధారణ సంతానోత్పత్తి రేటు(GFR) తగ్గుదల వల్ల ప్రపంచ ఆర్థిక, సామాజిక విషయాల్లో మార్పులు సంభవిస్తాయి. తక్కువ జీఎఫ్ఆర్ ఉండటమే పర్యావరణానికి మంచిదే కానీ, స్పష్టంగా ఆ విషయాన్ని చెప్పలేం. వృద్ధజనాభా మాత్రమే ఉండే అవకాశాలుంటాయి. ఫలితంగా యంగ్ ఏజ్ వర్క్ ఫోర్స్ కావాల్సి వస్తుంది. వలసలు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి.
ఫెర్టిలిటీ రేట్‌ను ఇలా మెరుగుపరచవచ్చు
ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ వల్ల ప్రెగ్నెన్నీని, మ్యారేజ్‌ను పోస్ట్‌పోన్ చేసుకోవాలనుకునే వారు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఏదైనా చికిత్స తీసుకున్నా కానీ స్త్రీ గర్భం దాల్చేందుకు సమయం పడితే, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి వారి సలహా తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం అన్ని విధాలా బెస్ట్ ఛాయిస్. శారీరక వ్యాయామం, సమతుల్య ఆహారంతో సంతానోత్పత్తి రేటు మెరుగవుతుంది.
IVFతో విప్లవాత్మక మార్పులు
గత 40 ఏళ్లలో సంతాన లేమి నివారణకు విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెబుతున్నారు గైనకాలజిస్ట్, CLIRNET మెంబర్, డాక్టర్ అశ్ సుజిత్ జి. గతంలో శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండేదని.. కానీ ఇప్పుడు సంతానోత్పత్తి రేటు తగ్గుతుందని తెలిపారు. IVF (ఇన్ విట్రో-ఫెర్టిలైజేషన్) అంటే కృత్రిమ గర్భదారణ, ICSI, IUI (Intrauterine Insemination) వంటి ఆధునిక పద్ధతులతో ట్రీట్మెంట్ తీసుకుని దంపతులు సంతానం పొందవచ్చని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Daughters, Health, Infertility, Lifesyle, Mother