Breastfeeding: పిల్లలకు తల్లిపాలు తాగిస్తే ఆ ముప్పు కూడా తప్పినట్టే.. తప్పక తెలుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

పసిపిల్లలకు తల్లిపాలు తాగించడం ఎంతో ముఖ్యం. శిశువులు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు, సరైన పోషకాలు అందేందుకు తల్లిపాలు తప్పనిసరి. అలాగే దీనిద్వారా పిల్లల రోగనిరోధక శక్తి కూడా ఎంతో వృద్ధి చెందుతుంది. అందుకే శిశువులకు తల్లిపాలే తాగించాలని డాక్టర్లు కూడా సూచిస్తారు.

  • Share this:
పసిపిల్లలకు తల్లిపాలు తాగించడం ఎంతో ముఖ్యం. శిశువులు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు, సరైన పోషకాలు అందేందుకు తల్లిపాలు తప్పనిసరి. అలాగే దీనిద్వారా పిల్లల రోగనిరోధక శక్తి కూడా ఎంతో వృద్ధి చెందుతుంది. అందుకే శిశువులకు తల్లిపాలే తాగించాలని డాక్టర్లు కూడా సూచిస్తారు. ఈ క్రమంలోనే తల్లిపాలతో పిల్లలకు మరో ప్రయోజనం ఉంటుందని ఓ అధ్యయనం తేల్చిచెప్పింది. తల్లిపాలు తాగిన పిల్లల్లో బ్లడ్ ప్రజర్ తక్కువగా ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందని బెల్జియం లోవన్ యూనివర్సిటీ కూపర్ మెడికల్ స్కూల్ పీడియాట్రిక్స్​ ప్రొఫెసర్​ డాక్టర్ లోరి ఫెల్డ్​మన్ వింటర్​ చెప్పారు. “కౌమారదశ సమయంలో లేదా ముందు ఈ తేడా కనిపిస్తుందని భావించా. కానీ ఈ వ్యత్యాసం మూడు సంవత్సరాల వయసు వరకు కనిపించాయి. తల్లిపాలివ్వడం వల్ల పిల్లలకు జీవక్రియ మొత్తంపై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది”అని డాక్టర్​ లోరీ ఫెల్డ్​మన్ పేర్కొన్నారు.

2400 మంది పిల్లలపై నిర్వహించిన ఈ పరిశోధన అమెరికన్ హార్ట్ అసోసియేషన్​ జర్నల్‌లో ప్రచురితమైంది. చైల్డ్​ (కెనడియన్​ హెల్త్​ ఇన్​ఫాంట్​ లాంగిట్యూడినల్​ డెవలప్​మెంట్​)లో భాగంగా ఈ రీసెర్చ్ జరిగింది. 2009 నుంచి 2012 మధ్య జన్మించిన కెనడియన్ తల్లులు, వారి పిల్లల డేటాను సేకరించి చైల్డ్ ఆధ్వర్యంలో పరిశోధకులు ఈ డేటా సేకరించారు.

తల్లిపాలు తాగని పిల్లల్లో కంటే తల్లిపాలు తాగిన పిల్లల్లో బ్లడ్ ప్రజర్ తక్కువగా ఉన్నట్టు బెల్జియం పరిశోధకులు గుర్తించారు. మూడు సంవత్సరాల లోపు వయసున్న చిన్నారుల డేటాను పరిశీలించి ఈ విషయాన్ని తేల్చారు. అలాగే ఎంత సమయం పిల్లలు తల్లిపాలు తీసుకున్నారనే విషయంపైనా ఇది ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. అయితే ఎంత కాలం తల్లిపాలు తాగించారన్న విషయంతో సంబంధం లేకుండా.. తక్కువ కాలం తల్లిపాలు పట్టినా పిల్లల్లో బీపీ తక్కువగా ఉందని తేలిందని చెప్పారు.

“అధ్యయనంలో మేం ఊహించని విషయాలు కూడా బయటపడ్డాయి. రెండు రోజులు, రెండు వారాలు, రెండు నెలలు, రెండు సంవత్సరాలు.. ఇలా పిల్లలకు ఎంత కాలం తల్లిపాలు తాగించారనేది విషయం కాదు. ఎంత కాలం తల్లిపాలు తాగించినా.. పిల్లలలో బ్లడ్ ప్రజర్ తక్కువగానే ఉంటుందని గుర్తించాం” అని చైల్డ్ కోహోర్డ్ అధ్యయన డిప్యూటీ డైరెక్టర్ మేఘన్ ఆజాద్ తెలిపారు.

అలాగే కనీసం ఏడాది వరకు తల్లిపాలు తాగిస్తే శిశువులకు ఊబకాయం, డయాబెటిస్​, జీర్ణ వ్యాధులు లాంటివి రావని గత పరిశోధనల్లో తేలింది. అలాగే రోగనిరోధక శక్తి పెరిగి.. చాలా వ్యాధులు దరిచేరవని వెల్లడైంది. అలాగే పిల్లలకు పాలివ్వడం ద్వారా తల్లులకు కూడా కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందని తేలింది. ముఖ్యంగా శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం చాలా ముఖ్యం. శిశువులు ఆరోగ్యంగా ఎదిగేందుకు ఇదే తొలి అడుగు అవుతుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
Published by:Sambasiva Reddy
First published: