Home /News /life-style /

Tokophobia: ప్రసవం గురించి భయపడుతున్నారా? టోకోఫోబియా కావచ్చు.. చెక్ చేసుకోండి..

Tokophobia: ప్రసవం గురించి భయపడుతున్నారా? టోకోఫోబియా కావచ్చు.. చెక్ చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గర్భం ధరించడం, బిడ్డను మోయడం, ప్రసవ సమయంలో నొప్పులు భరించి బిడ్డను కనడం లాంటివన్నీ కొందరికి భయం కలిగిస్తుంటాయి. అందుకు గల కారణాలను ఒకసారి చూద్దాం.

గర్భం ధరించడం అన్నది ప్రతి స్త్రీ విషయంలో ఓ గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. తన కడుపులో తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసి జన్మనివ్వడం ప్రతి మహిళకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిగా చెప్పుకోవచ్చు. కానీ కొందరు మాత్రం గర్భం ధరించేందుకు భయపడుతుంది. గర్భం ధరించడం, బిడ్డను మోయడం, ప్రసవ సమయంలో నొప్పులు భరించి బిడ్డను కనడం లాంటివన్నీ వారికి భయాన్ని కలిగిస్తుంటాయి. మీకూ ఇలాగే అనిపిస్తుంటే మీకు టోకో ఫోబియా ఉందేమో అని ఒకసారి చెక్ చేసుకోండి.

ఏంటీ టోకోఫోబియా?
సాధారణంగా ప్రతి ఒక్కరికీ గర్భధారణ మొత్తం సజావుగా సాగుతుందా? లేదా? ప్రసవం ఎలా జరుగుతుందో.. ఆ నొప్పులను నేను భరించగలనా? లేదా? అన్న భయాలు ఉంటాయి. అయితే ఇది తక్కువ స్థాయిలోనే ఉండి వారు గర్భధారణలోని ప్రతి ఒక్క విషయాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా ఉంటారు. కానీ ఈ భయాలు చాలా ఎక్కువగా ఉండి.. రోజువారీ పనులు చేసేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతుంటే దాన్ని టోకోఫోబియా గా భావించవచ్చు. దీనిని మైసుయోఫోబియా, పార్టురీఫోబియా అని కూడా పిలుస్తారు. ఈ సమస్య ఉన్నవారు అసలు గర్భం ధరించేందుకే భయపడుతుంటారు. గర్భం వస్తుందేమో అన్న ఆలోచన వారిని ఇబ్బంది పెడుతుంటుంది. ముఖ్యంగా సెక్స్ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇందులోనూ రకాలున్నాయి.

ప్రైమరీ టోకో ఫోబియా
ప్రైమరీ టోకోఫోబియా అంటే ఇంతకుముందు పిల్లలు పుట్టని వారిలో గర్భం ధరించడంపై ఉన్న భయం అని చెప్పుకోవచ్చు. వీరికి ఇంతకుముందు ఎలాంటి అనుభవం లేకపోయినా గర్భధారణ అంటే భయం ఉండిపోతుంది. దీనివల్ల వివిధ రకాల గర్భనిరోధక పద్ధతులు పాటిస్తూ ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడుతుంటారు.

సెకండరీ టోకో ఫోబియా
గతంలో ఒకసారి గర్భం ధరించి ఆ తర్వాత గర్భస్రావం కావడం లేదా కడుపులో బిడ్డ మరణించడం, ప్రసవం సమయంలో ఇబ్బందులు ఎదురవ్వడం లాంటివి జరగడం వల్ల గర్భధారణ అంటే కొందరు భయపడుతుంటారు. ఇలాంటి సమస్యను సెకండరీ టోకోఫోబియా అంటుంటారు.

టోకోఫోబియా అనేది కేవలం గతంలో అనుభవించిన సంఘటనలు లేదా గర్భం ధరించిన తర్వాత ఇబ్బందిపడిన సంఘటనల గురించి వినడం లేదా చదవడం వల్ల ఎదురవుతుంటుంది. ఇంతకుముందే ఉన్న యాంగ్జైటీ, డిప్రెషన్ మానసిక సమస్యలు కూడా టోకోఫోబియాకి కారణమవుతాయి. నొప్పి భరించే శక్తి తక్కువగా ఉండడం వంటివి కూడా టోకోఫోబియాను పెంచుతాయి. ఈ సమస్య ఉన్నవారిలో నిద్రపట్టకపోవడం, పానిక్ ఎటాక్స్, పీడకలలు, విపరీతమైన భయం వంటివి కనిపిస్తాయి. గర్భం ధరిస్తామేమోనన్న భయంతో సెక్స్ లో పాల్గొనేందుకు కూడా వీరు వెనకాడుతుంటారు.

వీరిలో భయం ఏ మేరకు ఉందో గుర్తించి దానికి చికిత్సను అందించాల్సి ఉంటుంది. గర్భం ధరించిన, లేదా ధరించడానికి ప్రయత్నిస్తున్న స్థాయిలో కౌన్సెలింగ్ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. మానసిక నిపుణుల సలహాలు తీసుకోవడం వల్ల భయాన్ని తగ్గించుకునే మార్గాలు పాటించి టోకోఫోబియాని దూరం చేసుకోవచ్చు.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Health Tips, Pregnant

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు