• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HEALTH TIPS FIRST TIME PARENTS SHOULD KNOW THESE FIVE THINGS SK GH

First time Parents: మొదటిసారి తల్లిదండ్రులు కాబోతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

First time Parents: మొదటిసారి తల్లిదండ్రులు కాబోతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ప్రతీకాత్మక చిత్రం

కొత్త తల్లిదండ్రులు పేరెంటింగ్ ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవాలి. పిల్లల సంరక్షణ కోసం కొన్ని హానికరమైన అలవాట్లను మానుకోవాలి. కొత్త తల్లులు, తండ్రులు గుర్తుంచుకోవాల్సిన ఐదు ముఖ్యమైన అంశాలను నిపుణులు సూచిస్తున్నారు.

  • Share this:
పెళ్లి తరువాత దంపతులకు జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతులు ఎన్నో. అందులో మొదటిసారి గర్భం ధరించడం, బిడ్డ పుట్టిన క్షణాలు తప్పనిసరిగా ఉంటాయి. అమ్మానాన్నలుగా పిలిపించుకుంటేనే దాంపత్య బంధం పరిపూర్ణమవుతుందని చాలామంది భావిస్తారు. మొదటిసారి తల్లిదండ్రులైనవారు గర్భం ధరించినప్పటి నుంచి, ప్రసవం అయిన తర్వాత కూడా బిడ్డ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలామంది ఈ తరం తల్లిదండ్రులకు పేరెంటింగ్ స్కిల్స్ ఏమాత్రం ఉండట్లేదు. పిల్లల పెంపకం వీరికి కత్తిమీద సాములా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త తల్లిదండ్రులు పేరెంటింగ్ ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవాలి. పిల్లల సంరక్షణ కోసం కొన్ని హానికరమైన అలవాట్లను మానుకోవాలి. కొత్త తల్లులు, తండ్రులు గుర్తుంచుకోవాల్సిన ఐదు ముఖ్యమైన అంశాలను నిపుణులు సూచిస్తున్నారు.

నొప్పులకు సిద్ధమవ్వాలి:
సాధారణ ప్రసవం అయినప్పుడు తల్లి నొప్పులను భరించాల్సి ఉంటుంది. వీటిని భరించేందుకు ముందు నుంచే మానసికంగా సన్నద్ధం కావాలి. మొదటి కాన్పులో ప్రసవ నొప్పులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ప్రసవం తరువాత కూడా కొన్ని రోజుల వరకు ఈ నొప్పుల ప్రభావం వల్ల అలసటతో పాటు.. తల్లి శరీర కండరాలు, కణజాలాలు నొప్పులకు గురయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ సాధారణంగా ఎదురయ్యే సమస్యలే. ఈ నొప్పులను తగ్గించడానికి కొన్ని రకాల మందులు, వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ల సలహాతో వీటిని ఎంచుకోవాలి. అలాగే ప్రసవం సులువుగా అయ్యేందుకు వీలుగా గర్భం ధరించినప్పటి నుంచే కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల ప్రసవం వేగంగా అయ్యే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల నొప్పులు కూడా తక్కువగా ఉంటాయి.

పెరినియల్ మసాజ్‌:
ప్రసవ సమయంలో బిడ్డ బయటకు వచ్చేటప్పుడు జననేంద్రియాల దగ్గర ఉండే పెరినియల్ కండరాలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సిద్ధం చేసేందుకు ప్రసవానికి ముందు నుంచి ఈ కండరాలను మసాజ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ప్రసవ సమయంలో కండరాలపై ఒత్తిడి పడకుండా కాపాడుకోవచ్చు. ప్రసవానికి 34 వారాల ముందు నుంచి.. వారంలో 1-2 సార్లు పెరినియల్ మసాజ్ చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మహిళలు తామకు తాముగా లేదా భాగస్వామి సాయంతో ఈ మసాజ్ చేసుకోవచ్చు.

బిడ్డతో బంధం:
ప్రసవం తరువాత బిడ్డను తల్లి పక్కనే ఉంచాలి. తల్లి, నవజాత శిశువు మధ్య శారీరక సాన్నిహిత్యం ఉంటేనే పుట్టిన బిడ్డ తాను సురక్షితంగా ఉన్నట్లు భావిస్తుంది. ఈ సాన్నిహిత్యం శిశువుల ఎదుగుదలకు అవసరమైన భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి బిడ్డకు అనుభూతిని అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలి.

ఇవి కూడా చదవండి:

డెలివరీ తర్వాత వీటిని తినడం మానేయండి.. బిడ్జకు జన్మనిచ్చాక డైట్ ఎలా ఉండాలంటే..

Mushrooms: పుట్టగొడుగులు.. మీ ఆరోగ్యానికి నిజమైన గొడుగు.. లాభాలు ఇవే

మార్పులు సాధారణం:
సాధారణంగా గర్భం దాల్చిన తరువాత వికారం, వాంతులు, గుండెల్లో మంట, మలబద్ధకం, తలనొప్పి వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రసవం తరువాత గర్భాశయం సాధారణ సైజుకు రావడానికి కుంచించుకుపోతుంది. దీంతో నొప్పి కలుగుతుంది. పిల్లలు కూడా ఆకలి, కడుపునొప్పి, గ్యాస్ కారణంగా తరచుగా ఏడుస్తారు. దీంతో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. వీటన్నింటికీ కొత్తగా తల్లిదండ్రులైనవారు సిద్ధంగా ఉండాలి. ఈ తాత్కాలిక సవాళ్లను ఎదుర్కొంటూ, శిశువుల సంరక్షణకు కొత్త తల్లిదండ్రులు సన్నద్ధమవ్వడంతో పాటు సహనంతో ఉండాలి.

చెడు అలవాట్లకు దూరంగా:
పొగతాగే తల్లులకు తక్కువ బరువుతో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఈ అలవాటు తల్లితో పాటు పుట్టబోయే బిడ్డపై కూడా తీవ్రమైన దుష్ప్రభావాలు చూపిస్తుంది. తల్లిపాల ద్వారా శిశువు రక్తంలోకి ప్రవేశించే నికోటిన్ వారి నిద్రపై ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రుల పొగతాగే అలవాటు వల్ల శిశువులు హఠాత్తుగా చనిపోయే అవకాశం ఉంటుంది. పిల్లలు సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ కి గురికాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరిదీ . నికోటిన్ ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. గర్భం దాల్చిన తరువాత మద్యం తాగడం వల్ల కడుపులోని బిడ్డ ఎదుగుదలకు హాని కలుగుతుంది. ఇది వారి నాడీ వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. దీంతో పుట్టుకతోనే పిల్లల్లో మానసిక లోపాలు ఏర్పడతాయి. అందువల్ల గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ పొగ, మద్యం తాగే అలవాటును మానుకోవాలి.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు