Pregnancy: ఈ సమస్యలున్న గర్భిణులు అస్సలు వ్యాయామం చేయకూడదట.. ఎందుకంటే?

ప్రతీకాత్మక చిత్రం

బిడ్డకు జన్మనివ్వడం ప్రతి మహిళ కల. గర్భాధారణ దశ మహిళల జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. ఈ సమయంలో వారు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తల్లికీ, పుట్టబోయే బిడ్డకు ప్రమాదమని గుర్తించుకోవాలి. ఇందుకు గాను సరైన...

  • Share this:
బిడ్డకు జన్మనివ్వడం ప్రతి మహిళ కల. గర్భాధారణ దశ మహిళల జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. ఈ సమయంలో వారు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తల్లికీ, పుట్టబోయే బిడ్డకు ప్రమాదమని గుర్తించుకోవాలి. ఇందుకు గాను సరైన డైట్ ప్లాన్​ పాటిస్తూనే.. తేలికపాటి వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గర్భం ధరించిన తర్వాత వెన్నునొప్పి, కీళ్ల నొప్పుల నుంచి బయటపడటానికి వ్యాయామం చక్కగా పనిచేస్తుంది. అందుకే, గర్భధారణకు ముందు, గర్భం ధరించాక క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిదని, ఇది తల్లికే కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా మంచి చేస్తుందని నిపుణులు చెబుతుంటారు.

అయితే, కొన్ని ప్రత్యేక సమస్యలున్న మహిళలకు మాత్రం గర్భం దాల్చిన తర్వాత వ్యాయామం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అవి ఏ సమస్యలో తెలుసుకుందాం.. అయితే ఇందులో కొన్ని సమస్యలను వైద్యులే గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి, వ్యాయామం ప్రారంభించే ముందు తప్పకుండా మీ వైద్యుడిని సంప్రదించండి.

ప్రీమెచ్యూర్​ డెలివరీ
ఒకవేళ మీకు ఇంతకుముందే ప్రీ మెచ్యూర్ డెలివరీ అనగా సాధారణంగా 9 నెలల కంటే ముందే డెలివరీ అయితే, రెండో గర్భాధారణ సమయంలో కఠినమైన వ్యాయామాలను నివారించడమే మంచిది. ఇటువంటి వారు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకవేళ, మీరు వ్యాయామం చేయలనుకుంటే, దాని గురించి మీ వైద్యుడితో చర్చించండి. వారు మీకు తేలికపాటి నడక వంటి కొన్ని సులభమైన వ్యాయామ పద్ధతులను సూచిస్తారు.

గర్భస్రావం చరిత్ర లేదా సంకేతాలు
గర్భస్రావం చరిత్ర ఉన్న మహిళలు లేదా ప్రస్తుతం గర్భధారణలో రక్తస్రావం జరిగిన మహిళలు తొమ్మిది నెలల పాటు తప్పనిసరిగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భస్రావం సమస్య తలెత్తకుండా ఉండటానికి గర్భందాల్చిన మొదటి 12 వారాల పాటు వ్యాయామం చేయకుండా ఉండాలి. ఒకవేళ వ్యాయామం చేయాలనుకుంటే మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

గర్భాశయ​ సమస్యలు ఉన్న మహిళలు ఏవైనా కఠినమైన శారీరక శ్రమ లేదా వ్యాయామం చేస్తే అది రక్తస్రావానికి దారితీస్తుంది. కాబట్టి, వారు వ్యాయామం చేయకపోవడమే మంచిది. గర్భాశయ సంబంధ​ సమస్య ఉన్న మహిళలు గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు అదనపు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది, ఆ తరువాత వారు తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. అయితే, మీ వైద్యుడి సలహా మేరకే ఈ వ్యాయామాలను చేయండి.

గుండె, ఊపిరితిత్తుల సమస్యలు
గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న మహిళలు అన్ని రకాల ఏరోబిక్ వ్యాయామాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ రకమైన వ్యాయామాలతో మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. తద్వారా, శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. అందువల్ల, అధిక రక్తపోటు, ఉబ్బసం, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న మహిళలు గర్భాధారణ సమయంలో వ్యాయామానికి దూరంగా ఉండటమే మంచిది.

గర్భిణీ స్త్రీలు చేయకూడని వ్యాయామాలు
మీరు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటేనే గర్భధారణ సమయంలో అన్ని రకాల వ్యాయామాలు చేయండి. లేదంటే, మిమ్మల్ని అనేక అదనపు సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. గర్భం దాల్చిన తల్లికి ఈత, చురుకైన నడక, సైక్లింగ్ వంటి తక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు ఉత్తమమైనవి. ఈ సమయంలో కిక్‌బాక్సింగ్, స్క్వాష్, టెన్నిస్, ఫుట్‌బాల్, హాకీ వంటి గాయాలకు అవకాశం ఉన్న క్రీడలకు దూరంగా ఉండండి.
Published by:Sambasiva Reddy
First published: