Circadian rhythm: ఆఫీసులో పర్ఫామెన్స్ కు, నిద్రపోయే టైమ్ కు అసలు సంబంధం ఇదన్నమాట..!

ప్రతీకాత్మక చిత్రం

అర్ధరాత్రి తరువాత పడుకొని, ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారు ఇతరులతో పోలిస్తే చురుగ్గా ఉండలేరు. ఇలాంటివారు.. రాత్రి త్వరగా పడుకొని తెల్లవారుజామునే నిద్ర లేచే వారితో పోలిస్తే పనిలో రెండింతల వరకు వెనుకబడి ఉండే అవకాశం ఉందని తాజా పరిశోధన చెబుతోంది.

  • Share this:
ఆరోగ్యకరమైన నిద్ర వేళలు మన పని సామర్థ్యంపై ప్రభావం చూపిస్తాయని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. అర్ధరాత్రి తరువాత పడుకొని, ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారు ఇతరులతో పోలిస్తే చురుగ్గా ఉండలేరు. ఇలాంటివారు.. రాత్రి త్వరగా పడుకొని తెల్లవారుజామునే నిద్ర లేచే వారితో పోలిస్తే పనిలో రెండింతల వరకు వెనుకబడి ఉండే అవకాశం ఉందని తాజా పరిశోధన చెబుతోంది. సంప్రదాయ పనివేళలు వీరికి ఇబ్బందికరంగా ఉంటాయని ఫిన్లాండ్ పరిశోధకులు చెబుతున్నారు. పొద్దున్నే త్వరగా నిద్రలేచేవారు ఉదయం పూట బాగా పనిచేయగలుగుతారు. కానీ మధ్యరాత్రి దాటిన తరువాత పడుకొని.. ఆలస్యంగా నిద్రలేచేవారు ఇందుకు వ్యతిరేకంగా ఉంటారని అధ్యయనం లేల్చింది. ఒక వ్యక్తి జీవగడియారాన్ని బట్టి నిద్ర వేళల్లో మార్పులు కనిపిస్తాయి. ఈ నిద్రవేళలను క్రోనోటైప్ అంటారు. కొంతమందికి వివిధ షిఫ్టుల్లో ఆఫీస్ వర్క్ ఉంటుంది. వీరు పనిచేయాల్సిన సమయాన్ని బట్టి నిద్రపోవాల్సిన సమయాన్ని మార్చుకుంటారు. ఇవన్నీ హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. సాధారణంగా ఈ జీవ గడియారం జన్యుపరంగా వస్తుంది. కానీ పని వేళలు, కుటుంబ పరిస్థితులు, అలవాట్లు.. వంటివి కూడా దీనిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

పరిశోధన ఎలా చేశారు? 
నార్త్ ఫిన్లాండ్‌లో 1966లో పుట్టిన 5,881 మంది వ్యక్తులపై ఈ అధ్యయనం చేశారు. వీరిని తమ పని జీవితం (వర్కింగ్ లైఫ్‌), ఆరోగ్యం గురించి వివిధ ప్రశ్నలు అడిగారు. వీరికి 46 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత.. అంటే 2012లో వారి సహజ క్రోనోటైప్ ఏమిటో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నించారు. అధ్యయనంలో పాల్గొనేవారిని నాలుగు సంవత్సరాల వరకు పరిశీలించారు. వీరందరి నిద్ర సరళి గురించి ఆరా తీశారు. పురుషుల్లో 10 శాతం మంది, మహిళల్లో 12 శాతం మంది ఈవినింగ్ క్రోనోటైప్స్ (రాత్రి ఆలస్యంగా పడుకునేవారు) అని తేలింది. వీరిలో 72 శాతం మంది రోజువారీ పనివేళల్లోనే (డే టైమ్) ఉద్యోగాలు చేశారు. వీరు తప్ప మిగిలినవారందరూ ఉదయాన్నే త్వరగా నిద్రలేచేవారు. వీరిని మార్నింగ్ క్రోనోటైప్స్ లేదా ఇంటర్మీడియట్ క్రోనోటైప్స్ అని పిలుస్తున్నారు.

వారి పనితీరులో లోపాలు 
ఈవినింగ్ క్రోనోటైప్స్‌లో పావు వంతు మంది వ్యక్తులు ఉద్యోగాల్లో తమ పనితీరు ఏమంతా బాగాలేదని చెప్పారు. ఇంటర్మీడియట్ క్రోనెటైప్స్‌గా వర్గీకరించిన వారితో పోలిస్తే.. వీరి పని సామర్థ్యం రెండింతలు తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. పని సామర్థ్యాన్ని లెక్కించడానికి అంతర్జాతీయంగా ఆమోదించిన ఒక స్కేలును పరిశోధకులు అభివృద్ధి చేశారు. నిద్ర వ్యవధి, ఉదయం పని గంటలు వంటి ఇతర కారకాలను పరిగణనలోకి తీసుకున్నా.. వీరి పనితీరు మార్నింగ్ క్రోనోటైప్స్ కంటే చాలా తక్కువగా ఉందని గుర్తించారు. ఈ అధ్యయనాన్ని ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్‌మెంటర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు.

పని వేళలు ముఖ్యం
ఒకవేళ ఈవినింగ్ క్రోనోటైప్స్ వారు ఉదయం పూట పనిచేయాల్సి వస్తే.. వారి పని సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అయితే మార్నింగ్ లేదా ఇంటర్మీడియట్ క్రోనోటైప్స్ వారు సాయంత్రం షిప్టులో పనిచేయాల్సి వస్తే.. వీరి పనితీరు కూడా దారుణంగా దెబ్బతింటుందని క్రిస్టెన్ క్నుట్సన్ అనే పరిశోధకుడు తెలిపారు. ఆయన నార్త్‌వెస్ట్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వ్యక్తుల జీవ గడియారం ఒక రోజులో ఉత్తమ పనితీరును కనబరిచే సమయాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు. కానీ ఆయన ప్రస్తుత పరిశోధనలో పాల్గొనలేదు.

అందరికీ వర్తిస్తుందా? 
ఫిన్లాండ్‌లోని కొన్ని ప్రాంతాల ప్రజలపైనే ఈ అధ్యయనం చేశారు. ఆ దేశంలో పని వేళలు ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమవుతాయి. అందువల్ల ఈ పరిశోధన అందరికీ వర్తించకపోవచ్చని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. కానీ జీవ గడియారం అందరిలోనూ ఉంటుంది కాబట్టి.. ఈ అధ్యయనం అందరికీ వర్తిస్తుందని మరికొంతమంది వాదిస్తున్నారు.

మరిన్ని పరిశోధనలు అవసరం
ఈవినింగ్ క్రోనోటైప్స్ వ్యక్తుల పని సామర్థ్యం తక్కువగా ఉంటుందని తమ పరిశోధన నిరూపిస్తుందని అధ్యయన బృంద సభ్యులు డాక్టర్ టాపియో రైహా, లీనా అలా-ముర్సులా తెలిపారు. ఇది ఫస్ట్ పాపులేషన్ లెవల్ స్టడీ అని చెప్పారు. వీరిద్దరూ ఫిన్లా౦డ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఓలూలో ఉన్న సెంటర్ ఫర్ లైఫ్ కోర్స్ హెల్త్ రీసెర్చ్ విభాగంలో పనిచేస్తున్నారు. ఈ పరిశీలన ఫలితాలు కొత్తవని చెప్పారు. వీటిని నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు చేయాలని వివరించారు.

ఆందోళన అవసరం లేదు
ఈ పరిశోధన ఫలితాలను చూసి ఈవినింగ్ క్రోనోటైప్స్ వ్యక్తులు భయపడాల్సిన అవసరం లేదని సుజానే హుడ్ అనే రిసెర్చర్ చెబుతున్నారు. ఆమె కెనడాలోని బిషప్స్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో సామర్థాన్ని కొలిచే జాబ్ పర్ఫార్మెన్స్ రేటింగ్.. ఒకరి పని నాణ్యతను కచ్చితంగా కొలవలేదని హుడ్ తెలిపారు. జీవ గడియారం ఆధారంగా పని సామర్థ్యాన్ని అంచనా వేయడం కష్టమని చెప్పారు.
Published by:Hasaan Kandula
First published: