Sleep apnea: నిద్రలో శ్వాస ఆగిపోతుందా.. ఫోన్‌లో ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.. ఎలా పనిచేస్తుందంటే ?

(ప్రతీకాత్మక చిత్రం)

Sleep Apnea: లోతైన శ్వాస, వేగవంతమైన, హైడ్రేటెడ్, డీహైడ్రేటెడ్ వంటి వివిధ రకాల శ్వాసలను గుర్తించడంలో సమర్థవంతంగా పనిచేసే ఈ సెన్సార్ తో పాటు ఎంబెడెడ్ మాస్క్ ను పరిశోధకులు అభివృద్ధి చేశారు.

  • Share this:
మనం నిద్రపోయేటప్పుడు శ్వాస ఆడుతుందా.. అని ఎవరినైనా అడిగితే శ్వాస ఆడకుండా ఎలా బతికుంటాం అని వెంటనే బదులిస్తారు. అయితే నిద్రలో శ్వాస ఆడుతున్నప్పటికీ కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఫలితంగా ప్రాణానికే ముప్పు ఏర్పడవచ్చు. ముఖ్యంగా గురక పెట్టే అలవాటు ఉన్నవారికి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశముంది. దీన్నే స్లీప్ యాప్నియా అని ఆంటారు. తాజాగా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటున్నారు హైదరాబాద్ బిట్స్ పిలానికి చెందిన పరిశోధకులు. ఇందుకోసం సరికొత్త లైట్ వెయిట్ సెన్సార్ కనుగొన్నారు. దీని ద్వారా శ్వాసవిధానాలను కచ్చితత్వంతో విశ్లేషిస్తున్నారు. ఎవరైనా వ్యక్తి 15 సెకన్ల పాటు శ్వాస తీసుకోలేకపోతే ఐసీయూలో ఉన్న వైద్యులను అప్రమత్తం చేసి సరైన చికిత్స అందించేలా హెచ్చరిస్తుంది.

అంటే ఐసీయూలో ఉన్న హృద్రోగుల హృదయ స్పందన రేటుతో ప్రేరేపించినట్లే ఇది కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. హైబ్రిడ్ బయోమెడికల్ సెన్సార్, బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ తో అనుసంధానం చేసిన ఈ సెన్సార్ ని అబ్ స్ట్రిక్టివ్ స్లీప్ యాప్నియాను నిర్ధారించేందుకుగాను త్వరలోనే ఐసీయూలోని రోగులకు ఉపయోగించనున్నారు.

ఈ స్లీప్ అప్నియా అనేది తీవ్రమైన రుగ్మత. ఇది వ్యక్తుల్లో పదే పదే శ్వాస ఆగిపోవడం ద్వారా మొదలవుతుంది. అంతేకాకుండా ఇది ఎక్కువ సేపు నిద్రపోవడం లేదా అలసటని కలిగిస్తుంది. హృదయ సంబంధ వ్యాధులకు కూడా కారణమవుతుంది. ప్రస్తుతం దీని పరిష్కారంగా పాలిసోమోగ్రఫీ అనే సాధారణ ఇన్వేసివ్ టెక్నిక్ ను వాడుతున్నారు. అయితే ఇది రోగులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా రీడింగుల్లో కూడా కచ్చితత్వం ఉండదు. అందుకోసం బిట్స్ పిలాని పరిశోధకులు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వచ్చారు. దీన్ని వ్యక్తుల శ్వాసవిధానాలను విశ్లేషించే అత్యంత పోరస్ మెటిరియల్ తో తయారు చేశారు.

గాలిని గుర్తించడం కోసం చాలా అధునాతనమైన సెన్సార్ ను ఇందులో ఉపయోగించారు. లోతైన శ్వాస, వేగవంతమైన, హైడ్రేటెడ్, డీహైడ్రేటెడ్ వంటి వివిధ రకాల శ్వాసలను గుర్తించడంలో సమర్థవంతంగా పనిచేసే ఈ సెన్సార్ తో పాటు ఎంబెడెడ్ మాస్క్ ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది సిగ్నల్ ప్రాసెసింగ్ యూనిట్ కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. రోగి శ్వాస అదుపుతప్పినప్పుడు ఈ సెన్సార్ అలారంలా పనిచేస్తుంది. ఊపిరిని రికార్డు చేయడానికి ఈ సెన్సార్ ఉపయోగించి కేవలం 0.38 సెకన్లలోనే వేగవంతమైన ప్రతిస్పందనను చూపుతుందని హైదరాబాద్ బిట్స్ పిలాని పరిశోధకులు హిమాన్షు అగర్వాల్ అన్నారు.

ఈ హైబ్రిడ్ పరికరం రియల్ టైం యాప్ పనితీరు కోసం స్మార్ట్ ఫోన్ ఆధారిత ప్రోటో టైప్ ను ఇప్పటికే నలుగురు సభ్యుల బృందం తయారు చేసింది. మాస్క్ ని బ్లూటూత్ ద్వారా ఆండ్రాయిడ్ యాప్ కు కనెక్ట్ చేయవచ్చు. ఈ మాస్క్.. రోగుల్లో స్లీప్ యాప్నియా ప్రమాదాన్ని విశ్లేషించడానికి శ్వాస విశ్లేషణ డేటాను యాప్ కు బదిలీ చేస్తుంది. 15 సెకన్ల పాటు శ్వాస తీసుకోకపోతే ఈ పరికరం బంధువులు, వైద్యులకు హెచ్చరికలు పంపుతుంది.

పరిశోధకులు ఇప్పుడు ఈ ప్రోటోటైప్‌ను పరీక్షించగలిగే ఆసుపత్రులను గుర్తించే ప్రక్రియలో ఉన్నారు. అంతేకాకుండా పరికరాన్ని మరింత సూక్ష్మీకరించడానికి ప్రణాళికలు వేస్తున్నారు, తద్వారా ఇది నాసికా రంధ్రాల క్రింద ఉండేలా ఒక మాస్క్ లా కూడా అమర్చనున్నారు. అనంతరం దానిని వాణిజ్య ఉపయోగం కోసం అందుబాటులో ఉంచవచ్చు.
Published by:Krishna Adithya
First published: