మారుతున్న జీవనశైలితో పాటు ఒత్తిడి, జంక్ ఫుడ్ వంటి అలవాట్లు అధిక బరువుకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎన్ని వ్యాయామాలు చేసినా, ఆహారంలో మార్పులు చేసుకున్నా సరే.. కొన్నిసార్లు బరువు ఏమాత్రం తగ్గరు. కొంతమందిలో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి (బెల్లీ ఫ్యాట్) సమస్యను మరింత కఠినం చేస్తుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా బరువు, బెల్లీ ఫ్యాట్ తగ్గకపోతే.. ఇది హార్మోన్ల లోపం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్లు శారీరక జీవక్రియలను నియంత్రిస్తాయి. ఒత్తిడి, ఆకలి వంటి శారీరక చర్యలను క్రమబద్ధీకరిస్తాయి. కొన్నిసార్లు హార్మోన్ల లోపం వల్ల అనారోగ్యాలు వ్యాపిస్తాయి. బెల్లీ ఫ్యాట్‌కు కూడా హార్మోన్ల లోపమే కారణం కావచ్చు.
హార్మోన్ల అసమతుల్యత వల్ల నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయే సమస్యను హార్మోనల్ బెల్లీ అంటారు. ఈ సమస్యకు అనేక కారణాలు ఉండవచ్చు. థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాలు, పీసీఓఎస్, మెనోపాజ్ సమస్యల వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. ఊబకాయం, ఒత్తిడి, కొన్ని రకాల మందుల వాడకం కూడా ఇందుకు కారణం కావచ్చు. హార్మోనల్ బెల్లీ బారిన పడ్డారని గుర్తించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.
* ఒత్తిడి
అధిక ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. మన శరీరంలో ఉండే అడ్రినల్ గ్రంథులు కార్టిసోల్ హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇవి మన శరీరం ఆయా పరిస్థితులకు తగినట్లు ప్రతిస్పందించడానికి సహాయపడతాయి. అధిక ఒత్తిడి వల్ల ఎడ్రినల్ గ్రంథులు శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కార్టిసోల్‌ను ఉత్పత్తి చేస్తాయి. కార్టిసాల్ అధిక స్థాయిలో ఉంటే.. గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయులు కూడా పెరుగుతాయి. ఫలితంగా బెల్లీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది.
* సంతృప్తి ఉండకపోవడం
కడుపు నిండా తిన్నతరువాత కూడా సంతృప్తిగా భోజనం చేసిన భావన లేకపోతే ఆలోచించాలి. శారీరక జీవక్రియలను నియంత్రించే హార్మోన్లపై సెక్స్ హార్మోన్లు ప్రభావం చూపినప్పుడు ఇలాంటి సమస్య ఎదురవుతుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉంటే... భోజనం చేసిన తర్వాత మళ్లీ ఆకలి వేసినట్లు అనిపిస్తుంది. ఈస్ట్రోజన్ లెప్టిన్ అనే హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది. శరీరంలో లెప్టిన్ ఎక్కువగా ఉంటే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువ. టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయులు పెరిగితే లెప్టిన్ తగ్గుతుంది. అందువల్ల సెక్స్ హార్మోన్ల హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడూ పరీక్షించుకోవాలి.
* తీపి పదార్థాలపై ఆసక్తి
కొంతమంది చక్కెర శాతం అధికంగా ఉండే తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల శరీరం రక్తం నుంచి చక్కెరను గ్రహించలేకపోతుంది. దీనివల్ల శరీర కణాలు శక్తి కోసం ఎదురు చూస్తాయి. ఫలితంగా ఆకలి వేస్తున్నట్లు అనిపిస్తుంది. దీంతో తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. ఇది హార్మోనల్ బెల్లీ ఫ్యాట్ సమస్యకు దారితీస్తుంది.
* పొత్తికడుపు వద్ద కొవ్వు పెరగడం
మెనోపాజ్ వల్ల మహిళల్లో కొన్ని సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్ దశలో శరీరంలోని వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. ఈ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయులు తగ్గినప్పుడు బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తొడలు, పిరుదులు, నడుము, పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది.
ఇలాంటి సమస్యలు ఏర్పడితే కేవలం హార్మోన్ల అసమతుల్యత వల్లే బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుందని అనుమానించాలి. నిపుణుల సలహాతో బరువు, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకునే మార్గాలను ప్రయత్నించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health care, Health Tips, Life Style, Weight loss