అమ్మతనం అనేది ప్రపంచంలో ఏ మహిళకైనా ప్రత్యేకమే. అందుకే గర్భం దాల్చినప్పటి నుంచి, డెలివరీ అయ్యేంత వరకు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే అనారోగ్యాలు, ఇతర సమస్యల కారణంగా కొన్ని సందర్భాల్లో కొంతమంది గర్భిణులు అబార్షన్ చేయించుకోక తప్పదు. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు పూర్తి అవగాహన లేకుండా, అనధికారికంగా గర్భం తొలగించుకోవడం చాలా ప్రమాదం. గర్భం తొలగించుకున్న తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు.
గర్భం తొలగించుకోవడాన్ని అబార్షన్ అంటారు. అల్ట్రాసౌండ్ ద్వారా పిండంలో గుర్తించిన లోపాలు లేదా తల్లి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు వంటి వైద్యపరమైన కారణాలతో అబార్షన్ చేయించుకోవచ్చు. గర్భనిరోధక వైఫల్యం లేదా సామాజిక కారణాలతో స్త్రీ లేదా జంట అబార్షన్ కోరవచ్చు. ఇది ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో గైనకాలజిస్ట్‌లు చేసే సాధారణ ప్రక్రియ. ఇది చాలా సురక్షితమైంది. అయితే అసురక్షిత పరిస్థితుల్లో చేస్తే మహిళ ప్రాణాలకు ముప్పు సంభవిస్తుంది. ప్రతి సంవత్సరం 25 మిలియన్ల అసురక్షిత గర్భస్రావాలు జరుగుతున్నాయని అంచనా. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలు, అనారోగ్యానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారింది.
భారతదేశంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. 67% గర్భస్రావాలు అసురక్షితమైనవిగా తేలాయి. భారతదేశంలోని బలహీన, వెనుకబడిన జనాభాలో ఇది ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే 15-19 సంవత్సరాల వయస్సు గల యువతులు అబార్షన్-సంబంధిత సమస్యలతో చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందువల్ల భారతదేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో మహిళలు అబార్షన్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు బెంగళూరులోని రిచ్‌మండ్ రోడ్ ఫోర్టిస్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, ప్రసూతి వైద్యురాలు, గైనకాలజిస్ట్, OBGYN, FICM, FRCOG (UK), MRCOG (UK), MD డాక్టర్ అరుణా మురళీధర్. అబార్షన్ సంరక్షణ చర్యల గురించి వివరించారు.
* అబార్షన్ ఎప్పుడు చేయించుకోవచ్చు?
గర్భం దాల్చిన మహిళకు మొదటి త్రైమాసికంలో (4-13 వారాలు) లేదా రెండవ త్రైమాసికంలో (13 వారాల నుంచి 24 వారాల వరకు) అబార్షన్ చేయవచ్చు. ప్రెగ్నెన్సీ కాలం ఎంత పెరిగితే సమస్యలు అంత ఎక్కువగా ఉంటాయి. వైద్యపరమైన అంశాల ఆధారంగా స్త్రీ ఆప్షన్ మేరకు అబార్షన్ వైద్యపరంగా లేదా శస్త్రచికిత్స ద్వారా చేయవచ్చు. మూడు ముఖ్యమైన సమస్యలు అధిక రక్తస్రావం, ప్రెగ్నెన్సీ రిటైన్డ్ ప్రొడక్ట్స్, గర్భసంచికి గాయాలు సంభవించవచ్చు. గర్భం వెలుపల పెరిగిన పిండాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని కూడా పిలుస్తారు.
* తక్షణ సంరక్షణ
అబార్షన్ తర్వాత చేయాల్సిన డే-కేర్ ఉంటుంది. గర్భస్రావం తర్వాత స్త్రీ రక్తస్రావం, నొప్పి లేదా ఇన్ఫెక్షన్ వంటి ఏవైనా సమస్యలను ఎదుర్కోవచ్చు. మహిళ సౌకర్యవంతంగా ఉంటే అబార్షన్ చేసిన రోజునే ఇంటికి పంపుతారు. డిశ్చార్జ్ సమయంలో పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ కోర్సు ఇస్తారు. ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే యాంటీబయాటిక్ కోర్సును తప్పనిసరిగా వాడాలి. స్త్రీకి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే, యాంటీ-డి ఇంజెక్షన్ అవసరం కావచ్చు.
* ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అబార్షన్ తర్వాత బాధితురాలికి విశ్రాంతి అవసరం. విశ్రాంతి రోజుల సంఖ్య గర్భం దశపై ఆధారపడి ఉంటుంది. అధిక రక్తస్రావం అయితే ఎక్కువ విశ్రాంతి అవసరం కావచ్చు. గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో అబార్షన్ అయిన చాలా సందర్భాలలో మరుసటి రోజు నుంచి సాధారణ పనులు చేసుకోవచ్చు. కొన్ని వారాల పాటు వైద్య లేదా శస్త్రచికిత్స ప్రక్రియ తర్వాత నొప్పి ఉండవచ్చు.
అబార్షన్ తర్వాత నాలుగు వారాల వరకు రక్తస్రావం ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే చాలా సందర్భాలలో రక్తస్రావం ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో టాంపూన్లు లేదా మెన్స్ట్రువల్ కప్పుల కంటే శానిటరీ ప్యాడ్లు సిఫార్సు చేస్తారు. గర్భధారణ లక్షణాలు సాధారణంగా 2-3 రోజులలో తగ్గుతాయి.
* తీవ్రమైన సంకేతాలు, లక్షణాలు
తీవ్రమైన సంకేతాలు మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. 100 డిగ్రీల ఫారన్‌హీట్ కంటే ఉష్ణోగ్రత పెరగడం, కడుపులో నొప్పి, అసాధారణమైన లేదా అసహ్యకరమైన వాసన వంటి ఏదైనా ఇన్ఫెక్షన్ సంకేతాలను గమనించాలి. రక్తం గడ్డకట్టడం, రక్తస్రావం, మైకం, మూర్చ వంటి లక్షణాలు గుర్తించాలి. మానసిక సమస్యలు కూడా ఉంటాయి.
* తదుపరి గర్భం ఎప్పుడు మంచిది?
మెడికల్, సర్జికల్ టెర్మినేషన్ సురక్షితంగా నిర్వహిస్తే.. గర్భవతి కావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ ఇన్ఫెక్షన్ లేదా రిటైన్డ్ ప్రొడక్ట్స్, గర్భసంచికి గాయాలు ప్రభావితం చేయవచ్చు. అందువల్ల సురక్షితమైన పర్యవేక్షణ అవసరం.
* గర్భనిరోధకం
అనాలోచిత గర్భధారణను నివారించడానికి, అబార్షన్ తర్వాత గర్భనిరోధకం గురించి చర్చించడం చాలా ముఖ్యం. సర్జరీతో అబార్షన్ చేస్తే, అదే సమయంలో లాంగ్-యాక్టింగ్ రివర్సిబుల్ ఇంట్రాటూరైన్ డివైజ్ ఉంచవచ్చు. ప్రక్రియ తర్వాత 4-6 వారాల తర్వాత సాధారణ పీరియడ్ పునఃప్రారంభమైన తర్వాత ఈ చర్చ జరుగుతుంది. అబార్షన్ తర్వాత సరైన సంరక్షణతో శిక్షణ పొందిన ఆరోగ్య సంరక్షణ నిపుణుడి పర్యవేక్షణలో నిర్వహిస్తే స్త్రీ ఆరోగ్యానికి, గర్భధారణకు ఎటువంటి దీర్ఘకాలిక ప్రమాదాలు ఉండవు. వేగంగా, పూర్తిగా కోలుకోవడానికి సహాయపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Abortion, Health care, Health Tips