Immunity అంటూ ఇష్టం వచ్చినట్లు తిప్పతీగతో చేసిన మందులు వాడుతున్నారా...లివర్ పాడవుతుంది జాగ్రత్త..

ప్రతీకాత్మకచిత్రం

తిప్ప తీగను ఎక్కువ రోజుల పాటు తీసుకుంటే లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి కూడా చాలా సమయం పడుతుందట.

  • Share this:
కరోనా కాలంలో ఇమ్యునిటీ బూస్టర్లపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు అల్లం, వెల్లుల్లి లాంటి వాటితో పాటు ఆయుర్వేదిక్ మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారు. కానీ వీటివల్ల రోగ నిరోధక శక్తి పెరగడం సంగతి అటు ఉంచితే లివర్ పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా తిప్ప తీగ వంటివి ఎక్కువగా తీసుకున్న వారిలో ఇవి కనిపిస్తున్నాయట.

క్లినికల్ అండ్ ఎక్స్‌పరిమెంటల్ హెపటాలజీ జర్నల్ లో ప్రచురితమైన ఈ స్టడీ లో తేలిన దాని ప్రకారం హెర్బల్ ఇమ్యునో బూస్టర్లు లివర్ డ్యామేజీకి ఎంతగా కారణం అవుతాయో వెల్లడైంది. ఇది నేరుగా ఈ మూలికల వల్ల అయినా లేక వాటితో పాటు ఉపయోగించే ఇతర మందుల వల్ల కూడా జరుగుతుందట. ఈ స్టడీలో తేలిన విషయాలు

పేషంట్ 1 : అంతకుముందు ఆరోగ్యంగా ఉన్న నలభై సంవత్సరాల వ్యక్తి పదిహేను రోజుల సమయం పాటు కామెర్ల వ్యాధికి గురయ్యారు. తిప్ప తీగ మొక్కల చిగుళ్లతో పాటు దాల్చిన చెక్క, లవంగాలు కలిపి అరగ్లాసు నీటిలో రెండు రోజులకోసారి ఉపయోగించేవారని ఇలా చేసిన మూడు నెలల తర్వాత ఇలా కామెర్ల వ్యాధి వచ్చిందని వెల్లడించారు. తిప్ప తీగను చాలామంది భారతీయులు ఇమ్యునిటీ బూస్టర్ గా ఉపయోగిస్తున్నారు. లివర్ పూర్తిగా సాధారణంగా మారే వరకు లక్షణాలు తగ్గేవరకు అతడికి చికిత్స అందించారు.

పేషంట్ 2 : 54 సంవత్సరాల మహిళ.. డయాబెటిస్ వ్యాధితో కూడా బాధపడుతున్నారు. వారం రోజుల పాటు కామెర్ల వ్యాధికి గురయ్యారు. ఈమె కూడా ఏడు నెలల పాటు తిప్ప తీగ ను ఉడికించి దాని నుంచి వచ్చే రసాన్ని తాగడం అలవాటు అని చెప్పారు.

పేషంట్ 3 : బీటా థలసీమియా మైనర్ సమస్యతో బాధపడుతున్న 38 సంవత్సరాల వ్యక్తి వారం రోజుల పాటు కామెర్ల బారిన పడ్డారు. రోజూ మూడు, నాలుగు తిప్ప తీగ చిగుళ్లను ఉడికించి పదిహేను మిల్లీ లీటర్ల పాటు రసాన్ని తాగేవారట. అలా ఆరు నెలల పాటు రోజూ ఈ రసాన్ని తాగారు.

పేషంట్ 4 : 62 సంవత్సరాల డయాబెటిస్ ఉన్న మహిళ. మలేస్, ఆకలి తగ్గడం, మూత్రం పసుపు రంగుకు మారడం, కళ్లు, చర్మం, పొట్ట రంగు మారడం వంటివి గమనించినట్లు వెల్లడించారు. మార్కెట్లో లభించే తిప్ప తీగ రసాన్ని15 మిలీ చొప్పున రోజు విడిచి రోజు వాడేవారట.

వీరే కాదు.. మరో ఇద్దరు ముగ్గురు కూడా లివర్ ఫంక్షన్ తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వారందరూ కూడా రోజూ తిప్ప తీగ రసం తాగిన వారే.

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏమంటోందంటే..
ఆయుష్ శాఖ తిప్ప తీగ వినియోగానికి అనుమతినిచ్చింది కానీ అనుమతి లేకుండా మనకు నచ్చినట్లుగా దీన్ని తీసుకోవడం సరికాదని కూడా హెచ్చరించింది. ఆయుష్ వెల్లడించిన వివరాల ప్రకారం రోజూ కేవలం 500 ఎంజీ లేదా మూడు గ్రాముల పొడి ని మాత్రమే రోజూ వేడి నీటిలో కలిపి తీసుకోవాలి. అలా పదిహేను రోజుల నుంచి నెల రోజుల వరకు మాత్రమే వాడి మానేయాలి.
తిప్ప తీగను ఎక్కువ రోజుల పాటు తీసుకుంటే లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి కూడా చాలా సమయం పడుతుందట. అంతే కాదు.. డయాబెటిస్, లివర్ డ్యామేజ్ వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ పరిస్థితి చాలా తొందరగా వస్తుంది కాబట్టి వాళ్లు తిప్పతీగతో జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు. మూడు నుంచి ఆరు వారాల పాటు దీన్ని పూర్తిగా మానేయడం, సాధారణ ఆహారం తీసుకోవడం వల్ల పరిస్థితి కొందరిలో సాధారణంగా మారిందని.. గతంలో లివర్ డ్యామేజ్ ఉన్నవారికి ఈ పరిస్థితి మరీ ఇబ్బంది కలిగిస్తుందని వెల్లడించారు. ఇలాంటివి తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని.. లేకపోతే పరిస్థితి మరణానికి కూడా దారి తీయవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఇది చూడండి..

ఇది చూడండి..
Published by:Krishna Adithya
First published: