• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HEALTH KNOW HOW MUCH OF FRUITS AND VEGETABLES SHOULD BE TAKEN PER DAY TO AVOID UNHEALTH AK GH

Fruits and vegetables: రోజూ ఈ మోతాదులో పండ్లు కూరగాయలు తింటే అనారోగ్యం దూరం.. తేల్చి చెప్పిన తాజా అధ్యయనం

Fruits and vegetables: రోజూ ఈ మోతాదులో పండ్లు కూరగాయలు తింటే అనారోగ్యం దూరం.. తేల్చి చెప్పిన తాజా అధ్యయనం

ప్రతీకాత్మక చిత్రం

Fruits and vegetables: భోజనం చేసేటప్పుడు పళ్లెంలో కనీసం సగం పండ్లు, కూరగాయలతో చేసిన పదార్థాలు ఉండాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచిస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ సూత్రాన్ని పాటిస్తే అనారోగ్యాలు, మరణాల ప్రభావం తగ్గి, ఆయుష్షు పెరుగుతుందని ఆ సంస్థ తెలిపింది.

  • Share this:
రోజూ తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. వీటిలో ఉండే పోషకాలు దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. కానీ ఎంత మొత్తంలో పండ్లు, కూరగాయలను తీసుకోవాలో చాలామందికి సరిగా తెలియదు. ఈ అంశంపై అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) ఒక అధ్యయనం నిర్వహించింది. అధ్యయనం కోసం మొత్తం 20 లక్షల మంది నుంచి సమాచారం సేకరించి విశ్లేషించారు. రోజూ కనీసం రెండు పండ్లు, మూడు రకాల కూరగాయలను తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని వారు కనుగొన్నారు. ఈ ఐదు పదార్థాల (5 సర్వింగ్స్) సూత్రం అనారోగ్యాలను దూరం చేస్తుందని అధ్యయన బృంద సభ్యుడు డాక్టర్ డాంగ్ వాంగ్ తెలిపారు. ఆయన హార్వర్డ్ మెడికల్ స్కూల్, బోస్టన్‌లోని బ్రిగామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌లో ఎపిడెమియాలజిస్టుగా, పోషకాహార నిపుణుడిగా పనిచేస్తున్నారు.

మనం తీసుకునే ప౦డ్లు లేదా కూరగాయలను బట్టి ప్రయోజనాల్లో తేడాలు ఉండవచ్చని డాక్టర్ డాంగ్ చెప్పారు. అన్ని రకాల పండ్లు, కూరగాయలు ఒకే స్థాయిలో ప్రయోజనాన్ని అందించవని తెలిపారు. బఠాణీలు, మొక్కజొన్న, బంగాళాదుంపలు, ఇతర పిండి పదార్థాలు ఉండే పండ్ల వల్ల మరణాల ప్రమాదం తగ్గే అవకాశం లేదన్నారు. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గించలేవని చెప్పారు. బీటా కెరోటిన్, విటమిన్ సి అధికంగా ఉండే ఆకుకూరలు, క్యారెట్, కేల్, పాలకూర.. వంటివి వ్యాధుల నివారిణిగా పనిచేస్తూ, దీర్ఘాయువుకు తోడ్పడతాయని తాజా పరిశోధనలో తేలింది.

పండ్ల రసాల ప్రభావం తక్కువే
బీటా కెరోటిన్, విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, అన్ని రకాల బెర్రీలు, సిట్రస్ జాతి పండ్లు వంటివి కూడా మరణాలు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలవు. కానీ ఈ జాబితాలో పండ్ల రసం లేకపోవడం విశేషం. పండ్లలో ఉండే ఫైబర్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ జ్యూస్‌లలో ఇది ఉండదు. అందువల్ల ఈ తేడాలు ఉండవచ్చని పరిశోధకులు తెలిపారు.

రెండు భాగాలుగా అధ్యయనం
ఈ అధ్యయనాన్ని అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన సర్క్యులేషన్ జర్నల్‌లో సోమవారం ప్రచురించారు. దీన్ని రెండు భాగాలుగా విభజించారు. నర్సులు, హెల్త్ ప్రొఫెషనల్స్ డేటాను మొదటి భాగంలో ఉంచారు. 30 సంవత్సరాల పాటు లక్షమంది వయోజనుల ఆహారపు అలవాట్లను సేకరించారు. అధ్యయనం ప్రారంభంలో వీరిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ తరువాత ప్రతి రెండు నుంచి నాలుగేళ్లకోసారి క్వశ్చనైర్‌ను అప్‌డేట్ చేశారు. ఈ డేటాను దీర్ఘకాల అధ్యయనాల సమయంలో సేకరించిన హెల్త్, డెత్ రికార్డులతో పోల్చారు.

అధ్యయనం రెండో భాగం కోసం గతంలో చేసిన 26 పరిశోధనల నుంచి సమాచారాన్ని సేకరించారు. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని 29 దేశాల నుంచి 20 లక్షల మందిపై వీటిని నిర్వహించారు. వీరందరిలో పండ్లు, కూరగాయలను ఆహారంలో తీసుకునే అలవాటును, మరణాల రేటుతో పోల్చారు.

వారికి ప్రమాదం తక్కువ
రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయల సంఖ్య రెండు మాత్రమే (2 సర్వింగ్స్) ఉన్నవారిని.. మొత్తం పండ్లు, కూరగాయల సంఖ్య ఐదు (5 సర్వింగ్స్) ఉన్నవారితో పోల్చారు. 2 సర్వింగ్స్ వారితో పోలిస్తే.. 5 సర్వింగ్స్ వారిలో మరణాల ప్రమాదం 13 శాతం తక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. పండ్లు, కూరగాయలు కలిపి ఐదు పదార్థాలను తీసుకునే 5 సర్వింగ్స్ వ్యక్తుల్లో గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 12 శాతం తక్కువగా ఉంది. వీరు క్యాన్సర్‌తో చనిపోయే ప్రమాదం 10 శాతం తక్కువగా, శ్వాససంబంధిత వ్యాధుల బారిన పడి మరణించే ప్రమాదం 35 శాతం తక్కువగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది.

పరిశోధనపై అనుమానాలు
అయితే పండ్లు, కూరగాయలు కలిపి ఐదు సర్వింగ్స్‌ కంటే ఎక్కువగా ఉన్న వారికి అదనంగా ఎలాంటి లబ్ధి ఉంటుందనే అంశాన్ని అధ్యయనం గుర్తించలేదు. ప్రతిరోజూ 10 సర్వింగ్స్‌ (పండ్లు, కూరగాయలు కలిపి) తీసుకునే వారిలో గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్, ముందస్తు మరణాల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని పాత పరిశోధనలు గుర్తించాయి. రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది సర్వింగ్స్‌ అలవాట్లు ఉండేవారిలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కానీ తాజా అధ్యయనం కోసం పరిశోధనలో పాల్గొన్న వారి ఆహారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. వారు గతంలో ఏమేం తినేవారు, ఎన్ని సర్వింగ్స్‌లో తీసుకున్నారనేవి నమోదు చేశారు. కాబట్టి కొత్త పరిశోధన ఐదు సర్వింగ్స్‌, మెరుగైన ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని మాత్రమే సూచిస్తోంది. వాటికి కారణాలు, ప్రభావాలను గుర్తించలేదు. అందువల్ల ఈ పరిశోధన ఫలితాలను పూర్తిగా నమ్మలేమని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అసలు ప్రామాణికాలు ఏవి?
మహిళలు ప్రతిరోజూ కనీసం 1.5 కప్పు పండ్లు, 2.5 కప్పుల కూరగాయలు తినాలని పోషకాహార నిపుణులు డైటరీ గైడ్‌లైన్స్‌లో సూచిస్తున్నారు. మగవాళ్లు 2 కప్పుల పండ్లు, 3.5 కప్పుల కూరగాయలు రోజూ తీసుకోవాలి. కానీ అమెరికాలోని వయోజనుల్లో కేవలం 9 శాతం మంది మాత్రమే సూచించిన కూరగాయలను తీసుకుంటున్నారు. కేవలం 12 శాతం మాత్రమే సిఫార్సు చేసిన పండ్లను తింటున్నారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. భోజనం చేసేటప్పుడు పళ్లెంలో కనీసం సగం పండ్లు, కూరగాయలతో చేసిన పదార్థాలు ఉండాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచిస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ సూత్రాన్ని పాటిస్తే అనారోగ్యాలు, మరణాల ప్రభావం తగ్గి, ఆయుష్షు పెరుగుతుందని ఆ సంస్థ తెలిపింది.
First published: