చాలామందికి ఏదైనా కాస్త తినగానే పుల్లని తేన్పులు, గ్యాస్, ఎసిడిటీ వంటివన్నీ ఇబ్బంది పెడుతుంటాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొంటారు. కానీ కొందరికి మాత్రం తరచూ ఈ ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. కడుపులోని యాసిడ్ జీర్ణ వాహిక నుంచి పైకి రావడం వల్ల గొంతు అంతా మండినట్టుగా అవుతుంది. దీన్నే మనం ఎసిడిటీ అంటాం. ఎసిడిటీ అంటే గుండెల్లో, గొంతులో మంట, కడుపు నొప్పి, గ్యాస్, ఆహారం అరగకపోవడం, చెడు వాసన వంటివన్నీ ఇబ్బంది పెడతాయి. ఒక్కోసారి ఇది తీవ్రంగా ఉంటే వాంతులు, మలబద్ధకం వంటివి కూడా ఉంటాయి. ఇది సహజంగా ఎక్కువగా తినడం, సమయం కాని సమయంలో తినడం, ఆహారం తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండి ఆ తర్వాత తినడం వంటివి చేయడం వల్ల వస్తుంటుంది. దీన్ని ఎలా తగ్గించుకోవాలంటే..
1. అరటి పండ్లు
అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది యాసిడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇందులోని మ్యూకస్ కూడా యాసిడ్ వల్ల పొట్ట, గొంతుకు హాని కలగకుండా కాపాడుతుంది. అందుకే ఎసిడిటీ అనిపించినప్పుడు ఒక అరటి పండు తిని చూడండి. చాలా మంచి ఫలితం ఉంటుంది.
2. తులసి ఆకులు
తులసికి మన శరీరంలో ఉన్న ఎన్నో సమస్యలను తగ్గించే శక్తి ఉంటుంది. ఎసిడిటీని కూడా ఇది తగ్గిస్తుంది. తులసిలో మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి చేసే లక్షణం ఉంటుంది కాబట్టి ఇది ఎసిడిటీని తగ్గిస్తుంది. అందుకే ఎసిడిటీ అనిపించినప్పుడు ఐదారు తులసి ఆకులను నమలడం మంచిది.
3. చల్లని పాలు
పాలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ యాసిడ్ విడుదల కాకుండా కాపాడుతుంది. ఇప్పటికే విడుదలైన యాసిడ్ ని పీల్చుకుంటుంది. అయితే చల్లని పాలను చక్కెర, తేనె వంటివేవీ కలపకుండా తాగాలి. కావాలంటే కాస్త నెయ్యి చేర్చవచ్చు.
4. సోంపు
సోంపులో యాంటీ అల్సర్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణ క్రియ సజావుగా సాగేలా చేస్తుంది. అందుకే ఎసిడిటీ వచ్చిన సమయంలో కొద్దిగా సోంపు తీసుకొని నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీకు కడుపుబ్బరం వంటివి ఉంటే అవి కూడా తగ్గుతాయి.
5. జీలకర్ర
జీలకర్రలో ఉన్న గుణాలు నోటిలో లాలాజలం ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తాయి. తద్వారా కడుపులోని యాసిడ్ తగ్గేలా సహాయపడుతుంది. గ్యాస్, గాస్ట్రిక్ సమస్యలన్నింటినీ ఇది తగ్గిస్తుంది. దీనికోసం జీలకర్ర నేరుగా నమలడం లేదా నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగడం చేయవచ్చు.
6. లవంగం
ఇది జీర్ణ శక్తి పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది. దీని రుచికి నాలుకపై ఉన్న రుచి మొగ్గలు చలించి లాలాజలం ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తుంది. అందుకే ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు దీన్ని తీసుకోవడం వల్ల కడుపులోని యాసిడ్ తగ్గుతుంది.
7. ఇలాచీ
గ్యాస్ సమస్యకు ఇది ఆయుర్వేద నిపుణులు కూడా అందించే ఉపాయం ఇది. ఇది దోషాలను తగ్గించేందుకు పనిచేస్తుందని ఆయుర్వేదంలో చెబుతారు. అందుకే జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు నొప్పి, గ్యాస్ తగ్గిస్తుంది. కడుపులోని లేయర్ కాపాడుతుంది. ఇందుకోసం నేరుగా నమలడం లేదా రెండు యాలకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగడం చేయవచ్చు.
8. పుదీనా
మీకు తరచూ గ్యాస్, ఎసిడిటీ బాధిస్తుంటే పుదీనా తీసుకోండి. ఇది కడుపులోని యాసిడ్ ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం నీటిలో పుదీనా వేసి మరిగించి ఆ నీటిని చల్లార్చి తాగడం మంచిది.
9. అల్లం
అల్లం కూడా జీర్ణక్రియలో బాగా సహాయపడుతుంది. కడుపులో మ్యూకస్ పెరిగేలా చేస్తుంది. దీనికోసం అల్లం ముక్కను నమలడం లేదా నీటిలో వేసి మరిగింది ఆ డికాషన్ ని తాగడం లేదా అల్లం, బెల్లం కలిపి అప్పుడప్పుడూ నాకడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
10. ఉసిరి
ఉసిరి పిత్త, కఫ గుణాలను తగ్గిస్తుంది. అందుకే ఎసిడిటీ తగ్గించేందుకు కనీసం రోజుకు రెండు సార్లు టీస్పూన్ చొప్పున ఉసిరి పొడిని నీటిలో కలిపి తాగితే మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health care