కోవిడ్-19 నుంచి కోలుకున్న వారిలో కొన్ని లక్షణాలు ఏడాది పాటు కనిపించే అవకాశం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. కొంతమందిలో పూర్తి స్థాయిలో రుచి, వాసన తిరిగి పొందడానికి దాదాపు సంవత్సరం పట్టవచ్చని అధ్యయనం పేర్కొంది. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బోర్గ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. గత ఏడాది ప్రారంభంలో మహమ్మారి వచ్చినప్పటి నుంచి అనోస్మియా, పూర్తిగా వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కోవిడ్-19 సంకేతంగా పరిగణించారు. వాసన గ్రహించే లక్షణం కోల్పోవడం అనేది.. ఒక వ్యక్తి జీవన నాణ్యత ప్రమాణాలపై చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల ఆహారాన్ని రుచి చూడటం, వాతావరణంలో వచ్చే మార్పులు, ప్రమాదాలను గుర్తించడం, ఇంద్రియాలపై ఆధారపడిన ఇతర విధులను నిర్వహించడం కష్టమవుతుందని అధ్యయనం వెల్లడించింది.
ఈ అధ్యయనం ఫలితాలను జామా నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురించారు. స్ట్రాస్‌బోర్గ్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్స్ పరిశోధకులు రుచి, వాసన కోల్పోయిన 97 మంది కోవిడ్-19 రోగులపై ఈ పరిశోధన చేశారు. ఏడాది పొడవునా ప్రతి నాలుగు నెలలకోసారి ఒక సర్వేను పూర్తి చేయాలని కోవిడ్ రోగులను కోరారు. వీరిలో 51 మంది స్వయంగా నివేదించిన సర్వేలను ధ్రువీకరించడానికి ఆబ్జెక్టివ్ పరీక్ష సైతం చేయించుకోవాలని కోరారు. ఆ తరువాత 51 మంది రోగులలో 49 మంది.. కోవిడ్ నుంచి కోలుకున్న ఎనిమిది నెలల్లో రుచి, వాసన లక్షణాన్ని తిరిగి పూర్తిగా పొందినట్లు పరిశోధకులు గుర్తించారు.
మిగిలిన ఇద్దరిలో ఒకరు వాసన చూడగలిగారు... కానీ అసాధారణంగా ఉన్నారని, మరొకరు అధ్యయనం ముగిసే సమయానికి వాసన చూడలేకపోయారని అధ్యయనం వెల్లడించింది. 46 మంది కోవిడ్ -19 రోగులు ఆబ్జెక్టివ్ పరీక్ష చేయించుకోకపోగా, వారంతా సంవత్సరం తర్వాత పూర్తిస్థాయిలో కోలుకున్నట్లు నివేదికలో పొందుపరిచారు.
అధ్యయన బృంద సభ్యుడు మారియన్ రెనాడ్ మాట్లాడుతూ "రికవరీలో అదనంగా 10 శాతం రాబోయే 12 నెలలో ఉండవచ్చని మా పరిశోధనలు చెబుతున్నాయి. ఆరు నెలల పాటు చేసిన అధ్యయనాలతో పోలిస్తే, కోలుకున్న రోగులలో 85.9 శాతం మంది మాత్రమే ఉన్నారు. మా అంచనా ప్రాథమిక జంతు పరిశోధన నుంచి కనుగొన్న వాటికి మద్దతు ఇచ్చేలా కనిపిస్తోంది. ఇమేజింగ్ అధ్యయనాలు, పోస్ట్‌మార్టం పాథాలజీ రెండింటి ద్వారా ఈ పరిశోధన చేశాం. కోవిడ్-19 సంబంధిత అనోస్మియా కేవలం ఇన్‌ఫ్లమేషన్ కారణంగా ఉండవచ్చని తెలుస్తోంది" అని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid-19