Vaccine Policy: కరోనా సోకిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఒక్క డోసు సరిపోతుందా? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

కరోనా సోకిన వాళ్లకు ఒక డోస్ సరిపోతుందా? (ప్రతీకాత్మక చిత్రం)

Corona Vaccine Awareness: ఇప్పటికే SARS-CoV-2 బారిన పడిన వ్యక్తులకు సింగిల్ వ్యాక్సిన్ షాట్ శక్తిమంతంగా పనిచేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుందని అధ్యయనంలో తెలిసింది..

  • Share this:
కరోనాను (Corona) నియంత్రించాలంటే వ్యాక్సిన్ (Vaccine) తప్పనిసరిగా తీసుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే. కోవిడ్ బారిన పడి, కోలుకున్న వ్యక్తులు సైతం టీకాలు తీసుకోవడం ద్వారా రోగనిరోధకతను (Immunity) మరింత పెంచుకోవచ్చు. అయితే రెండు డోసుల వ్యాక్సిన్ నియమావళిపై ప్రస్తుతం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనా సోకిన వ్యక్తులు ఒక డోసు టీకా తీసుకుంటే సరిపోతుందని, వారికి పూర్తి రక్షణ అందుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ పాలసీని పాటిస్తే టీకాల కొరతను నివారించి సరఫరాను పెంచవచ్చని పేర్కొన్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు సింగిల్ వ్యాక్సిన్ పాలసీని అవలంభిస్తున్నాయి. అయితే ఈ విధానం అందరికీ, అన్ని టీకాలకు వర్తిస్తుందా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇప్పటికే SARS-CoV-2 బారిన పడిన వ్యక్తులకు సింగిల్ వ్యాక్సిన్ షాట్ శక్తిమంతంగా పనిచేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల యాంటీబాడీలు (Anti Bodies) డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న స్థాయికి పెరుగుతాయని పరిశోధకులు గుర్తించారు. ఈ విషయంపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు కూడా వ్యాక్సిన్ రేసులో వెనుకబడిన దేశాలకు అధికంగా సప్లై చేయాలంటే ఇలాంటి విధానాలు సరైన మార్గమేనని అంటున్నారు. ఒక్క డోసు కూడా తీసుకోకుండా మిలియన్ల మంది వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నప్పుడు గతంలో కరోనా సోకిన వ్యక్తులకు డబుల్ షాట్ నియమావళి అనుసరిచడమనేది అర్థవంతంగా లేదని మౌంట్ సినాయ్ లోని ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో ఇమ్యూనాలజిస్ట్ గా పనిచేస్తున్న జోర్డి ఒచాండో చెప్పారు.

అయితే సింగిల్ షాట్ వల్ల పూర్తిగా రక్షణ ఉంటుందనే విషయంపై శాస్త్రవేత్తలు స్పష్టత ఇవ్వలేదు. అన్ని రకాల టీకాలు ప్రభావవంతంగా ఉంటాయా అనే ప్రశ్నకు.. ఈ విషయం సంక్లిష్టమైందని స్పెయిన్ బార్సిలోనా ఆసుపత్రి ఇమ్యూనాలజిస్ట్ జియులియానా మాగ్రి సమాధానమిచ్చారు.

* ఒక్క డోసు విధానం..
మహమ్మారి ప్రారంభంలో వైరస్ సోకిన 26 మందిపై న్యూయార్క్ లోని రాక్ ఫెల్లార్ వర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అంశంపై అధ్యయనం చేశారు. వారికి ఫైజర్ బయోఎంటెక్ లేదా మోడెర్నా టీకా ఒక్క డోసును అందించారు. ఈ రెండు ఆర్ఎన్ఏ ఆధారిత టీకాలు. వీటి న్యూట్రలైజింగ్ యాంటీ బాడీల స్థాయిలను పరిశోధకులు విశ్లేషించారు. వైరస్ కణంలోకి ప్రవేశించకుండా నిరోధించాయో లేదో అంచనా వేశారు. మెమరీ బీ సెల్స్ పనితీరును విశ్లేషించారు. అంటే ఎంత కాలం పాటు ఈ యాంటీ బాడీలు శరీరంలో వైరస్ లను గుర్తుంచుకున్నాయో అంచనా వేశారు. టీకా ఇచ్చిన తర్వాత మెమరీ బీ కణాలు 10 రెట్లు పెరగడం గుర్తించారు. అంతేకాకుండా వాటి టెట్రెస్ స్థాయిలు లేదా తటస్థీకరించే యాంటీబాడీలు 50 రెట్లు పెరిగాయని కనుగొన్నారు.

గతంలో కరోనా సోకిన వ్యక్తుల్లో ఒక డోసు టీకా.. ఇంతకుముందు ఇన్ఫెక్ట్ కానివారిలో రెండు డోసులకు సమానం లేదా అంతకంటే ఎక్కువని నిర్ధారించారు. ఇది నిజంగా అద్భుతంగా పనిచేసిందని ఈ అధ్యయనానికి సహ నేతృత్వం వహించిన వైరాలజిస్ట్ థియోడోరా హట్జియోఅనౌ చెప్పారు. అందరిలోనూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. అంతేకాకుండా సింగిల్ షాట్ తీసుకున్నవారిలో మెమరీ బీ కణాలు 12 నెలల్లో స్థిరంగా లేవని, ఏడాది పొడవునా అభివృద్ధి చెందాయని స్పష్టం చేశారు. అంటే వ్యాధి సోకిన తర్వాత వెంటనే ఉత్పత్తి అయిన ప్రతిరోధకాలు శక్తిమంతంగా మారాయని అన్నారు. ఇతర అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

* వ్యాక్సిన్ డోసులను పెంచడం..
ఈ అధ్యయనం ఫలితంగా కరోనా సోకిన వ్యక్తికి ఎక్కువ డోసులను ఇవ్వకూడదని శాస్త్రవేత్తలను ఒప్పించవచ్చు. కోవిడ్ ఉన్నవారికి ఒక్క డోసును ఇవ్వడం వల్ల వ్యాధి లేని వారికి రెండు డోసులు ఇవ్వడంలో జాప్యం జరగదు. ఈ విషయంపై 8 మంది కోవిడ్-19 శాస్త్రవేత్తలు సంతకం చేశారు. అంతేకాకుండా వ్యాక్సిన్ కొరత ఉన్న ప్రాంతాలకు టీకాలను అందజేయవచ్చు. అయితే ఈ సింగిల్ పాలసీ విధానంపై దేశాలన్నీ ఒకే మాటపై లేవు. ఉదాహరణకు యూఎస్ఏలో టీకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కారణంగా అధికారులు రెండు డోసులను అందరికీ సిఫార్సు చేస్తున్నారు.
Published by:John Naveen Kora
First published: