క్రీడాకారులు, అథ్లెట్లు చూసేందుకు చాలా ఫిట్‌గా కనిపిస్తారు. అందుకోసం వారు చాలారకాల కసరత్తులు చేయడంతో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతుంటారు. అయితే సాధారణ పౌరులతో పోలిస్తే వీరు ఎక్కువగా గాయాలబారిన పడుతుంటారు. సాధన చేసేటప్పుడు, శిక్షణలో లేదా ఆడేటప్పుడు దెబ్బలు తగులుతుంటాయి. అధ్యయనాల ప్రకారం 21 శాతం మంది క్రీడాకారులు వీటి వల్ల ప్రభావితం అవుతుంటారని చెబుతున్నారు డాక్టర్ సమర్థ్. 44 శాతం మంది అథ్లెట్లు తీవ్రంగా గాయపడుతుంటారట. క్రీడాకారులు, అథ్లెట్లు సాధారణంగా లేదా ఎక్కువగా ఎదుర్కొనే గాయాల గురించి డాక్టర్ సమర్థ్ వివరించారు.
* చీలమండ బెణుకు (Ankle Sprain)
చాలామంది క్రీడాకారుల్లో ఇవి సాధారణం. చిన్న బెణుకులు ఫర్వాలేదు కానీ చీలమండలో బెణుకు సంభవిస్తే కొంత ఇబ్బందే. స్నాయువులో పొర సాగడం లేదా చిరిగిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. సాధారణంగా చీలమండ, మోకాలి, మణికట్టు లేదా బొటనవేలుకు ఇలాంటి గాయాలు అయ్యే అవకాశం ఉంది. ఇవి రాకుండా జాగ్రత్తలు పాటించాలంటే నాడీ కండరాలకు బలాన్ని చేకూర్చే వ్యాయామాలు చేయాలి. పుష్-అప్స్, రన్నింగ్, జంపింగ్ వంటి ప్లయోమెట్రిక్స్ ఎక్సర్‌సైజులు చేయాలి.
* బర్సైటీస్ (Bursitis)
బర్సైటీస్ అనేది ప్రధాన కీళ్లల్లో ద్రవరూపంలో ఉంటుంది. కదలికల్లో కీళ్లు ఘర్షణలకు లోనుకాకుండా వాటిపై ఒత్తిడి తగ్గించేందుకు సహాయపడుతుంది. సాధారణంగా అథ్లెట్ల మోకాలు, మోచేయి, భుజం, చీలమండ, తుంటి భాగాలు దెబ్బతింటాయి. ప్రత్యేకమైన వ్యాయామాలు చేయడం ద్వారా దీని బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. విపరీతమైన నొప్పి రావడం ద్వారా బర్సైటీస్ దెబ్బతిన్నట్లు గుర్తించవచ్చు. అథ్లెట్లు ఎక్కువగా దీని బారిన పడుతుంటారు.
* Meniscus Tear
మెనిస్కర్ అనే పొర మృదులాస్థిలో భాగం. తొడ, మోకాలు మధ్య ఉంటుంది. క్రీడాకారులకు ఎక్కువగా జరిగే గాయాలలో ఇది ఒకటి. వయసుకు, ఎత్తుకు తగ్గ బరువు ఉండటం వల్ల మెనిస్కస్ బలంగా ఉంటుంది. దీనిపై ఒత్తిడి పడితే పొర చీలుతుంది. హిప్ ఎక్స్‌టెన్సర్, మోకాలి ఫ్లెక్సర్లను బలంగా ఉండేట్లు చూసుకోవడం ద్వారా ఇలాంటి గాయం కాకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు.
* ACL Tear
ACL (Anterior Cruciate Ligament) అనేది మోకాలి భాగంలో ఉండే ఒక పొర. ఏదైనా తీవ్ర గాయాలకు గురైనప్పుడు ఈ పొర చిరిగిపోతుంది. అప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. కాలును ముడవడం కూడా కష్టంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎక్స్‌రేల్లో కూడా కనపడదు. కేవలం ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో మాత్రమే కనిపిస్తుంది. పురుష అథ్లెట్ల కన్నా మహిళా అథ్లెట్లలో ఈ పొర దెబ్బతినే అవకాశం 1.6 రెట్లు ఎక్కువ. సాధారణంగా చిన్న గాయం అయితే దానంతట అదే సర్దుకుంటుంది. తీవ్రంగా గాయపడినప్పుడు సర్జరీ అవసరం అవుతుంది. పుష్-అప్స్, రన్నింగ్, జంపింగ్ వంటి ప్లయోమెట్రిక్స్ ఎక్సర్‌సైజులు చేయడం ద్వారా అంటీరియర్ క్రూసియేట్ లిగ్మెంట్ దృఢంగా ఉంటుంది.
* కండరాల బెణుకు (Strains/ Pulled Muscles)
కండరాల బెణుకు అంటే తాత్కాలికంగా కండరాలు పట్టేయడం అని చెప్పవచ్చు. మామూలుగా అయితే ఇది సాధారణం. కండరాల్లోని నరాలు పరిధికి మించి సాగినప్పుడు, దెబ్బతిన్నప్పుడు అయ్యే గాయం తీవ్ర బాధను కలిగిస్తుంది. శారీరక గాయాలతో పాటు ఒత్తిడి వల్ల కూడా సంభవిస్తుంది. సరైన వ్యాయామం, వార్మప్ ఎక్సర్‌సైజులు, ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం ద్వారా అథ్లెట్లు ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health care, Health Tips, Sports