HEALTH HERE FIVE SIMPLE TIPS ON HOW ONE CAN BEGIN TO TAKE CARE OF THEIR HAIR IN WINTER SEASON GH SRD
Winter Hair Care: శీతాకాలంలో ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టు కావాలా..? అయితే, ఈ చిట్కాలు మీ కోసమే..
ప్రతీకాత్మక చిత్రం
Winter Hair Care: చలికాలం మొదలు కాగానే తేమ ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల తలమీది చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మాడు నుంచి తేమ ఆవిరైపోవడం వల్ల జుట్టు పొడిగా మారుతుంది.
భారతదేశంలో శీతాకాలం మొదలైపోయింది. ఈ కాలంలో జలుబు, దగ్గు వంటి జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు చలికాలంలోచర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలూ వేధిస్తుంటాయి. చలికాలం మొదలు కాగానే తేమ ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల తలమీది చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మాడు నుంచి తేమ ఆవిరైపోవడం వల్ల జుట్టు పొడిగా మారుతుంది. అందుకే జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాయడం మంచిది. చాలా మంది ప్రజలు చర్మ సంరక్షణపై దృష్టి సారిస్తారు కానీ జుట్టు గురించి పట్టించుకోరు. చలికాలంలో వెంట్రుకలు పెళుసుగా మారడం వల్ల తలపై దురద పెడుతుంది. ఆ తర్వాత జుట్టు కాంతి హీనంగా మారుతుంది. శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపే 5 అద్భుతమైన చిట్కాలు పంచుకున్నారు నిపుణులు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
* నూనె
చలికాలంలో శిరోజాలకు నూనె చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. తల స్నానం చేశాక మీకు నచ్చిన తలనూనెను చక్కగా అప్లై చేయడం మర్చిపోకండి. సహజసిద్ధమైన, సేంద్రియ నువ్వుల నూనె, కొబ్బరి నూనె మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
* నీరు, హెల్తీ ఫ్యాట్స్
మీ జుట్టు మొదలు నుంచి చివర్ల వరకు ఆరోగ్యంగా ఉండాలంటే, నీటిని ఎక్కువగా తాగండి. బాదం, జీడిపప్పు, వేరుశెనగ, గుమ్మడి గింజలు ఇతర ఆహార పదార్థాల్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇలాంటి హెల్దీ పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోండి. హెల్దీ ఫ్యాట్స్ మీ జుట్టుకు అవసరమైన ప్రొటీన్‌లను అందిస్తాయి. ఫలితంగా మీ కురులు లోపలి నుంచి బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. మీ జుట్టు చిట్లిపోకుండా నల్లగా నిగనిగలాడేలా చేయడంలో హెల్తీ ఫ్యాట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే మీ వాలు కురులు ఒత్తుగా, బలంగా తయారవ్వడంలో ప్రొటీన్లు దోహదపడతాయి.
* డీప్ కండిషనింగ్
జుట్టు బాగా పొడిబారినప్పుడు హెయిర్ మాస్క్ ఉపయోగించండి. డీప్ కండిషనింగ్ హెయిర్ మాస్క్ అప్లై చేయడం ద్వారా జుట్టు పొడిబారే సమస్యను అరికట్టవచ్చు. కొంచెం పెరుగు, ఇ విటమిన్ క్యాప్సిల్స్, కొంచెం తేనె, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయండి. ఆ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు తలపై ఉంచండి. సహజసిద్ధమైన కండిషనర్ గా పెరుగు పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్, తేనె శిరోజాలకు పోషణను అందిస్తాయి.
* కండీషనర్లు, నూనె
చలిగాలుల నుంచి కురులను సంరక్షించుకోవడానికి మీరు సీరంలుగా పనిచేసే హెయిర్ ఆయిల్‌ను ఎంచుకోవచ్చు. లేదా జుట్టుపై రోజంతా ఉంచుకోగల కండిషనర్లు వాడొచ్చు. మీరు రసాయన ఉత్పత్తులకు వాడకూడదనుకుంటే.. కురుల చివర్లలో ఏదైనా హెయిర్ ఆయిల్‌ని ఒకటి లేదా రెండు చుక్కలు రాసుకోండి. తద్వారా జుట్టు చివర్లు చిట్లిపోవడం జరగదు. అలాగే సహజ సిద్ధమైన హెయిర్ ప్రొడక్ట్స్ మాత్రమే కొనుగోలు చేయండి.
* వేడి నీళ్లు
బాగా వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంపై తేమ ఆవిరైపోతుంది. వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టు డల్ గా తయారు అవుతుంది. శిరోజాలు విరిగిపోతాయి. అందుకే గోరువెచ్చగా ఉన్న నీటితోనే స్నానం చేయండి.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.