మనం ఏ పని చేయాలన్నా మన కళ్లు ఆరోగ్యంగా ఉండాలి. కంప్యూటర్ల ముందు గంటల కొద్దీ కూర్చుని ఉద్యోగాలు చేసే వారికే కంటి సమస్యలు వస్తుంటాయని చాలామంది భావిస్తారు. అయితే కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఇతర అనారోగ్యాలు కూడా కంటి ఆరోగ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు కర్ణాటక, షిమోగాలోని శంకర ఐ హాస్పటల్‌లో కాటరాక్ట్ & ట్రామా విభాగం చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ మహేశ. ఏడాదికి ఒకసారి కచ్చితంగా కంటి ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేయించుకోవాలని, కానీ మనలో చాలామందికి అసలు ఆ ధ్యాసే ఉండదని అంటున్నారు.
పెద్ద వ్యాధులు బాగా ముదిరితే తప్ప బయటకు తెలియవు. అయితే పరీక్షల ద్వారా ముందుగానే వీటిని గుర్తిస్తే చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఆరోగ్యవంతమైన కళ్ల కోసం రెగ్యులర్ చెకప్ అవసరం అంటున్నారు డాక్టర్ మహేశ. ముఖ్యంగా ఒక ఐదు లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఐ-చెకప్ చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. అవేంటంటే..
* నొప్పి
మీ కంటి చూపు సరిగానే ఉండొచ్చు. కానీ అప్పుడప్పుడు తలనొప్పి, కంటినొప్పి వస్తున్నా, బాగా ఒత్తిడికి గురవుతున్నా కళ్లకు సంబంధించి ఏదో సమస్య ఉందని మీరు గుర్తించాలి. తరచుగా వచ్చే తలనొప్పి మీ కంటి చూపుపై ప్రభావం చూపిస్తుంది.
* చూపు మందగించడం
చూపు మసకబారినట్లు అనిపించినా, గతంలో లేని విధంగా ఏదైనా చూసేందుకు లేదా చదివేందుకు ఇబ్బంది పడుతున్నా వెంటనే కంటి వైద్యుడిని కలవడం చాలా మంచింది. డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఇలాంటి అనుభవమే ఎదురవుతుంటే మీరు జాగ్రత్త పడాలి. చూపు మందగించడం అనేది గ్లకోమా వంటి పెద్ద వ్యాధులకు కారణం కావచ్చు.
* కంట్లో తేడాలు
కంటి నుంచి నీరు కారుతున్నా లేదా కళ్లు ఎర్రగా అవుతున్నా.. దానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. దుమ్ము, ధూళి వంటి వాటి వల్ల డస్ట్ అలెర్జీ రావచ్చు. లేదా కళ్లకలక కూడా అవ్వొచ్చు. కార్నియాకు ఏదైనా ఇన్‌ఫెక్షన్ వచ్చినా ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. అందుకే సమస్యను గుర్తించడానికి వెంటనే ఐ చెకప్ చేయించుకోవాలి.
* డయాబెటిస్‌తో జాగ్రత్త
డయాబెటిస్ పేషంట్లు కంటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా కంటిచూపు పోయే ప్రమాదం కూడా ఉంది. డయాబెటిక్ రెటినోపతి అనేది వీరిలో తీవ్ర సమస్యలకు కారణం అవుతుంది. కంట్లో రెటీనా అనేది చాలా సున్నితమైన భాగం. డయాబెటిక్ పేషంట్లలో రెటినా రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే వీరు సంవత్సరానికి ఒక్కసారైనా అన్ని రకాల కంటి పరీక్షలు చేయించుకోవాలి. ముందుగానే గుర్తించడం ద్వారా కళ్లను కాపాడుకోవచ్చు.
* వంశపారపర్యంగా..
రెటినోబ్లాస్టోమా, గ్లకోమా వంటివి వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీ కుటుంబంలోని పెద్దవాళ్ల కంటి సమస్యలు, లక్షణాలు వంటివి తెలుసుకోవడం ముఖ్యం. వీటిలో ఎటువంటి లక్షణాలు మీకు లేకపోయినా వయసుతో సంబంధం లేకుండా ఏడాదికి ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ మహేశ చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Eye science, Eyes, Health care