వైద్యులు సూచించకుండా మందులు వినియోగించడం ప్రమాదం. చాలా మంది ఈ పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం మంది ప్రతి చిన్న సమస్యకు యాంటీబయాటిక్స్‌ను వాడుతుంటారు. లేనిపోని దుష్ప్రభావాలను కొని తెచ్చుకుంటారు. యాంటీబయాటిక్స్ అత్యంత సాధారణ యాంటీమైక్రోబయాల్ పదార్థాలు. ఇవి బ్యాక్టీరియాను చంపడం లేదా వాటి పెరుగుదలను అణచివేస్తూ అనారోగ్యాలను అడ్డుకుంటాయి. అయితే టెక్నాలజీ అందుబాటులోకి రావడం, సమాచారం సులువుగా లభిస్తుండటంతో, చాలా మంది ప్రజలు సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులను కొనుగోలు చేస్తున్నారు. ఇలా వినియోగించడం కారణంగా యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్, సైడ్ ఎఫెక్ వస్తాయి.
యాంటీబయాటిక్స్ మితిమీరిన వినియోగం లేదా అనవసరమైన వినియోగం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. యాంటీబయాటిక్స్ వినియోగంపై బెంగళూరు, ఆస్టర్ CMI హాస్పిటల్, ఇంటర్నల్ మెడిసిన్- సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ బిందుమతి PL చెబుతున్న జాగ్రత్తలు తెలుసుకుందాం.
* యాంటీబయాటిక్స్ అతిగా వినియోగిస్తే ఎదురయ్యే సమస్యలు
- గట్ ఫ్లోరా అప్‌సెట్
సరైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని నిర్ధారించడంలో సహాయపడే బ్యాక్టీరియాను గట్ ఫ్లోరా అంటారు. యాంటీబయాటిక్స్ మితిమీరిన వినియోగం గట్‌లో అసమతుల్యతను కలిగిస్తుంది. ఈ బ్యాక్టీరియా నిష్పత్తి తగ్గిపోవడంతో, అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
- విరేచనాలు
చాలా మంది వ్యక్తులు తరచుగా సాధారణ జలుబు లేదా ఫ్లూ చికిత్సకు యాంటీబయాటిక్స్‌ను ఆశ్రయిస్తారు, ఇది పిల్లలలో, పెద్దలలో తరచుగా అనేక అవాంఛిత దుష్ప్రభావాలకు దారితీస్తుంది. CDC (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) అధ్యయనం ప్రకారం.. దగ్గు, జలుబు వంటి ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కోసం యాంటీబయాటిక్స్ తీసుకునే పిల్లల్లో C.డిఫ్ అనే బ్యాక్టీరియా యాంటీబయాటిక్-రెసిస్టెంట్ జాతులకు ఆస్కారం ఉంది. C.డిఫ్ మానవ పేగులలో ఉంటుంది. ఇది తీవ్రమైన విరేచనాలకు కారణమవుతుంది. ఈ బ్యాక్టీరియా కారణంగా ప్రతి సంవత్సరం పిల్లలు, పెద్దలలో వేలాది మంది మరణిస్తున్నారు. అనాఫిలాక్సిస్, స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్, హెపాటోటాక్సిసిటీ, నెఫ్రోటాక్సిసిటీ, అరిథ్మియా వంటి ప్రాణాంతక దుష్ప్రభావాలు కూడా సంభవించవచ్చు.
- ఫంగల్ ఇన్ఫెక్షన్లు
యాంటీబయాటిక్స్ హానికరమైన బ్యాక్టీరియాను చంపడానికి తయారుచేసినప్పటికీ, అవి తరచుగా మంచి బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తాయి. దీంతో యాంటీబయాటిక్స్ తీసుకునే వ్యక్తులు తరచుగా నోటి, గొంతు, యోని వంటి భాగాలలో ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురవుతారు.
- డ్రగ్ ఇంటరాక్షన్స్
యాంటీబయాటిక్స్ కొన్నిసార్లు ఇతర మందులతో కూడా ఇంటరాక్ట్ అవుతాయి. వ్యాధులపై ఆ మందులు పనిచేసే ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇతర ఔషధాలు లేదా యాంటీబయాటిక్స్ దుష్ప్రభావాలు కూడా పెరుగుతాయి. కొన్ని యాంటీబయాటిక్స్ కాలేయ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తాయి, ఇవి కొన్ని యాంటీబయాటిక్స్, కార్డియాక్ డ్రగ్స్, యాంటీపైలెప్టిక్ డ్రగ్స్, కాంబినేషన్ డ్రగ్స్ శక్తిని పెంచుతాయి లేదా తగ్గిస్తాయి.
- యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్
యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉపయోగించినప్పుడు బ్యాక్టీరియా దాని నిర్మాణాన్ని మార్చుకోవడానికి లేదా కొన్ని ఎంజైమ్‌లను విడుదల చేయడానికి ప్రయత్నిస్తుంది. దీని కారణంగా రోగులకు చికిత్స చేయడానికి గతంలో ఉపయోగించిన యాంటీబయాటిక్‌లకు నిరోధకత అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు, టైఫాయిడ్, జ్వరం మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు గతంలో ఉపయోగించిన అదే యాంటీబయాటిక్ అదే వ్యాధికి తర్వాత పని చేయదు. ఇంతకుముందు, క్షయవ్యాధి వంటి వ్యాధులకు 6 నెలలకు 3-4 మందులు మాత్రమే అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు రెసిస్టెన్స్ ఉన్నందున, 1.5- 2 సంవత్సరాలకు 9-11 మందులు అవసరం అవుతున్నాయి.
* యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు
1. వైద్యులు సూచించిన మోతాడులో యాంటీబయాటిక్స్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని రోజులలో మంచి అనుభూతిని పొందడంలో సహాయపడుతుంది. సరైన చికిత్స కోసం సెల్ఫ్ మెడికేషన్ పక్కనపెట్టి, వైద్యులను సంప్రదించాలి.
2. అన్ని ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ అవసరం లేదు; తేలికపాటి జలుబు, దగ్గు, ఒకటి లేదా రెండు రోజులు ఉండే జర్వానికి యాంటీబయాటిక్స్ వినియోగించకూడదు. అవసరమైతేనే తీసుకోవాలి. బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌తో సంక్లిష్టంగా ఉంటే తప్ప సాధారణ విరేచనాలు, కడుపు నొప్పికి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. డెంగీ కూడా యాంటీబయాటిక్స్ అవసరం లేని వైరల్ ఇన్ఫెక్షన్. జ్వరం, హైడ్రేషన్ నియంత్రణ అవసరం. కొన్ని కేసుల్లో రక్తం, మలం, మూత్రం, చీము వంటివాటిని యాంటీబయాటిక్స్ ప్రారంభించే ముందు టెస్ట్ చేసుకోవాలి.
3. యాంటీబయాటిక్స్ హానికరమైన ప్రభావాలు తగ్గించడానికి, అంటువ్యాధుల బారిన పడే వ్యక్తులు, వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, సాధారణ ప్రజలు మాస్క్‌లు ధరించాలి. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి. హ్యాండ్ సానిటైజర్ ఉపయోగించాలి.
4. వ్యాక్సినేషన్ కూడా ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health care, Health Tips, Medicine