ఈ కాలంలో గుండె జబ్బులు (Heart Diseases) వయసు, జెండర్‌తో సంబంధం లేకుండా వస్తున్నాయి. గుండె జబ్బుల బారిన పడుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. భారతదేశంలో 15- 49 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో 18.69% మందిలో రోగనిర్ధారణ చేయని రక్తపోటు ప్రభావం ఉంది. దీంతో పురుషులకే ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఉంటాయనే అపోహలు తొలగిపోయాయి. అనేక ఇతర అంతర్జాతీయ అధ్యయనాలు కూడా ఇప్పుడు మహిళల్లో మరణానికి ప్రధాన కారణం గుండె జబ్బులని పేర్కొన్నాయి.
రొమ్ము క్యాన్సర్ కంటే పది రెట్లు ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. మహిళల్లో గుండె జబ్బులు పెరుగుతున్నప్పటికీ, అవగాహన లోపం వల్ల చాలా మందికి సకాలంలో వైద్యం అందడం లేదు. వ్యాధి నిర్ధారణ జరగడం లేదు. దీనికి సంబంధించి బెంగళూరు, ఆస్టర్ CMI హాస్పిటల్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ- సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ డి సూచనలు తెలుసుకుందాం.
* మహిళల్లో గుండె జబ్బులు ఎందుకు గుర్తించడం లేదు?
సాధారణంగా భారతదేశంలోని మహిళలు కుటుంబం కోసం తమ సొంత అవసరాలను విస్మరిస్తారు. వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఉదాహరణకు ఒక స్త్రీకి తేలికపాటి ఛాతీ నొప్పి ఉంటే, ఆమె లక్షణాలను విస్మరిస్తుంది. వైద్యుడిని సందర్శించకుండా, ఇంటి పనులపై దృష్టి పెడుతుంది. మన సమాజంలోని పితృస్వామ్య విధానం కూడా మహిళలు తమను తాము చూసుకోవడం కంటే ఇతరుల శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆశిస్తోంది. దీని ఫలితంగా మహిళల్లో ఆలస్యంగా రోగనిర్ధారణ జరుగుతోంది. దేశంలోని మహిళల్లో గుండె జబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి.
పురుషులు, స్త్రీలలో గుండెపోటు లక్షణాలు భిన్నంగా ఉంటాయి. చాలా మంది స్త్రీలకు గతంలో ఒకటి లేదా రెండుసార్లు గుండెపోటు వచ్చినా తెలియదు. పురుషులలో, గుండెపోటు సాధారణంగా విపరీతమైన, ఆకస్మిక ఛాతీ నొప్పికి కారణమవుతుంది. శరీరం చల్లగా మారిపోయి చెమటలు పోస్తాయి. అయితే మహిళల్లో లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. స్త్రీలలో లక్షణాలు దవడ నొప్పి, అలసట, మెడ, వెన్ను నొప్పి, చెమటలు పట్టడం, గుండెల్లో మంట వంటివి ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించిన స్త్రీలు తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
* ఏ వయస్సులో ఎక్కువగా గుండెపోటు వస్తుంది, ఆందోళన కలిగించే అంశాలు ఏవి?
45-55 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో తక్కువ స్థాయిలో ఈస్ట్రోజెన్ పోస్ట్ మెనోపాజ్, పని, కుటుంబ ఒత్తిడి, ఒంటరితనం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ వయస్సులో ఉన్న ఎక్కువ మంది స్త్రీలలో రోగనిర్ధారణ జరగడం లేదు, పురుషులతో పోలిస్తే భిన్నమైన లక్షణాలు ఉండవచ్చు. 60 సంవత్సరాల వయస్సు వారికి కూడా గుండె జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. వయసు మీద పడుతున్నప్పుడు, శరీరం బలహీన పడుతున్న సమయంలో పురుషులు, మహిళల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, ఊబకాయం, ధూమపానం, నిశ్చల జీవనశైలి, మధుమేహం కూడా స్త్రీలను హృదయ సంబంధ వ్యాధులకు గురిచేసే కొన్ని ప్రధాన కారకాలు.
* మహిళలు గుండెపోటు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1. మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి. ప్రమాద కారకాలపై అవగాహన పెంచుకోండి.
2. ధూమపానం లేదా పొగాకు వాడకం మానేయండి.
3. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, స్థూలకాయాన్ని అధిగమించడానికి ప్రతిరోజూ 30-45 నిమిషాలు యోగా, డ్యాన్స్, రన్నింగ్, వాకింగ్ వంటి శారీరక కార్యకలాపాలలో పాల్గొనండి.
4. జంక్ ఫుడ్, ఎరేటెడ్ డ్రింక్స్ మానేయండి. సమతుల ఆహారాన్ని తీసుకోండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, చిక్కుళ్ళు, పండ్లు, కూరగాయలు, తక్కువ చక్కెర, ఉప్పు, కొవ్వుతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాలు గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.
గుండెపోటుతో జెండర్‌కి ఎటువంటి సంబంధం లేదని. పురుషులు, స్త్రీలను సమానంగా ప్రభావితం చేస్తుందని గమనించడం ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని బహుమతి పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health care, Health Tips, Heart Attack, Women health