హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Obesity In Children: మీ పిల్లలు అధిక బరువుతో ఉన్నారా? తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Obesity In Children: మీ పిల్లలు అధిక బరువుతో ఉన్నారా? తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Health Tips: ఊబకాయం నుంచి పిల్లలను రక్షించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. పిల్లలు వాటిని పాటించేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో పరిశీలిద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Obesity In Children: ప్రపంచం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం ఒకటి. ఇటీవల కాలంలో పిల్లలు, యుక్త వయసు ఉన్నవారిలో ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈ అధిక బరువుకు ప్రధాన కారణం ఆహార అలవాట్ల (Food Habits) లో నియంత్రణ లేకపోవడమేనని నిపుణులు అంటున్నారు. శరీర బీఎంఐ 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం (Obesity)గా పరిగణిస్తారు. అధిక బరువు లేదా ఊబకాయం అనేక రకాల మానసిక, శారీరక సమస్యలకు దారి తీస్తుంది. చాలా మంది పిల్లలు తినే ఆహారానికి, ఖర్చు చేసే శక్తి మధ్య సమతుల్యం పాటించకపోవడంతో ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే, ఊబకాయం నుంచి పిల్లలను రక్షించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. పిల్లలు వాటిని పాటించేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు (Parenting Tips) తీసుకోవాలి. అవేంటో పరిశీలిద్దాం.

* ఫిజికల్ యాక్టివిటీ (Physical Activity)

పిల్లలు అతిగా బరువు పెరగటానికి ఉన్న ముఖ్యమైన కారణాల్లో శారీరక శ్రమ చేయకపోవడం ఒకటి. ఊబకాయం నుంచి పిల్లలను బయటపడేయాలంటే వారు రోజు గ్రౌండ్‌కు వెళ్లేలా అలవాటు చేయాలి. ఆ సౌకర్యం లేని వారు ఇంట్లోనే ప్రతిరోజు పిల్లలతో క్రమం తప్పకుండా వ్యాయామం చేయించాలి. దీంతో పిల్లల శరీరంలోని అదనపు కేలరీలు బర్న్ అవుతాయి. వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా రోజంతా ఎంతో చురుకుగా ఉంటారు. ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్రికెట్, స్విమ్మింగ్, బ్యాట్మెంటన్ వంటి స్పోర్ట్స్ యాక్టివిటిస్‌లో కూడా పాల్గొనేలా పిల్లలను వారి తల్లిండ్రులు ప్రోత్సహించాలి.

* ఆరోగ్యకరమైన ఆహారం (Healthy Food)

చాలా మంది పిల్లలకు ఆహారం విషయంలో జాగ్రత్తలు తెలియవు. ఎలాంటి ఫుడ్స్ తినాలో, ఏదీ తినకూడదో అసలు అవగాహన ఉండదు. సాధారణంగా పిల్లలు రుచికరమైన జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు. దీంతో బరువు సులువుగా పెరుగుతుంటారు. కాబట్టి, పిల్లల్లో కేలరీల వినియోగాన్ని పరిమితం చేయడానికి పేరెంట్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామో పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. ప్రతిరోజు పిల్లల ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిక్కుళ్లు వంటివి ఉండేలా చూసుకోవాలి. ప్రాసెస్ చేసిన, కొవ్వు, క్యాన్డ్ అండ్ జంక్ ఫుడ్స్ వంటివి పిల్లలు తినకుండా శ్రద్ద తీసుకోవాలి.

పీరియడ్స్ సమయంలో పొట్ట ఉబ్బరంగా ఉందా? ఈ 5 ఆహారాలను ప్రయత్నించండి..

* స్క్రీన్ టైమ్ తగ్గించడం (Reduce Screen Time)

స్మార్ట్‌ఫోన్ వచ్చాక చాలా మంది పిల్లలు గ్రౌండ్‌కు వెళ్లడం మానేశారు. స్కూల్ నుంచి వచ్చిందే మొదలు నిద్రపోయే వరకు చేతిలోని ఫోన్‌ను అసలు వదలడం లేదు. ఫోన్ లేకపోతే టీవీ, ల్యాప్‌టాప్, ఇతర గాడ్జెట్స్ చూస్తూ ఉంటారు. ఇలా స్క్రీన్ టైమ్ ఎక్కువ అయితే.. పిల్లల నిద్రపై ప్రభావం పడుతుంది. దీంతో వారు బరువు పెరిగే అవకాశం ఉంది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లల్లో ఈ అలవాటును మాన్పించి పుస్తకాలు చదివించడం వంటివి చేస్తూ ఉండాలి.

* వేళకు నిద్ర (Good Sleep)

నిద్ర బాగా పడితే మరుసటి రోజు ఎంతో హుషారుగా ఉంటారు. క్వాలిటీ స్లీపింగ్ ఉంటే పిల్లలో టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది. తగినంత నిద్ర లేని పిల్లలు బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి పిల్లలు వేళకు నిద్రపోయేలా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Health, Health Tips, Life Style, Lifestyle

ఉత్తమ కథలు