హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Granular Jaggery: ఇకపై పంచదార రూపంలోనే బెల్లం.. ఎన్నెన్నో లాభాలు

Granular Jaggery: ఇకపై పంచదార రూపంలోనే బెల్లం.. ఎన్నెన్నో లాభాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇకపై బెల్లం కూడా పంచదార మాదిరిగానే పలుకుల రూపంలో లభించనుంది. బెల్లాన్ని పలుకుల రూపంలో ఉత్పత్తి చేసేందుకు ఇటీవల అనకాపల్లిలోని ANGRAU యూనివర్సిటీలోని రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ లో ఒక టెక్నాలజీని అభివృద్ధి చేశారు.

తీపి పదార్థమైన బెల్లంలో ఎన్నో పోషక, ఔషధ విలువలు ఉన్నప్పటికీ.. చాలామంది పంచదారే వాడుతుంటారు. పంచదారకి ఉన్నంత డిమాండ్ బెల్లానికి ఉండకపోవటానికి గల కారణం.. పంచదార కణిక (గ్రాన్యులర్) లేదా పలుకుల రూపంలో లభించడమే. చిన్న పలుకులుగా ఉండే పంచదార ప్యాకేజింగ్ కి, వినియోగానికి చాలా అనువుగా ఉంటుంది. అయితే ఇకపై బెల్లం కూడా పంచదార మాదిరిగానే పలుకుల రూపంలో లభించనుంది. బెల్లాన్ని పలుకుల రూపంలో ఉత్పత్తి చేసేందుకు ఇటీవల అనకాపల్లిలోని ANGRAU యూనివర్సిటీలోని రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ లో ఒక టెక్నాలజీని అభివృద్ధి చేశారు. పోస్ట్-హార్వెస్ట్ ఇంజినీరింగ్, టెక్నాలజీ (AICRP on PHET) లపై జరిపిన ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అయితే మార్చి 12, 2021న రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (RARS) ఈ టెక్నాలజీకి పేటెంట్ (ప్రత్యేకహక్కు) పొందింది.

తదనంతరం పలుకుల బెల్లం తయారీకి సంబంధించిన మెషినరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ టెక్నాలజీని 5 కంపెనీలకు నాన్-ఎక్స్‌క్లూజివ్ ప్రాతిపదికన బదిలీ చేసింది. దీనితో వోవెల్ టెక్నాలజీస్(మహారాష్ట్ర), చక్రవర్తి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్(తిరుపతి), కెవిఎల్ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్(సికింద్రాబాద్‌), జయలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్(సికింద్రాబాద్‌), శుభం ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(విశాఖపట్నం) కంపెనీలు గ్రాన్యులర్ రూపంలో బెల్లాన్ని ఉత్పత్తి చేయడానికి సిద్ధమవుతున్నాయి.

ఈ విషయం గురించి మరిన్ని వివరాలు తెలియజేశారు అనకాపల్లిలోని RARS లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా వ్యవహరిస్తున్న డా. పీ.వీ.కే జగన్నాధరావు. బెల్లం గ్రాన్యులేటర్ తో పాటు క్రిస్టల్ రూపంలో బెల్లం ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఇతర మెషినరీలను ఆయన అభివృద్ధి చేశారు. మీడియాతో మాట్లాడిన జగన్నాధరావు.. చక్కెర కంటే బెల్లం శ్రేష్టమైనదని అన్నారు. చక్కెరలో 99.9% సుక్రోజ్ ఉంటుందని.. కానీ బెల్లంలో 80-85% సుక్రోజ్.. 10-12 శాతం గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయని వివరించారు. క్యాల్షియం, మెగ్నీషియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజాలతో పాటు విటమిన్ ఎ, బి తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తాయని తెలిపారు. చక్కెరలు, ప్రోటీన్లు, కొవ్వు తగ్గించే ఇతర పోషకాలు బెల్లంలో సమృద్ధిగా ఉంటాయని చెప్పుకొచ్చారు.

ANGRAU యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎస్.రామకృష్ణారావు అనే శాస్త్రవేత్త కూడా గ్రాన్యులర్ బెల్లం గురించి మాట్లాడారు. తమ వినూత్న టెక్నాలజీ.. గ్రాన్యులర్ బెల్లంలోని తేమ శాతాన్ని 1-2 శాతానికి తగ్గించిందని ఆయన అన్నారు. దీనివల్ల బెల్లం 18-24 నెలల వరకూ పాడుకాకుండా ఉంటుందని.. తద్వారా బెల్లాన్ని ఎగుమతి చేసుకోవచ్చని ఆయన అన్నారు. అధిక తేమ కారణంగా, 10-15 శాతం బెల్లం వృధా అవుతోందని.. నగదు రూపంలో చెప్పుకుంటే సంవత్సరానికి రూ. 800 కోట్ల నష్టం చేకూరుతోందని ఆయన అన్నారు. అయితే, బెల్లం ఉత్పత్తిని పెంచడానికి PMFME కింద నిధులతో ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

First published:

Tags: Jaggery

ఉత్తమ కథలు