FTD: ఒత్తిడితోపాటు ముసలితనంతో వచ్చే మతిమరుపును వైద్యులు డిమెన్షియా (Dementia) అని పిలుస్తారు. ఒక వ్యక్తి జ్ఞాపక శక్తి, ఆలోచనా సామర్థ్యం (Cognitive Decline) కాలక్రమేణా క్షీణించే స్థితిని ఇది సూచిస్తుంది. ఈ మతిమరుపులో చాలా రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా (Frontotemporal Dementia). ఇది మెదడు ముందు, పక్క భాగాలను ప్రభావితం చేసే ఒక రకమైన చిత్తవైకల్యం (Dementia). ఈ వ్యాధిలో అమియోట్రోఫిక్ లేటరల్ స్క్లేరోసిస్ (ALS), ప్రోగ్రెసివ్ సూపర్ న్యూక్లియర్ పాల్సీ (PSP) సహా వివిధ రకాల ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియాలు ఉన్నాయి. ఇవన్నీ ఫ్రంటోటెంపోరల్ లోబార్ డిజెనరేషన్ అని పిలిచే ఒక వైద్య పరిస్థితి కిందికి వస్తాయి. ఈ కండిషన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా సాధారణంగా 65 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కనిపిస్తుంది. ఇది ఇతర రకాల డిమెన్షియా మాదిరిగా కాకుండా చాలా తక్కువ మందిని ప్రభావితం చేస్తుంది. ప్రతి లక్ష మందిలో 15-22 మందికి మాత్రమే ఈ వైకల్యం వస్తుంది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా (FTD)తో 12-18 లక్షల మంది బాధపడుతున్నట్లు అంచనా. FTD మెదడులోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుందనే దానిపై ఆధారపడి రోగులలో మార్పులు వస్తాయి. సాధారణంగా FTD రోగులలో బిహేవియర్ చేంజ్, సెమాంటిక్ డిమెన్షియా, ప్రైమరీ ప్రోగ్రెసివ్ అఫాసియా వంటి మూడు రకాల సమస్యలు వస్తాయి.
బిహేవియర్ చేంజ్ FTD అనేది సాధారణంగా ప్రవర్తన, వ్యక్తిత్వంలో మార్పులకు దారితీస్తుంది. ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని నియంత్రించే బ్రెయిన్ ఫ్రంటల్ లోబ్ దెబ్బతినడం వల్ల ఈ లక్షణాలు తలెత్తుతాయి. ఇది ఇతరులతో మాట్లాడేటప్పుడు చెడు ప్రవర్తన, సానుభూతి లేకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రతపై ఆసక్తి కోల్పోవడం వంటి వాటికి దారితీస్తుంది. దృష్టి కేంద్రీకరించడాన్ని కూడా కష్టతరం చేస్తుంది. ఈ రకం FTD వచ్చినవారు సులభంగా పరధ్యానంలో పడుతుంటారు. కొందరు చేతులు చప్పట్లు కొడుతుంటారు. మరికొందరు ఒకే సినిమాలను పదేపదే చూసే అలవాటును పెంచుకుంటారు. సెమాంటిక్ డిమెన్షియా ఒక వ్యక్తి భాషను అర్థం చేసుకునే, పదాలను ఉపయోగించగల సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
ప్రైమరీ ప్రోగ్రెసివ్ అఫాసియా వచ్చినవారు సరిగా మాట్లాడలేరు. మాట్లాడటంతోపాటు, సరైన పదాలను ఉపయోగించడంలో ఇబ్బంది పడతారు. సెమాంటిక్ డిమెన్షియా, ప్రైమరీ నాన్ ఫ్లూయెంట్ అఫాసియా రోగులు పేర్లను మరచిపోవచ్చు. వీరికి చదవడం, రాయడం కష్టంగా మారవచ్చు. ఈ ప్రైమరీ ప్రోగ్రెసివ్ అఫాసియా తీవ్రతరమైతే రోగులు మూగవారయ్యే ప్రమాదం ఉంది. ఇక మోటారు సమస్యలు కూడా వీరిని బాధించవచ్చు. ఈ వ్యాధిగ్రస్తుల ఆయుర్దాయం 7-13 సంవత్సరాలు ఉంటుంది. వీరి మరణానికి శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు కారణమవుతాయి. అలాగే బరువు తగ్గడం వల్ల కూడా వీరు చనిపోతుంటారు.
* ఎందుకు వస్తుంది?
ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా మెదడులో పేరుకుపోయే టౌ ప్రొటీన్ల (Tau proteins) వల్ల వస్తుంది. ఈ ప్రోటీన్లు మెదడు కణాలు ఎలా పని చేస్తాయో ప్రభావితం చేస్తాయి. ఫ్రంటల్, టెంపోరల్ లోబ్స్ కుంచించుకుపోయేలా చేస్తాయి. కొందరు వ్యక్తులకు జన్యుపరంగా ఈ పరిస్థితి వస్తుంది.
Epilepsy: మహిళల్లో మూర్ఛ లక్షణాలు ఎలా ఉంటాయి..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స వివరాలు..
ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియాను రోగి వ్యాధుల చరిత్ర, కాగ్నేటివ్ సామర్ధ్యాల ఆధారంగా నిర్ధారణ చేస్తారు. ఇక బ్రెయిన్ MRI ఫ్రంటల్, టెంపోరల్ లోబ్స్‌లో కుచించికుపోయిన ప్రాంతాలను చూపుతుంది. FDG PET స్కాన్ మెదడులోని ఇదే ప్రాంతాల్లో తగ్గిన బ్రెయిన్ యాక్టివిటీ/పనితీరును చూపుతుంది.
* చికిత్స
ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియాకు చికిత్స లేదు. బిహేవియర్ చేంజ్ డిమెన్షియా ఉన్నవారు లక్షణాలను తగ్గించడానికి యాంటిడిప్రెసెంట్ మందులు వాడవచ్చు. భాషాపరమైన ఇబ్బందులు ఉన్నవారికి స్పీచ్ థెరపీ సహాయపడవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health alert