మానవునికి ప్రాణాంతకమైన వ్యాధుల్లో ఒకటి క్యాన్సర్(Cancer). ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండియాలో కూడా ఈ సంఖ్య గణనీయంగానే ఉంది. వివిధ రకాల క్యాన్సర్లు శరీరాన్ని దెబ్బతీస్తాయి. ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్నా, క్యాన్సర్‌ను పూర్తిగా కట్టడి చేయలేకపోతున్నారు. ఇలాంటి ప్రాణాంతకమైన క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్(Cervical cancer)ఒకటి. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV)కారణంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుంది. అయితే దీన్ని కట్టడి చేయడానికి తాజాగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్(Vaccine)ను వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో(School) విద్యార్థిణులకు ఉచితంగా ఇవ్వనున్నారు.
వ్యాక్సిన్ రూపొందించిన సీరమ్:
సర్వైకల్ క్యాన్సర్‌ను నిర్మూలించేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఇటీవల సర్వావ్యాక్ (CERVAVAC) వ్యాక్సిన్‌ను డెవలప్ చేసింది. ఇది తక్కువ ధరకే లభిస్తుంది, హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) నుండి కాపాడుతుంది.
ఉచితంగా పంపిణీ:
అయితే దేశవ్యాప్త ఇమ్యునైజేషన్ డ్రైవ్‌లో భాగంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న 9 నుంచి 14 సంవత్సరాల వయసుగల ఆడపిల్లలకు ఈ CERVAVAC వ్యాక్సిన్‌ను వచ్చే సంవత్సరం మధ్య నుంచి ఉచితంగా అందిస్తామని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ఖరీదు ఎక్కువైనప్పటికీ, దేశవ్యాప్తంగా నిర్దేశించిన వయస్సు పిల్లలందరికీ దీన్ని ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. అన్ని పాఠశాలల్లోని విద్యార్ధిణులకు ఈ వ్యాక్సిన్లు అందించాలని మంత్రి సూచించారు.
అవగాహన పెంచాలి:
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో సర్వైకల్ క్యాన్సర్ పట్ల విద్యార్థిణులకు అవగాహన కల్పించాలని, HPV వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వారికి తెలియజేయాలని కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ సంజయ్ కుమార్, ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ముందుగా 5 నుంచి 10వ తరగతుల విద్యార్ధిణులకు ఈ వ్యాక్సిన్‌ను అందిస్తామని తెలిపారు.
ఆరోగ్యానికి పెద్దపీట:
నలుగురు క్యాబినెట్ మంత్రులతో కలిసి సుభాష్ సర్కార్ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మోదీ సర్కార్ 2014లో అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజల ఆరోగ్య భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నాట్లు చెప్పారు. దేశంలో కోవిడ్ నాలుగో వేవ్ కేసులు మొదలవుతున్న సందర్భంగా దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 2020 నుండి 2022 వరకు దేశవ్యాప్తంగా 3388 టెస్టింగ్ లేబరేటరీ డెవలప్ చేసినట్లు తెలిపారు. దేశంలోని ప్రాణాంతక వ్యాధుల పట్ల ప్రజలకు ఇమ్యూనిటీ పెంచేందుకు తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్, మిషన్ ఇంద్రధనష్ వంటి స్కీముల గురించి తెలియజేశారు. దేశంలో 16 నూతన AIIMSలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cancer, Free vaccine, National News