ఈ రోజుల్లో ప్రజలు పేలవమైన జీవనశైలి వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఎక్కువ కాలం బాధించే హార్ట్ ఫెయిల్యూర్‌కి కూడా గురవుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల దీనివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని కావేరి హాస్పిటల్స్ ఎలక్ట్రానిక్ సిటీ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ గణేష్ నల్లూరు శివ్ హార్ట్ ఫెయిల్యూర్ గురించి ముఖ్యమైన వివరాలు పంచుకున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.
* హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి
గుండె శరీరంలోని కీలక అవయవాలైన మెదడు, కిడ్నీ వంటి వాటికి రక్తాన్ని పంపాల్సినంత మోతాదులో పంపకపోవడాన్నే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. దీనివల్ల శరీరానికి తగినంత రక్తం అందకుండా పోతుంది.
* లక్షణాలు
హార్ట్ ఫెయిల్యూర్ బాధితులలో శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేటప్పుడు శ్వాస సరిగా ఆడదు. ఈ సమయంలో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఎదురవుతుంది. కాళ్లు లేదా పొత్తికడుపులో వాపు వస్తుంది. అలానే ఈ పరిస్థితిలో అలసట లేదా బలహీనంగా అనిపించవచ్చు.
* ఈ సమస్య ఎవరికి వస్తుంది?
గతంలో గుండెపోటు వచ్చిన వారికి, అలాగే యాంజియోప్లాస్టీ, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (CABG) అనే శస్త్రచికిత్సలు పొందిన వారికి హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు ఎక్కువ. నియంత్రించలేని అధిక రక్తపోటు లేదా మధుమేహంతో ఎక్కువ కాలం బాధపడుతున్న వ్యక్తులకు కూడా ఇది సంభవించవచ్చు. ఇది వైరల్ మయోకార్డిటిస్ లేదా రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఉన్న యువకులకు కూడా సంభవించవచ్చు.
* హార్ట్ ఫెయిల్యూర్ నిర్ధారణకు చేసే కామన్ టెస్ట్స్
హార్ట్ ఫెయిల్యూర్‌ను నిర్ధారించడానికి డాక్టర్లు ఎలక్ట్రో కార్డియోగ్రామ్, ఎకోకార్డియోగ్రామ్ వంటి కొన్ని పరీక్షలను చేస్తారు.
- ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG-Electrocardiogram) టెస్ట్‌ను గుండె ఎలక్ట్రికల్ యాక్టివిటీని చెక్ చేయడానికి చేస్తారు.
- మరో టెస్ట్ అయిన ఎకోకార్డియోగ్రామ్‌లో హార్ట్ ఇమేజ్‌ను రూపొందించడానికి ధ్వని తరంగాలను ఉపయోగిస్తారు. ఈ పరీక్ష ద్వారా గుండె ఎంత బాగా పనిచేస్తుందో, గుండెలోని కవాటాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలను డాక్టర్లు తెలుసుకుంటారు.
- రక్తహీనత, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కూడా హార్ట్ ఫెయిల్యూర్ సింప్టమ్స్ తలెత్తుతాయి. ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన అది హార్ట్ ఫెయిల్యూర్ అని నిర్ధారించడం సరికాదు కాబట్టి డాక్టర్లు పూర్తి క్లారిటీ కోసం రక్త పరీక్షలు నిర్వహిస్తారు.
హార్ట్ ఫెయిల్యూర్‌ను నిర్ధారించిన తర్వాత, గుండె రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు/బ్లాకెజీలు ఉన్నాయో చెక్ చేయడానికి డాక్టర్లు యాంజియోగ్రామ్ చేయవచ్చు.
* హార్ట్ ఫెయిల్యూర్‌కు చికిత్స ఏంటి?
హార్ట్ ఫెయిల్యూర్ బాధితుల శరీరంలోని అదనపు ద్రవాన్ని తొలగించడానికి, గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడటానికి డాక్టర్లు మందులు ఇవ్వవచ్చు. ఆ మందులలో మూత్రవిసర్జన ఎక్కువగా వచ్చేలా చేసే టాబ్లెట్లు (Diuretics) లేదా వాటర్ టాబ్లెట్స్, ACE ఇన్హిబిటర్లు, AT2 antagonists, బీటా బ్లాకర్లు ఉండవచ్చు.
* హార్ట్ ఫెయిల్యూర్‌కు ఇతర చికిత్సలు
మూసుకుపోయిన ధమనులు లేదా చెడు/తప్పుడు కవాటం వంటివి హార్ట్ ఫెయిల్యూర్‌కు కారణమైతే వాటికి మొదటగా చికిత్స చేయడానికి డాక్టర్ ప్రయత్నించవచ్చు. ఇందుకు యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ లేదా వాల్వ్ రీప్లేస్‌మెంట్ వంటి ప్రక్రియలను అనుసరించవచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగించడానికి ప్రత్యేక పేస్‌మేకర్‌లను కూడా ఉపయోగించవచ్చు. సీరియస్ కేసులలో గుండె రక్తాన్ని పంపడానికి సహాయపడే ఒక డివైజ్ వాడొచ్చు. లేదా గుండె మార్పిడి చేయవచ్చు.
* రోగులు చేయాల్సిందేంటి?
- రోగులు వైద్యులు సూచించిన మందులు సకాలంలో వేసుకోవాలి.
- డాక్టర్ల సలహా మేరకు వాకింగ్ వంటి ఎక్సర్‌సైజులు డైలీ చేయాలి.
- ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. డాక్టర్ సూచన మేరకు ఫ్లూయిడ్స్ తగ్గించాలి.
- వారి గుండె ఆరోగ్యాన్ని నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. లక్షణాలు తీవ్రరూపం దాల్చినట్లయితే వీలైనంత త్వరగా డాక్టర్‌ను కలవాలి.
* ప్రోగ్నోసిస్ ఎలా ?
హార్ట్ ఫెయిల్యూర్ రోగనిరూపణ (Prognosis) లేదా రికవరీ కొన్ని క్యాన్సర్ల కంటే చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల, రోగులు వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి. వైద్యుని సలహాను పాటించడం కూడా చాలా ముఖ్యం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health care, Heart