Health tips for Monsoon: వర్షాకాలంలో ఆరోగ్యం జాగ్రత్త.. ఈ చిట్కాలు పాటించాలంటున్న FSSAI

ప్రతీకాత్మక చిత్రం

డెంగ్యూ, చికన్ గున్యా, మలేరియా, కలరా, టైఫాయిడ్, డయేరియా, వైరల్ ఫీవర్ వంటి ఎన్నో వ్యాధులు వర్షా కాలంలోనే ఎక్కువగా ప్రబలుతుంటాయి.

  • Share this:
వర్షాకాలం అంటే చాలామందికి ఇష్టం. అందమైన వాతావరణం, బయట వర్షం పడుతుంటే వేడి వేడి స్నాక్స్ తింటూ కాలం గడపడం అందరికీ ఇష్టమైన పనులే.. అయితే వర్షా కాలం కేవలం వీటినే కాదు.. ఎన్నో రకాల రోగాలను కూడా తీసుకొస్తుంది. డెంగ్యూ, చికన్ గున్యా, మలేరియా, కలరా, టైఫాయిడ్, డయేరియా, వైరల్ ఫీవర్ వంటి ఎన్నో వ్యాధులు వర్షా కాలంలోనే ఎక్కువగా ప్రబలుతుంటాయి. వీటితో పాటు జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విభాగం వారు. కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ విభాగం వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు కొన్ని చిట్కాలను అందించింది. వీటిని పాటించడం వల్ల వర్షా కాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం తక్కువగా ఉంటుందని వెల్లడిస్తోంది.

వర్షాకాలంలో ఆహారం ద్వారా వచ్చే వ్యాధుల సంఖ్య పెరుగుతుందని FSSAI చెబుతోంది. అందుకే ఈ కాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ప్రస్తుతం కరోనా కూడా ప్రబలుతున్నందువల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వర్షాకాలంలో ఆరోగ్యం పాడవకుండా కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవేంటంటే..

* వంట చేయడానికి ముందు అన్ని రకాల ఆహారపదార్థాలను బాగా కడగాలి.
* మీ ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
* వంట చేయడానికి, తాగడానికి శుభ్రమైన నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది.
* తాజా ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మీకు అవసరం ఉన్నంత మాత్రమే వండుకోండి. ఒకవేళ ఆహారం మిగిలితే రిఫ్రిజిరేటర్‌లో పెట్టి ఉంచండి. దీని ద్వారా సూక్ష్మ జీవులు పెరగకుండా ఉంటాయి. ఆ తర్వాత వేడి చేసి తీసుకోండి.
* పాలు, పెరుగు వంటి పదార్థాలు ఫ్రిజ్ లో పెట్టడం మంచిది.
* తాజా పదార్థాలు, కూరగాయలు మాత్రమే ఉపయోగించడం మంచిది.
* అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, పసుపు, మిరియాలు వంటివి ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published: