Health Issues: మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగుల పనివేళల్లో మార్పులు జరుగుతున్నాయి. మీడియా, ఐటీ, ఫార్మా వంటి వివిధ రంగాల్లో 24 గంటలు కార్యకలపాలు జరుగుతూనే ఉంటాయి. దీంతో ఉద్యోగులు షిఫ్టుల వారీగా ఎప్పుడైనా పనిచేయాల్సి ఉంటుంది. ఒక వారం ఉదయం చేస్తే, మరొక వారం రాత్రి పూట ఆఫీసులకు వెళ్లాలి. కంపెనీ అవసరాలకు లోబడి పనిచేస్తున్నప్పటికీ ఇలా రొటేషనల్ షిఫ్టుల్లో, నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తే ఉద్యోగి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎన్నో వ్యాధులు చుట్టు ముట్టి చివరికి జీవిత కాలమే తగ్గే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నైట్ షిఫ్టుల్లో పనిచేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ విషయంపై ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్’లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా హెల్త్ కేర్ రంగానికి చెందిన సిబ్బందే నైట్ షిఫ్టుల్లో పని చేస్తున్నారని ఈ స్టడీ వెల్లడించింది. ఇలా ఐదేళ్లు అంతకన్నా ఎక్కువ కాలం పాటు పనిచేస్తే మహిళలపై తీవ్ర దుష్ప్రభావాలు చూపుతుందని అందులో పేర్కొంది. వీరిలో గుండెనాళాలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువయ్యే అవకాశం ఉందని, నైట్ షిఫ్టుల్లో పనిచేయడంతో నిద్ర తక్కువై నిద్రలేమి సమస్యకు దారితీస్తుందని రిసెర్చ్ తెలిపింది. ప్రధానంగా మహిళల జీవ గడియారం(బయో సైకిల్) దెబ్బతింటుందని వెల్లడించింది.
* సమస్యలు తప్పవు
రొటేషనల్ షిఫ్టుల్లో పనిచేసే వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వెల్లువెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. బరువు పెరగడం, చికాకు కలగడం, మెదడు భారంగా అనిపించడం, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు త్వరగా దరిచేరే ముప్పు ఉందంటున్నారు. వీటితో పాటు అజీర్తి సమస్యలు, ఎసిడిటీ, మల బద్ధకం, డయేరియా వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు అటాక్ చేస్తాయని హెచ్చరిస్తున్నారు. నైట్ షిఫ్టుల్లో పని చేసే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటి బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు.
* వ్యాయామం
ప్రతి ఒక్కరికీ వ్యాయామం తప్పనిసరి. ముఖ్యంగా కూర్చుని పనిచేసే వారికి శారీరక అలసట రాదు. అంటే శరీరంలో మిగతా భాగాలు అంత చురుకుగా ఉండవు. దీంతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, తప్పనిసరిగా వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి వ్యాయామం ఒక మంత్రంగా పనిచేస్తుందని చెబుతున్నారు. కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు ప్రతిరోజు వ్యాయామానికి సమయం కేటాయించుకోవాలి. జిమ్‌కి వెళ్లడం వీలు కాకపోతే కనీసం ఇంట్లోనైనా చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. నడవడం, మెట్లు ఎక్కి దిగడం వంటివి చేయాలి.
Rambagh Palace: ప్రపంచంలోనే బెస్ట్ హోటల్ మన దగ్గరే..ఈ హోటల్ ప్రత్యేకతలు ఇవే..
* నిద్ర ముఖ్యం
ప్రతి ఒక్కరికి రాత్రి నిద్ర ఎంతో ముఖ్యం. కానీ, ఆ సమయంలో పనిచేస్తున్న కారణంగా రాత్రి నిద్రను తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు కచ్చితంగా కంటి నిండా నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పడుకునే గదిలో ఎక్కువగా వెలుతురు ఉండకుండా చూసుకోవాలని చెబుతున్నారు. నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్లు వంటి డిజిటల్ స్క్రీన్లను చూడకూడదని సూచిస్తున్నారు. శరీరానికి కావాల్సినంత నిద్ర పోతేనే చురుగ్గా పనిచేసేందుకు వీలు కలుగుతుందని వైద్యులు అంటున్నారు.
* పౌష్టికాహారం
ఆరోగ్యకరమైన జీవనానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యం. లేట్ నైట్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. వీటితో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగి డయాబెటిస్‌కు దారితీయవచ్చు. మెటబాలిజం కూడా దెబ్బతింటుంది. అందుకే డే టైమ్‌లో తక్కువ తక్కువగా ఎక్కువ సార్లు తీసుకునే ప్రయత్నం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health care