Vaccination Side effects: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా.. ఈ దుష్ప్రభావాలతో జాగ్రత్త!

కరోనా వ్యాక్సిన్ దుష్ప్రభావాల నుంచి ఎలా బయటపడాలి? (ప్రతీకాత్మక చిత్రం)

కరోనా టీకా తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు కనిపించడం సహజమే. అవి కాస్త ఆందోళనకు గురి చేసినా.. ఒకటి లేదా రెండు రోజుల వ్యవధిలో తగ్గిపోతుంది.

  • Share this:
కరోనా మహమ్మారి (Corona Pandemic) ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందుతూనే ఉంది. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మరోపక్క భారతదేశంలో కరోనా థర్డ్ వేవ్ (Third Wave) వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో వ్యాక్సిన్ (Vaccine) తీసుకోవడం అనివార్యంగా మారింది. కరోనా టీకా వైరస్ తీవ్రతను తగ్గించి ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రాణాలు కాపాడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ రోజురోజుకీ పెరిగిపోతున్న పరిశోధనలతో ప్రజల్లో టీకా సైడ్ ఎఫెక్ట్స్, సామర్థ్యంపై అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో ఏ సైడ్ ఎఫెక్ట్స్ పట్ల జాగ్రత్తపడాలో, టీకా తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలుసుకుందాం..

* సైడ్ ఎఫెక్ట్స్ సర్వసాధారణమే
కరోనా టీకా తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు కనిపించడం సహజమే. అవి కాస్త ఆందోళనకు గురి చేసినా.. ఒకటి లేదా రెండు రోజుల వ్యవధిలో తగ్గిపోతాయి. జ్వరం, చలి, అలసట, ఇంజెక్షన్ చేసిన శరీర భాగం వద్ద నొప్పి లక్షణాలు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సాధారణంగా కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు. అలా అని వారిలో వ్యాక్సిన్ ఎదుర్కొనే సామర్థ్యం రాదని చెప్పడం సరికాదు. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అనుభవించేవారు తమలో వైరస్ అభివృద్ధి చెందుతుందని భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకోగానే రోగనిరోధక వ్యవస్థ కొత్త వ్యాధికారకాన్ని గుర్తించడం ప్రారంభిస్తుంది. అందుకే దుష్ప్రభావాలు కనిపిస్తాయి. వీటి గురించి ఆందోళన చెందకర్లేదు.

* ఎప్పుడు ఆందోళన చెందాలి?
టీకా సైడ్ ఎఫెక్ట్‌ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అలాగే జాగ్రత్త తీసుకోవాల్సిన అసాధారణ సైడ్ ఎఫెక్ట్‌ల జాబితాను విడుదల చేసింది. వ్యాక్సినేషన్ తరువాత 20 రోజుల్లోపు జ్వరం, అనారోగ్యం, చేతిలో పుండ్లు కనిపిస్తే ఎలాంటి ఆందోళనకు గురికావద్దు. కానీ టీకా తర్వాత కొత్త లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇలాంటి హానికరమైన కొత్త లక్షణాల గురించి కేంద్రం ఒక జాబితా విడుదల చేసింది. అవేంటో తెలుసుకుంటే... శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి, కడుపులో వికారం, వాంతులు, తీవ్రమైన నొప్పి, మూర్ఛలు, అవయవాల్లో నొప్పి, చేతులు లేదా పాదాలలో వాపు, మసక చూపు, దీర్ఘకాలిక తలనొప్పి, శరీరంలో ఏదైనా భాగంలో బలహీనత, ఇంజక్షన్ చేసిన ప్రదేశంలో మచ్చలు.

ISRO: రెండు ప్రైవేట్ కంపెనీలతో ఇస్రో ఒప్పందం.. సంస్థకు రాకెట్స్ అందించనున్న స్టార్టప్స్


 * వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్, వైరస్ ఇన్ఫెక్షన్లలో ఏది ఎక్కువ హాని కలిగిస్తుంది?
టీకా సైడ్ ఎఫెక్ట్స్ ఆందోళనకరంగా కనిపించినా, కరోనా సోకడమే మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ టీకా తీసుకోని వ్యక్తుల్లో తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. కానీ టీకా తీసుకుంటే తీవ్రమైన అనారోగ్యం బారిన పడే ప్రమాదం చాలా తక్కువ. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, టీకాలు తీసుకోని వ్యక్తులు కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరే అవకాశం 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. టీకాలు తీసుకున్న వారితో పోలిస్తే వారిలో 10 రెట్లు మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే కరోనా టీకా తీసుకోవడం చాలా ముఖ్యం.

Published by:John Naveen Kora
First published: