Home /News /life-style /

Intelligence Quotient : కరోనా కాలంలో పుట్టిన పిల్లల్లో తక్కువ ఐక్యూ.. సంచలన విషయాలు వెల్లడించిన నిపుణులు..

Intelligence Quotient : కరోనా కాలంలో పుట్టిన పిల్లల్లో తక్కువ ఐక్యూ.. సంచలన విషయాలు వెల్లడించిన నిపుణులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Intelligence Quotient : పిల్లల్లో లోకజ్ఞానం పెరగడానికి మొదటి సంవత్సరాలు చాలా కీలకం. కానీ కరోనా కారణంగా వ్యాపారాలు, నర్సరీలు, ప్లే గ్రౌండ్లు సహా అన్ని కార్యకలాపాలు ఆగిపోవడంతో పెద్దలు, పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు.

కరోనా వైరస్ అందరి జీవితాల్లో ఎన్నో మార్పులు తెచ్చింది. ఇంటికే పరిమితం కావడంతో మానసికంగానూ విపరీతమైన ప్రభావం చూపింది. ఇది పెద్దలకే పరిమితం కాదు.. శిశువులపై కూడా చాలా ఎఫెక్ట్ చూపుతోంది. కరోనా కాలంలో పుట్టిన కొందరు శిశువుల్లో ప్రస్తుతం ఐక్యూ (Intelligence Quotient) స్థాయిలు తక్కువగా ఉన్నాయట. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ నివేదిక వెల్లడించింది. తెలివితేటల స్థాయులను ఐక్యూలో కొలుస్తుంటారు. కరోనా ప్రభావం వల్ల లాక్​డౌన్​లు ఉండడం, బయటి ప్రపంచంలో తిరగలేకపోవడం, వేరే వారితో ఎక్కువగా మాట్లాడే అవకాశం లేకపోవడంతో పెద్దలు.. పిల్లలను బయటికి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా లేకపోయాయి. దీంతో శిశువులు కూడా ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చిన్న వయసులో బయటి ప్రపంచాన్ని చూసి నేర్చుకోవాల్సిన విషయాలను కరోనా కాలంలో పుట్టిన శిశువులు మిస్సవుతున్నారని నివేదిక పేర్కొంది.అమెరికాలోని రోడ్ ఐలాండ్​ రాష్ట్రానికి చెందిన దాదాపు 672 మంది పిల్లలపై రీసెచర్లు అధ్యయనం చేశారు. వీరిలో జూలై 2020 తర్వాత పుట్టిన పిల్లలు 308 మంది కాగా.. జనవరి 2019 నుంచి మార్చి 2020 మధ్య జన్మించిన శిశువులు 176 మంది ఉన్నారు.

కరోనా కాలంలో పుట్టిన పిల్లల్లో అంతకు ముందు పుట్టిన పిల్లలతో పోలిస్తే తక్కువ ఐక్యూ ఉన్నట్టు గుర్తించామని బ్రౌన్ యూనివర్సిటీ పీడియాట్రిక్స్​ అసోసియేట్ ప్రొఫెసర్​ సీన్ డియోనీ చెప్పారు. అయితే ఈ ప్రభావం సుదీర్ఘ కాలంలో ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందని ఇప్పుడే చెప్పలేమని పరిశోధకులు చెప్పారు. సాధారణంగా మూడు నెలలు, మూడు సంవత్సరాల మధ్య వయసు ఉండే పిల్లలల్లో ఐక్యూ స్కోరు దాదాపు 100 ఉంటుంది. అయితే కరోనా సమయంలో పుట్టిన కొందరు పిల్లల్లో ఇది 78 మాత్రమే ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు.

పిల్లల్లో లోకజ్ఞానం పెరగడానికి మొదటి సంవత్సరాలు చాలా కీలకం. కానీ కరోనా కారణంగా వ్యాపారాలు, నర్సరీలు, ప్లే గ్రౌండ్లు సహా అన్ని కార్యకలాపాలు ఆగిపోవడంతో పెద్దలు, పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో శిశువులు బయటి ప్రపంచాన్ని చూడలేకపోయారు. అలాగే ఇంటికి సన్నిహితుల రాకపోకలు కూడా భారీగా తగ్గడం వల్ల కూడా వారిపై ప్రభావం చూపింది. దీంతో వారితో మాట్లాడే వారు తక్కువైపోయారు. ఫలితంగా మాటలను గ్రహించే శక్తి కూడా పిల్లల్లో మందగించి ఉంటుందని నివేదిక వెల్లడించింది.

ముఖ్యంగా ఇళ్లకే పరిమితం కావడమే పిల్లల్లో ఐక్యూ శాతం తగ్గడానికి కారణమని ఈ అధ్యయనం తేల్చింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. అయితే భవిష్యత్తుపై ఇది ప్రభావం చూపుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేమని నివేదిక వెల్లడించింది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Children, Corona effect, Life Style

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు