HEALTH CAN YOU REALLY LOSE WEIGHT WITH THESE WELL PUBLICIZED WEIGHT LOSS DRINKS HERE IS THE TRUTH MKS
weight loss drinks : గ్రీన్ టీ, ఇతర డ్రింక్స్‌తో నిజంగానే బరువు తగ్గొచ్చా? -వాస్తవమేంటో తెలుసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
వేర్వేరు కారణాలతో లావెక్కిపోయిన చాలా మంది వేగంగా బరువు తగ్గాలనే ఆలోచనలో ప్రచారాలను నమ్మేస్తుంటారు. ఫలానా డ్రింక్ తాగితేనో, గ్రీన్ టీ రోజుకు ఇన్ని సార్లు తాగితేనో సులువగా బరువు తగ్గిపోతారని విన్న వెంటనే వాటిని తెప్పించుకుంటారు. మరి నిజంగా ఆ వెయిట్ లాస్ డ్రిక్స్ తో శరీరం బరువు తగ్గిపోతుందా? నిపుణులు చెబుతున్న వాస్తవాలివి..
చెడు ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవడంతో ఊబకాయం సమస్యకు గురయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా లాక్‌డౌన్‌తో ఈ సమస్య మరింత ఎక్కువైంది. పెద్ద వాళ్లే కాదు చిన్న పిల్లలు కూడా ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అందుకే బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల పద్ధతులను అవలంభిస్తుంటారు. కొంతమంది డైటింగ్ చేస్తూ గంటల కొద్ది జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారు. మరికొందరు, బరువు తగ్గించే డ్రింక్స్ తీసుకుంటుంటారు. అయితే, ఏదైనా అతి అనర్థమే. వేగంగా బరువు తగ్గాలనే ఆశతో ఎక్కువ మొత్తంలో డ్రింక్స్ తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేవలం పానీయాలతో బరువు తగ్గడం సులభం కాదని స్పష్టం చేస్తున్నారు. అందువల్ల, వీటిని సమపాళ్లలో తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం వెయిట్ లాస్‌కు బాగా ప్రచారంలో ఉన్న హెల్త్ డ్రింక్స్‌ను పరిశీలిద్దాం.
గ్రీన్ టీ
వెయిట్ లాస్ విషయంలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న డ్రింక్ గ్రీన్ టీ. కొందరు త్వరగా బరువు తగ్గాలనే తపనతో రోజూ 3–4 కప్పులు లేదా అంతకన్నా ఎక్కువ గ్రీన్ టీ తాగుతుంటారు. ఇది చాలా హెల్తీ డ్రింక్ అయినప్పటికీ.. బరువు తగ్గడానికి ఏమాత్రం ఉపయోగపడదు.
అల్లం, తేనె, నిమ్మరసం మిశ్రమం
అల్లం, తేనె, నిమ్మరసంతో తయారు చేసిన గోరు వెచ్చని మిక్స్డ్ డ్రింక్ చాలా రుచికరంగా ఉంటుంది. ఇది మీకు రిఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. దీన్ని ఉదయాన్నే తాగడం వల్ల బరువు తగ్గవచ్చని ప్రచారంలో ఉంది. అయితే, ఇది అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ పానీయంలోని పోషకాలు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. కానీ, ఈ డ్రింక్ కొవ్వు కరిగించడంలో ఎలాంటి పాత్ర పోషించదు. అందువల్ల, ఈ డ్రింక్ ఉదయాన్నే తాగినా ఎలాంటి వెయిట్ లాస్ ప్రయోజనాలు ఉండవు.
ఎనర్జీ డ్రింక్స్
జిమ్, వ్యాయామం విరామంలో చాలా మంది ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటారు. దీని వల్ల బరువు తగ్గొచ్చని భావిస్తారు. కానీ వాస్తవం దీనికి పూర్తిగా విరుద్ధం. ఎనర్జీ డ్రింక్స్‌లోని కెఫెన్ మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. అంతేగాని ఇది మీ బరువు తగ్గించలేదు.
యాపిల్ సిడార్ వెనిగర్
యాపిల్ సిడార్ వెనిగర్ బరువు తగ్గించే పానీయంగా బాగా ప్రాచుర్యంలో ఉంది. నిజానికి ఇది గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేసి, షుగర్ వ్యాధి ముప్పును తగ్గిస్తుంది. కానీ బరువు తగ్గడంలో ఏమాత్రం సహాయపడదు. యాపిల్ సిడార్ వెనిగర్.. కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. తద్వారా ఎక్కువ ఆకలి అవ్వదు. ఫలితంగా ఇది మీ బాడీ మాస్ ఇండెక్స్‌ను మార్చదు. వాస్తవానికి ఈ డ్రింక్ తరచుగా తాగడం వల్ల ఎసిడిటీ, అజీర్తి సమస్యలు, నోటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది లాక్సిటివ్స్, ఇన్సులిన్ వంటి ఇతర మందులు వేసుకున్నప్పుడు దీని తీసుకోకూడదు.
స్మూతీలు
స్మూతీలు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అదుపు చేయడంలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీస్, రాస్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్‌ను పాలలో కలిపి తాగితే బరువు తగ్గొచ్చని చాలా మంది భావిస్తారు. కానీ, వాస్తవానికి దీనితో అంతగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
జ్యూస్
వివిధ పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చని అంతా భావిస్తారు. కానీ మోతాదుకు మించి తీసుకుంటే ఊబకాయానికి కారణమవుతుంది. లెప్టిన్ హార్మోన్ ఇందుకు సహకరిస్తుంది. అందువల్ల, మోతాదుకు మించి పండ్లు, కూరగాయల రసాలు తాగకూడదు.
వివిధ పరిశోధనల్లో వెల్లడైన అంశాలను ఈ జాబితాలో అందించాం. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారు కేవలం ఇలాంటి డ్రింక్స్‌పై ఆధారపడకుంగా నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.