మనం ఉదయం పూట తీసుకునే ఆహారంలో శరీరానికి కావాల్సిన పోషకాలు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు, ప్రతి రోజూ తప్పనిసరిగా అల్పాహారం(Breakfast) తీసుకోవాలి. అయితే కొంత మంది బిజీ లైఫ్ స్టైల్ కారణంగా బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తుంటారు. అధిక బరువుతో(Heavy Weight) బాధపడుతున్న వారు కూడా తరచూ బ్రేక్‌ఫాస్ట్ చేయరు. అయితే ఇది మంచి అలవాటు కాదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. క్రమం తప్పకుండా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే..
* అతి ఆకలి కంట్రోల్..
ఉదయాన్నే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అధిక బరువు ఉన్న వారు వెయిట్ తగ్గడం కోసం తరచూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయరు. అయితే ఇది సరైన పద్దతి కాదని నిపుణులు అంటున్నారు. అధిక ఎనర్జీ (More Energy) ఇచ్చే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ప్రతి రోజూ తీసుకుంటే ఆకలి కంట్రోల్లో ఉంటుంది. దీనివల్ల హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. దీంతో ఊబకాయంతో బాధపడేవారు బరువు తగ్గడానికి అస్కారం ఉంటుంది.
* షుగర్, గుండె జబ్బులకు చెక్
క్రమం తప్పకుండా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే దీర్ఘకాలంలో గుండె జబ్బుల బారిన పడే రిస్క్ తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన అల్పాహారం కారణంగా షుగర్ వ్యాధి రిస్క్ తగ్గుతుందని పలు పరిశోధనల్లో తేలింది. రోజూ బ్రేక్‌ఫాస్ట్ చేయడం వల్ల రక్తంలో ఇన్సులిన్ అదుపులో ఉంటుంది. మెదడు పనితీరు అద్భుతంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీంతో ఏకాగ్రతతో పనిచేస్తారు.
* బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే నష్టాలు
తరచూ బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేవారిలో ఆకలి పెరుగుతుంది. దీంతో జంక్ ఫుడ్ పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. దీంతో బరువు పెరగవచ్చు. ఉదయం పూట అల్పాహారం తినకపోతే శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ తగ్గిపోతాయి. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఇవి మళ్లీ వేగంగా పెరుగుతాయి. ఈ పరిస్థితి తరచూ ఉంటే టైప్ 2 డయాబెటిస్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది.
Amla Health Benefits: ఉసిరితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలుసా?
* జీవనశైలి వ్యాధుల ప్రమాదం
పరిశోధనల ప్రకారం.. బ్రేక్‌ఫాస్ట్ మానేసే వారు అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, ఊబకాయం వంటి మరెన్నో జీవనశైలి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. చివరికి ఇది స్ట్రోక్స్, గుండెపోటుకు దారి తీస్తుంది. ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే.. ఉదయాన్నే తీసుకునే అల్పాహారంలో ప్రోటీన్లు, తృణధాన్యాలు, పాలిష్ చేయని పప్పులు, తాజా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. దీంతో రోజంతా ఉత్సాహంగా పనిచేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Breakfast, Health news