నేటి పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరూ ఉరుకుల, పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. ఉద్యోగ, వ్యాపార జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు మహిళలు.. పురుషులతో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపట్లేదు. ఉద్యోగం చేస్తున్న అమ్మలు అయితే ఆరోగ్యం కాపాడుకోవడం మరింత ముఖ్యం. ఇటీవల కాల్షియం లోపాలతో ఎములకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎముకల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెబుతున్నారు బెంగుళూరులోని ఫోర్టిస్ హాస్పటల్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్, ఎముక, కీళ్ల శస్ర్త చికిత్స నిపుణుడు డా. సాయి కృష్ణ బి. నాయుడు.
నడక, ఆటలు, వ్యాయంతో పాటు మనం తీసుకునే ఆహారంలో లభించే పోషకాల మీద కూడా ఎముకల ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని డాక్టర్ సాయికృష్ణ అంటున్నారు. రుతుక్రమం ఆగిపోయిన వారికి, అలాగే బిడ్డకు పాలిచ్చే అమ్మలకు కాల్షియం ఎక్కువ అవసరం. లేదంటే వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అన్ని వయసుల వారు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డా. సాయి కృష్ణ బి. నాయుడు ఈ సూచనలు చేస్తున్నారు.
* వయసు బట్టి మార్పు
వయసును బట్టి ఆహారం, వ్యాయామం వంటి వాటిలో చాలా తేడాలు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో యుక్త వయసు వారిలో ఎండ తగలక శరీరానికి కావాల్సిన విటమిన్-డి అందక కాల్షియం లేమితో బాధపడుతున్నారు. మధ్యవయస్కులు సైతం తగినంత విటమిన్-డి లేక వ్యాయామం చేయక ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. వృద్ధుల్లో ఎముకలు అరిగిపోయి ఆస్టియోపోరోసిస్‌తో బాధపడుతున్నారు.
* పరిష్కారం ఇదే..
మనం తీసుకునే ఆహార పదార్థాలలో కాల్షియం, విటమిన్-డి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కాల్షియం కోసం పాలు, పెరుగు, పాలకూర, బాదం, నారింజ, చేపలు, పుట్టగొడుగులు తదితర ఆహారం తీసుకోవాలి. విటమిన్-డి కోసం సార్డినెస్, సాల్మన్, ట్యూనా వంటి చేపలు, కార్డ్‌లివర్ ఆయిల్, గుడ్డులోని పచ్చసొన, పుట్టగొడుగులు తినాలి. సూర్యరశ్మి అన్నింటి కంటే ప్రధానమైనది.
* వయసు వారీగా చూస్తే..
4 నుంచి 8 ఏళ్ల వయసు వారికి రోజుకు 800 మిల్లీగ్రాముల కాల్షియం, 200 ఐయూ (యూనిట్లు) విటమిన్-డి అవసరం.
9 నుంచి 13 ఏళ్ల వయసు వారికి రోజుకు 1300 మి.గ్రా. కాల్షియం, 200 ఐయూ విటమిన్-డి అవసరం.
14 నుంచి 18 ఏళ్ల వయసు వారికి రోజుకు 1300 మి.గ్రా. కాల్షియం, 200 ఐయూ విటమిన్-డి అవసరం.
19 నుంచి 30 ఏళ్ల వయసు వారికి రోజుకు 1000 మి.గ్రా. కాల్షియం, 200 ఐయూ విటమిన్-డి అవసరం.
31 నుంచి 50 ఏళ్ల వయసు వారికి రోజుకు 1000 మి.గ్రా. కాల్షియం, 200 ఐయూ విటమిన్-డి అవసరం.
51 నుంచి 70 ఏళ్ల వయసు వారికి రోజుకు 1200 మి.గ్రా. కాల్షియం, 400 ఐయూ విటమిన్-డి అవసరం.
71 ఏళ్లు పైబడిన వారికి రోజుకు 1200 మి.గ్రా. కాల్షియం, 600 ఐయూ విటమిన్-డి అవసరం.
* ఎముకల బలం ఇలా సాధ్యం
ఎముకల ఆరోగ్యానికి కాల్షియం, విటమిన్-డి, విటమిన్-కె చాలా అవసరం. రోజూ చేసే వ్యాయామంతో ఎముకల బలాన్ని పెంచుకోవచ్చు. ప్రమాదంలో ఎముకకు గాయమైనా, కొత్త ఎముక ఏర్పడుతున్నా, వాటికి బలం చేకూర్చడానికి నడక, పరుగు, జిమ్, డ్యాన్స్ లాంటి వ్యాయామ ప్రక్రియలు ఎంతో మేలు చేస్తాయి.
* వృద్ధుల్లో ఇలా..
వృద్ధులు ఎక్కువగా ఎముకల బలహీనతతో బాధపడుతుంటారు. రుతుక్రమం ఆగిపోయిన మహిళలు, 60 ఏళ్లు నిండిన వృద్ధులు హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆస్టియోపోరోసిస్‌తో బాధపడుతుంటారు. దీన్ని పూర్తిగా నివారించలేం. అయితే ఎప్పటికప్పుడు చికిత్స తీసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, వైద్యుడి సూచనలు పాటించడం ద్వారా వీలైనంత ఆరోగ్యంగా ఉండొచ్చు. దీన్ని తొలిదశలోనే గుర్తిస్తే నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. హార్మోన్ల థెరపీ ద్వారా చికిత్స అందించవచ్చు. డెక్సా స్కాన్ (DEXA scan), ఇతర రక్త పరీక్షలు ఆధారంగా నిపుణుల పర్యవేక్షణలోనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bones, Health care, Life Style, Mother, Women