Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
Health Tips: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రజల జీవన శైలి రోజు రోజుకూ మారుతోంది. ప్రస్తుతం అందరిదీ యాంత్రిక జీవనమైపోయింది. ఉరుకులు.. పరుగులతో జీవితాన్ని నెట్టికొస్తున్నారు. అసలు వ్యాయామం చేయడం.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనే విషయాన్ని మరిచిపోతున్నారు. దానికి తోడు రోజు రోజుకూ పెరుగుతు కాలుష్యం.. కల్తీలతో ప్రజలు అనారోగ్య సమస్యలు (Healt Problems) కొని తెచ్చుకుంటున్నారు. అందుకే ఇప్పుడు చాలామంది ఆరోగ్యంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. అందుకే కొందరు ఇప్పుడు మళ్లీ పాత పద్ధతుల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న మొన్నటి దాకా యంత్రాల ద్వారా తయారు చేసిన రిఫైండ్ ఆయిల్ (Refined Oil) పైనే మోజు పెరిగింది. వినియోగదారులు కూడా దానినే ఎక్కువగా వినియోగించారు. ఇంకా చెప్పాలంటే... విపరీతంగా వాడేశారు. రకరకాల నూనెలను కలిపేసి మరి వాడేస్తున్నారు. ఇలా వినియోగించిన వారే.. ఇప్పుడు మెల్ల మెల్లగా ఆనాటి పాత పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు.
కల్తీ నూనెల వాడకంతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వినియోగదారులు గ్రహించారు. అందుకే ఇప్పుడు మళ్లీ గానుగ నూనె వినియోగం పై మనసు పారేసుకుంటున్నారు. గానుగ నూనె వాడకంతో అనేక ప్రయోజనాలను సోషల్ మీడియా ద్వారా చూసి మరీ గానుగ నూనె కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రాణాంతక కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం పోషకాలు కలిగిన ఆహారంతో పాటు పోషకాలు కలిగిన నూనెలు సైతం వాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇందు కోసం మళ్లీ పాతకాలం విధానాల వైపు మళ్లుతున్నారు ప్రజలు. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో గానుగ నూనెల దుకాణాలకు జనం క్యూ కడుతున్నారు. గానుగ నూనెల విశిష్టతను తెలుసుకొని మరి కొనుగోలు చేస్తున్నారు.
ఇదీ చదవండి : టీడీపీ నియోజకవర్గాలపై సీఎం ఫోకస్.. 175 గెలవొచ్చు.. ఈసారి గెలిస్తే మరో 30 ఏళ్లు మనమే అన్న జగన్
అలాగే పాలిష్ బియ్యం కోసం ఆరాటపడిన వారు కూడా ఇప్పుడు కొర్రలు, సజ్జలు, జొన్నలు అంటూ అవే పాత పద్దతులను అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గానుగ దుకాణం దారులు అన్ని రకాల గానుగ నూనెలు, ఇతర పోషక పదార్థాలు అందుబాటులో ఉంచుతున్నారు. గతంలో రిఫైండ్ ఆయిల్ కోసం వందల రూపాయలు ఖర్చు చేసిన వారు కూడా ఇప్పుడు తప్పు చేశామని భావిస్తున్నారు. రిఫైండ్ వద్దు... గానుగ ముద్దు అంటున్నారు.
అటు గానుగ కేంద్రాల నిర్వాహకులు కూడా తమ దగ్గర అన్ని రకాల గానుగ నూనెలు అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే గానుగ నూనె వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరిస్తున్నారు. గానుగ తీసిన నూనెలను తక్కువ ఉష్ణోగ్రతల దగ్గరే తయారు చేస్తారు. అందుకే చక్కటి రుచి, సువాసన తోడవుతాయి. పోషకాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఈ పద్ధతిలో రసాయనాల వాడకం అస్సలు ఉండదు. సహజంగా నూనె గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ - ఇ, ఒమేగా- 3 , ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు, బయోఫ్లెవనాయిడ్లు మొదలైనవన్నీ గానుగ నూనెల్లో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
ఇదీ చదవండి: బావిలో పడ్డ భారీ ఏనుగు.. రాత్రంతా అలాగే ఘీంకారాలు.. ఎలా బయటకు తీశారంటే?
రిఫైన్డ్ నూనెలతో పోలిస్తే గానుగ నూనెలకు త్వరగా దుర్వాసన వచ్చే ఆస్కారం ఉంది. దీంతో నెలనెలా వాడకానికి తగినంత మాత్రమే కొనుక్కోవడం మంచిది. ఒక వేళ ఎక్కువ కాలం నిల్వ ఉంచాల్సి వస్తే ఎండ తగలని ప్రదేశంలో, ముదురు రంగు గాజు సీసాల్లో మాత్రమే భద్రపరచాలి. ఫ్రిజ్లో అయితే మూడు నెలల వరకు నిల్వ చేసి వాడుకోవచ్చు. గానుగ నూనెలోని పోషకాలన్నీ అందాలంటే వాటిని ఎక్కువ ఉష్ణోగ్రతలకు వేడి చెయ్యకూడదు. ముఖ్యంగా వేపుళ్లకు గానుగ నూనెలను వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Cooking oil, Gunturu, Health Tips