కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చేంత వరకు వైరస్ నిర్ధారణ పరీక్షలపై ప్రజలకు ఏమాత్రం అవగాహన ఉండేది కాదు. అయితే ఎప్పటి నుంచో వివిధ వైరల్ వ్యాధులను నిర్ధారించడానికి RT-PCR, ఇతర పరీక్షలను వినియోగిస్తున్నారు. ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్-పాలిమరేస్ చైన్ రియాక్షన్ (RT-PCR) పరీక్షను జికా, డెంగ్యూతో సహా అనేక ఇతర అనారోగ్యాలను గుర్తించడానికి ఉపయోగిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్‌కు ముందు దేశంలోని దాదాపు 200 ల్యాబొరేటరీలు మాత్రమే RT-PCR పరీక్షలు చేపట్టేవి. ఈ సంఖ్య ఇప్పుడు 3,000కి పైగా పెరగడం విశేషం. పరీక్ష కేంద్రాలు పెరగడంతో నిర్ధారణ పరీక్షల ఫలితాలు తక్కువ సమయంలో విడుదలవుతున్నాయి.
కోవిడ్-19, జికా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారనే అంశంపై న్యూస్18 వార్తాసంస్థ వైద్య నిపుణులను సంప్రదించింది. వారు అందించిన వివరాల ఆధారంగా వైరల్ వ్యాధుల నిర్ధారణకు ఎలాంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి? అవి ఎలా పనిచేస్తాయి? వంటి విషయాలు తెలుసుకుందాం.
* RT-PCR పరీక్షలు
మాలిక్యులర్ టెస్టింగ్ లేదా RT-PCR టెక్నాలజీ సాయంతో.. రక్తం, ముక్కు లేదా గొంతు స్రావాల శాంపిల్స్‌తో వైరస్‌ను గుర్తిస్తారు. శరీరంలో వైరల్ లోడ్ అత్యంత తక్కువగా ఉన్నా, ఆర్టీ-పీసీఆర్ టెక్నాలజీ గుర్తిస్తుంది. తద్వారా వైరస్‌ను ముందస్తుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. 2-4 గంటల్లోనే రిపోర్టులు వస్తాయి. జికా వంటి అనేక ఇతర వ్యాధుల నిర్ధారణకు ఈ పరీక్ష చేస్తారు. అయితే కోవిడ్ తరువాత ఈ పరీక్ష ధర గణనీయంగా పెరిగిందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ట్రూనాట్ (TrueNat), సీబీనాట్ (CBNAAT) వంటి పరీక్షలు కూడా ఇలాంటి టెక్నాలజీతోనే పనిచేస్తాయి. అయితే వీటి ద్వారా ఫలితాలు రావడానికి 1.5 గంటల సమయం పడుతుంది. ఈ యంత్రాలు ఒకేసారి రెండు శాంపిల్స్‌ను మాత్రమే లోడ్ చేయగలవు. కానీ RT-PCR విధానంలో యంత్రం ఒక రౌండ్లో 40 నుంచి 400 శాంపిల్స్‌ను ప్రాసెస్ చేయగలదు.
ప్రాణాంతక అంటువ్యాధి అయిన కోవిడ్-19ను ముందుగానే గుర్తించడం ముఖ్యమని చెబుతున్నారు పూణేకు చెందిన మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ వైద్య విభాగం డైరెక్టర్ డాక్టర్ గౌతమ్ వాంఖడే. కోవిడ్-19ను గుర్తించడానికి RT-PCR ఉత్తమమైన పద్ధతి అని ఆయన సూచిస్తున్నారు.
- జికా, చికున్‌గున్యా నిర్ధారణకు కూడా
జికా వైరస్‌ను గుర్తించడానికి కూడా RT-PCR ఒక ఉత్తమ పద్ధతి అని గౌతమ్ వాంఖడే చెబుతున్నారు. “జికా సెరోలాజికల్ డయాగ్నసిస్ కష్టంగా ఉన్నప్పటికీ, PCR-బేస్డ్ న్యూక్లియిక్ యాసిడ్ డిటెక్షన్ పద్ధతి ద్వారా ప్రయోజనాలు ఉంటాయి. యాంటీబాడీ పరీక్షలు కూడా నమ్మదగిన ఫలితాలను ఇవ్వవు. ఎందుకంటే అవి ఒకే కుటుంబానికి చెందిన డెంగ్యూ వంటి ఇతర వైరస్‌లతో క్రాస్-రియాక్ట్ అవుతాయి” అని వాంఖడే చెప్పారు. చికున్‌గున్యాను ముందస్తుగా గుర్తించడానికి కూడా RT PCR పరీక్షలు ఉపయోగపడతాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలు చెబుతున్నాయి.
* ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT)
ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) విధానంలో.. మానవ నిర్మిత లేదా సింథటిక్ యాంటీబాడీని ఉపయోగించి శరీర కణజాలాన్ని పరీక్షిస్తారు. అయితే ఈ పరీక్షలో పాజిటివ్‌గా తేలాలంటే.. నిర్దిష్ట సంఖ్యలో వైరస్ కణాలు అవసరం. అందువల్ల కొన్ని కేసులు మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్-19 సహా ఇతర వ్యాధులకు సంబంధించిన ప్రభుత్వ ప్రోటోకాల్స్ ప్రకారం.. RAT నెగిటివ్ రిజల్ట్ వచ్చిన రోగి RT-PCR టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే RAT రిపోర్ట్ పాజిటివ్ అని వస్తే వందశాతం వైరస్ పాజిటివ్ అని భావించాలి. ఈ పరీక్షలను వేగంగా నిర్వహించవచ్చు. 15 నిమిషాల నుంచి ఒక గంటలోపు ఫలితాలు వస్తాయి.
డెంగ్యూ నిర్ధారణలో ELISA పద్ధతిని ఉపయోగించవచ్చు. ELISA అనేది ఎంజైమ్-లింక్డ్ ఇమ్యునోసోర్బెంట్ అస్సే. ఈ పరీక్ష రక్త నమూనాలోని యాంటిజెన్, యాంటీబాడీలను గుర్తిస్తుంది. డెంగ్యూ నిర్ధారణకు NS1 యాంటిజెన్ ELISA సరైన టెస్టింగ్ పద్ధతి. డెంగ్యూ వైరస్ నాన్-స్ట్రక్చరల్ ప్రొటీన్ NS1ను ఇందులో కనుగొంటారు. ఇన్ఫెక్షన్ సమయంలో ఈ ప్రోటీన్ రక్తంలోకి స్రవిస్తుంది.
* యాంటీబాడీ పరీక్షలు (Antibody tests)
మానవ శరీరంలోకి ఏదైనా వ్యాధికారక క్రిమి ప్రవేశించినప్పుడు.. దాన్ని ఎదుర్కోవడానికి శరీరం యాంటీబాడీలను సృష్టిస్తుంది. రక్త పరీక్షల్లో ఈ యాంటీబాడీస్‌ను గుర్తించడం ద్వారా వైరస్ సంక్రమణను గుర్తించవచ్చు. అయితే ఈ యాంటీబాడీలు.. ఇన్ఫెక్షన్ సోకిన వెంటనే శరీరంలో ఉత్పత్తి కావు. అందువల్ల ఈ పరీక్షలను వైరస్ నిర్ధారణకు ఉపయోగించరు.
కోవిడ్-19, డెంగ్యూ వంటి కొన్ని వ్యాధుల్లో వ్యాధి ముదిరితే ప్రాణాంతకంగా మారవచ్చు. ఇలాంటి సందర్భాల్లో యాంటీబాడీ పరీక్షలకు ఎలాంటి విలువ ఉండదు. యాంటీబాడీ పరీక్షలను కేవలం వైరల్ వ్యాధుల నిఘా ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తుంటారు. అందువల్ల రోగనిర్ధారణ పరీక్షల్లో ఇది చివరి వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చు. వీటన్నింటిలో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నమ్మదగినవని వాంఖడే చెబుతున్నారు. వీటికి ఎక్కువ ప్రజాదరణ లభించిందని తెలిపారు.
యాంటీబాడీ ELISA పరీక్షల ద్వారా డెంగ్యూ, చికున్‌గున్యాను గుర్తించవచ్చు. అయితే వీటి ద్వారా 5-7 రోజుల అనారోగ్యం తర్వాత మాత్రమే నమ్మదగిన ఫలితాలు వస్తాయి. అందువల్ల రోగనిర్ధారణలో వీటికి వైద్యనిపుణులు ప్రాధాన్యం ఇవ్వరు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Dengue fever, Zika Virus