ప్లాస్టిక్ వాడకం లేని భారత్‌ను చూస్తామా... ప్రధాని మోదీ ఏం చెయ్యబోతున్నారు?

PM Modi Speech : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా... ఆగస్ట్ 15న ఎర్రకోటపై చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ... ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని పిలుపునిచ్చారు. అసలు కేంద్రం ఏం చెయ్యబోతోంది? ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఓ విశ్లేషణ.

Krishna Kumar N | news18-telugu
Updated: August 16, 2019, 11:57 AM IST
ప్లాస్టిక్ వాడకం లేని భారత్‌ను చూస్తామా... ప్రధాని మోదీ ఏం చెయ్యబోతున్నారు?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈ ప్రపంచానికి పట్టిన అతి పెద్ద కాలుష్యం ప్లాస్టిక్. దాని తీవ్రత ఎంతలా ఉందంటే... మహా సముద్రాల గర్భమంతా... ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతోంది. గాలిలో ప్లాస్టిక్ అణువులు... ఎగురుతూ... మన ఊపిరి తిత్తుల్లోకి వెళ్లిపోతున్నాయి. చివరకు అంటార్కిటికా, ఆర్కిటిక్ మంచు ఖండాల్లో కూడా ఈ ప్లాస్టిక్ అణువులు ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తేలింది. ప్లాస్టిక్ అనేది మనకు ఎంత ఉపయోగకరమో, అంత ప్రమాదకరం కూడా. ఎందుకంటే... ఓ అరటి తొక్క మట్టిలో పూర్తిగా కలిసిపోవడానికి 27 రోజులు పడుతుంది. అదే ఓ ప్లాస్టిక్ కవర్ భూమి పొరల్లో పూర్తిగా కలిసిపోవడానికి లక్ష సంవత్సరాలు పడుతుంది. అంటే... మనం రోజూ వాడి పారేస్తున్న ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులూ... మరో లక్ష సంవత్సరాల వరకూ... భూమిలోనే తిష్టవేసుకొని ఉంటాయన్నమాట. ఇలా... రోజూ కొన్ని కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల్ని మనకు తెలియకుండానే మనం... భూమికి భారంగా మార్చి... కాలుష్యాన్ని పెంచి... మన భూమిని మనమే నాశనం చేసుకుంటూ... మన జీవితాల్ని మనమే ప్రమాదంలో పడేసుకుంటున్నాం.

ఈ భయంకర వాస్తవాల్ని ఎప్పుడో గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2014లో స్వచ్ఛ భారత్ అనే నినాదం తెచ్చింది. ఆరేళ్లు దాటినా... పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. కారణం విచ్చలవిడిగా మనం వాడేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలే. అసలీ ప్లాస్టిక్‌నే నిషేధిస్తే... దీని తయారీని ఆపేస్తే... అప్పుడు కచ్చితంగా మార్పు వచ్చి తీరుతుందని కేంద్రం నమ్ముతోంది. ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... ప్లాస్టిక్ బదులు... గోనె సంచులు, క్లాత్ బ్యాగులూ వాడమని సూచించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు... ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ప్లాస్టిక్‌లో చాలా రకాల పాలిథిన్ పొరలుంటాయి. కొన్ని రకాలు భూమిలో కలవగలవు. కొన్ని కలవవు. దురదృష్టం కొద్దీ... ప్లాస్టిక్ కవర్ల తయారీ కంపెనీలు... భూమిలో కలవని పాలిథిన్ కవర్లనే తయారుచేస్తూ... వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి. భూమిలో కలిసే కవర్ల రేటు ఎక్కువగా ఉంటుండటంతో... ప్రజలు కూడా... చవకైన, ప్రమాదకరమైన ప్లాస్టిక్ కవర్లనే వాడేస్తున్నారు. ఫలితంగా అవి డ్రైనేజీల్లో ఇరుక్కుపోయి... వరదలు, అనేక నష్టాలకు కారణమవుతున్నాయి. ఎన్నో మూగజీవాలు... ఆ ప్లాస్టిక్ వ్యర్థాల్ని తినేస్తున్నాయి. చాలా సందర్భాల్లో ఆవులు, గేదెల పొట్టలో కేజీల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు లభిస్తున్నాయి. రోజూ కొన్ని లక్షల పక్షులు... ప్లాస్టిక్ వ్యర్థాల్ని తినేస్తూ... ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి.

మన దేశంలో బహిరంగంగా పొగ తాగకూడదన్న రూల్ ఉంది. దాన్ని పాటిస్తున్నది ఎంతమంది? చాలా నగరాల్లో రోడ్లపై ఉమ్మి వేడకూడదన్న రూల్ ఉంది. పాటిస్తున్నారా? ఇలా ఎన్నో రూల్స్ ఉన్నా... మన ఇండియాలో స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి... పాటించకపోయినా... చెల్లిపోతోంది. ప్లాస్టిక్‌పై నిషేధం కూడా ఇలాగే చచ్చింది. గతేడాది ప్రపంచ పర్యావరణ దినం నాడు... కేంద్రం స్వయంగా... 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (స్ట్రాలు, కప్పుల వంటివి)ను నిషేధించాలని రూల్ తెచ్చింది. కానీ అమలు కావట్లేదు.దేశంలో రోజూ 20వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు తయారవుతున్నాయి. వాటిలో 13 నుంచీ 14 వేల టన్నులను మాత్రమే కలెక్ట్ చెయ్యగలుగుతున్నారు. అలా కలెక్ట్ చేసిన వాటిని రీసైక్లింగ్ చెయ్యడమో లేదంటూ కాల్చి బూడిద చెయ్యడమో జరుగుతోంది. కలెక్ట్ చెయ్యలేని వ్యర్థాలు... డ్రైనేజీలు, కాలువలు, నదులు, సముద్రాల్లో కలుస్తున్నాయి. మన దేశంలో రీసైక్లింగ్ విధానం సరిగా లేదు. షాపుల దుకాణ దారులకు ఎన్నిసార్లు చెప్పినా... వాళ్లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లనే ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు... ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించేలా కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. అలాగే వేస్ట్ ప్లాస్టిక్‌తో రోడ్ల నిర్మాణం వంటి స్టార్టప్‌లను ప్రోత్సహించాలనే ఆలోచన కూడా ఉంది. రైతులు కూడా కెమికల్ ఫెర్టిలైజర్లను 10 నుంచీ 25 శాతం తగ్గించాలని ప్రధాని మోదీ రైతులను కోరుతున్నారు. ఈ పరిస్థితులు, పరిణామాల మధ్య అక్టోబర్ 2న ప్రధాని మోదీ ఏ ప్రకటన చేస్తారన్నది చర్చనీయాంశం అవుతోంది.
First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...