విదేశాలకు వెళ్లడం అంత ఈజీ కాదు.. ఎన్నో ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి. ఒక నిర్దిష్ట దేశానికి వెళ్లాలనుకునే అంతర్జాతీయ ప్రయాణికులకు అనుమతిగా వీసా మంజూరు చేస్తారు. సందర్శించాలనుకుంటున్న దేశంలోని కాన్సులేట్ లేదా రాయబార కార్యాలయం వీసాను జారీ చేస్తుంది. అయితే కొన్ని దేశాలు వీసా జారీలో చాలా కఠినమైన నిబంధనలను అనుసరిస్తున్నాయి. అవేంటో పరిశీలిద్దాం.
* రష్యా
వీసా జారీలో అత్యంత కఠినమైన నిబంధనలు ఉన్న దేశాల జాబితాలో రష్యా అగ్రస్థానంలో ఉంది. చాలా ప్రశ్నలు ఉన్న ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది. వీటికి అదనంగా, మీరు గత 10 సంవత్సరాల్లో ప్రయాణించిన అన్ని దేశాల జాబితాను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
* చైనా
చైనాను సందర్శించాలంటే సుదీర్ఘమైన వీసా విధానాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అయితే 53 దేశాల ప్రయాణికులకు మాత్రం చైనా ప్రత్యేక అనుమతులు ఇస్తుంది. వీరు వీసా లేకుండా ఆ దేశంలోని 13 నగరాల్లో ట్రావెల్ చేయడానికి, 72 గంటల వరకు ఉండడానికి అనుమతిస్తుంది. అయితే ఇందులో భారతదేశ ప్రయాణికులకు చోటులేదు. చైనీస్ వీసా పొందాలంటే దరఖాస్తు సమయంలో చాలా డ్యాకుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.
* ఉత్తర కొరియా
ఈ దేశాన్ని హెర్మిట్ కింగ్‌డమ్ అని కూడా ఉంటారు. అక్కడి ప్రభుత్వం ఆమోదించిన పర్యాటక సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే వీసా మంజూరు చేస్తారు. లేకపోతే ఆ దేశంలోకి ప్రవేశించడం కుదరదు.
* ఇరాన్
ఉత్తర కొరియా మాదిరిగానే, ఇరాన్‌ను సందర్శించాలని అనుకునే టారిస్ట్‌లు తప్పనిసరిగా అక్కడి ట్రావెల్ ఏజెన్సీకి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని దేశాల పౌరులకు వీసా ఆన్ అరైవల్ విధానాన్ని ప్రారంభించడంతో ఈ ప్రక్రియ కొద్దిగా సరళంగా మారింది. అయితే ఈ జాబితాలో భారత్‌కు చోటులేదు. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన భారతీయలను ఇరాన్‌లోకి ప్రవేశించకుండా గత ఆరు నెలలుగా నిషేధం విధించారు.
* తుర్క్‌మెనిస్తాన్
ఈ దేశంలోకి ఎంటర్ కావడం అంత సులువు కాదు. వీసా జారీలో చాలా కఠినమైన నిబంధనల కారణంగా చాలా మంది తుర్క్‌మెనిస్తాన్‌ను సందర్శించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. వీసా కోసం దరఖాస్తు సమయంలో తుర్క్‌మెన్ స్టేట్ మైగ్రేషన్ సర్వీస్ మూడు కాపీలను అందజేస్తుంది. వాటిని కచ్చితంగా పూరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, వీసా దరఖాస్తు కోసం ఏదైనా తుర్క్‌మెనిస్తాన్ స్పాన్సర్ నుంచి ఆహ్వాన లేఖ ఉండడం తప్పనిసరి.
* సౌదీ అరేబియా
ఈ దేశంలోకి ప్రవేశించాలంటే వసతి ఫ్రూప్, ఆరు నెలల చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్‌ను సమర్పించడం తప్పనిసరి. మరోపక్క ముస్లిమేతరులు మక్కా, మదీనా వంటి తీర్థయాత్ర నగరాలను సందర్శించకుండా నిషేధం విధించారు.
* ఆఫ్ఘనిస్తాన్
ఇతర దేశాలతో పోలిస్తే, ఆఫ్ఘనిస్తాన్ వీసా జారీలో కొంత సడలింపు ఉంది. అయితే యుద్ధంలో దెబ్బతిన్న దేశాన్ని సందర్శించడం మంచిది కాదు. దౌత్యపరమైన పాస్‌పోర్ట్ ఉన్న ఏ భారతీయ పౌరుడైనా 30 రోజుల పాటు వీసా లేకుండా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండడానికి అనుమతి ఉంది. ఇండోనేషియా, టర్కీ, చైనా, ఇరాన్, తజికిస్థాన్ దేశాల నుంచి చెల్లుబాటు అయ్యే దౌత్య పాస్‌పోర్ట్స్ ఉన్న పౌరులకు వీసా తప్పనిసరి కాదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, North Korea, Russia, Soudi arebia, Visa