‘భారతీయ మహిళలు, యువతులు కుటుంబ నియంత్రణకు, అవాంఛిత గర్భాల నియంత్రణకు ఆధునిక పద్ధతులను వాడుతున్నారు. మిగిలిన దేశాలతో పోల్చితే భారత్ ఈ విషయంలో చాలా ముందంజలో ఉంది‘ అని ఓ సర్వేలో వెల్లడయింది. ఇటీవల విడుదలయిన ఈ సర్వేలో గర్భనిరోధక సాధనాలను వాడుతున్న మహిళల గురించి పలు ఆసక్తికరమయిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళల పునరుత్పాదక హక్కులకు తోడ్పాటును అందించే ఫ్యామిలీ ప్లానింగ్ వేదిక ’ఫ్యామిలీ ప్లానింగ్ 2020‘ పేరుతో ఓ సర్వేను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అల్పాదాయ దేశాల్లో గత ఎనిమిదేళ్లలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి.? ఏ దేశంలో మేలైన స్థితి ఉంది.? అన్నదానిపై ఈ సర్వేలో పరిశోధన చేశారు.
2012వ సంవత్సరం నుంచి 13 అల్పాదాయ దేశాల్లో ఆధునిక గర్భనిరోధక సాధనాలను వాడుతున్నారని ఈ సర్వేలో స్పష్టమయింది. 12 కోట్లకు పైగా అవాంఛిత గర్భాలు, 2.1 కోట్ల గర్భస్రావాలును ఈ సాధనాలను వాడటం ద్వారా నివారించినట్టు తేలింది.అదే సమయంలో దాదాపు ఒక కోటీ పాతిక లక్షల గర్భిణుల మరణాలను నివారించినట్టు వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో కుటుంబ నియంత్రణ, అవాంఛిత గర్భాలు, గర్భనిరోధక సాధనాల వినియోగం వంటి విషయాలపై మహిళలకు, యువతులకు మంచి అవగాహన ఉందని సర్వేలోని సంఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి. అల్పాదాయ దేశాలన్నింటినీ పోల్చితే భారత్ మెరుగైన ర్యాంకును కనపరచడం గమనార్హం. డాక్టర్ల సిఫారసులతోపాటు ఇంటర్నెట్ ద్వారా ఈ ఆధునిక గర్భనిరోధక సాధనాల గురించి తెలుసుకుంటున్నారట. గర్భనిరోధక మాత్రలు, కండోమ్స్, వంటి వాటితోపాటు ఏ రోజుల్లో శృంగారంలో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయన్నదానిపై మెజార్టీ మంది మహిళలు, యువతులు అవగాహన కలిగి ఉన్నారని సర్వే స్పష్టం చేస్తోంది.
భారత్ లో మహిళలు, యువుతలు ఆధునిక గర్భ నిరోధక సాధనాలను వాడటం వల్ల ఏకంగా ఐదు కోట్ల 45 లక్షల అవాంఛనీయ గర్భాలను ఆపగలిగారట. 18 లక్షలకు పైగా సురక్షితం కాని అబార్షన్లను నివారించడంతోపాటు 23 వేల మంది గర్భిణుల మరణాలను ఆపగలిగినట్టు సర్వేలో వెల్లడయింది. భారత్ లో ఏకంగా 13.9 కోట్ల మంది మహిళలు, యువతులు ఆధునిక గర్భనిరోధక సాధనాలను వాడుతున్నారని సర్వే తేల్చిచెప్పింది. ఈ సంఖ్య 69 అత్యల్ప ఆదాయ దేశాలన్నింటిలో కలిపి 32కోట్లుగా ఉండటం గమనార్హం.
Published by:Hasaan Kandula
First published:January 27, 2021, 11:22 IST