New year resolutions: న్యూ ఈయర్ రిజల్యూషన్స్‌ పెట్టుకోవడం కాదు.. వాటిని కచ్చితంగా సాధించాలంటే ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

New Year Resolutions: న్యూ ఈయర్ రిజల్యూషన్స్‌ను ఒక భారంగా భావించకుండా, ముందు వాటిపై ఆసక్తి పెంచుకోవాలి. కష్టమని భావించినప్పుడు వీటికోసం అనుసరించే పద్ధతులను మార్చుకోవాలి.

  • Share this:
కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు.. న్యూ ఈయర్ రిజల్యూషన్స్‌ అంటూ ప్రజలు సందడి చేస్తుంటారు. ఈ సంవత్సరం మానేయాల్సిన అలవాట్లు, కెరీర్‌కు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. కొత్త జీవనశైలి లక్ష్యాలపై ఒక అంచనాకు వస్తారు. కానీ ఇంటి పనులు, ఆఫీస్ వర్క్‌, కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ లక్ష్యాలు, తీర్మానాలను నెరవేర్చడం సవాలుతో కూడుకున్న పని. అలాగని పనుల వంకతో సంవత్సరం ప్రారంభంలోనే రిజల్యూషన్స్‌ పక్కన పెట్టడం వల్ల అనుకున్న లక్ష్యాలు చేరుకోలేరు. అందువల్ల న్యూ ఈయర్ రిజల్యూషన్స్‌ను ఒక భారంగా భావించకుండా, ముందు వాటిపై ఆసక్తి పెంచుకోవాలి. కష్టమని భావించినప్పుడు వీటికోసం అనుసరించే పద్ధతులను మార్చుకోవాలి. తీర్మానాలను ఆరోగ్యకరమైన అలవాట్లుగా, జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి. కొత్త అలవాట్లు అనే భావనను విడిచిపెట్టాలి. కొత్త లక్ష్యాల కోసం నిరంతరం శ్రమిస్తున్నామనే ఆలోచనతో ముందడుగు వేయాలి. న్యూ ఈయర్ రిజల్యూషన్స్‌ను దీర్ఘకాలిక అలవాట్లుగా మార్చుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

ఆహారం, ఆరోగ్యం
ప్రతి ఒక్కరి న్యూ ఈయర్ రిజల్యూషన్స్‌లో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడమనే లక్ష్యం కచ్చితంగా ఉండాలి. ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న పనులు చేయగలుగుతాం. ఇందుకు పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు ఉండే సమతులాహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అవసరమైతే వీటితో రుచికరమైన, కొత్తరకం వంటకాలు చేసుకోవచ్చు. దీంతోపాటు రోజూ తగినంత మంచినీరు తాగితే జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. కాలానుగుణంగా లభించే పండ్లు, పండ్ల రసాలు తప్పకుండా తీసుకోవాలి.

ప్రణాళిక
ప్రతి పనిని ప్రణాళిక ప్రకారం విభజించుకోవాలి. ఫిట్‌నెస్ ప్లానింగ్, వెల్‌నెస్ ప్లానింగ్, బడ్జెట్ ప్లానింగ్, డైట్ ప్లానింగ్... ఇలా మీకు అవసరమైన ప్రతి విషయానికి ఒక ప్లానింగ్ ఉండాలి. వీటికి ప్రత్యేకంగా సమయం కేటాయించే షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలి. దాని ప్రకారమే ముందుకెళ్లాలి. దీర్ఘకాలిక లక్ష్యాలకు ఇది బాటలు వేస్తుంది. సమయం విలువ అర్థమయ్యేలా చేస్తుంది. ఇలా కాకుండా కొంతమంది రోజువారీ పనుల్లో కొత్త అలవాట్లను ఒక భాగంగా చేసుకుందాం అనుకుంటారు. దీని వల్ల పెద్దగా ఫలితం ఉండదు. సరైన ప్రణాళిక లేనప్పుడు కొన్ని రోజుల తరువాత నిర్లక్ష్యంతో ముందుకెళ్లలేరు.

శారీరక, మానసిక ఆరోగ్యం
ఎక్కువమంది కొత్త సంవత్సరం లక్ష్యాల్లో జిమ్‌కు వెళ్లడం, వ్యాయామం చేయడం ఉంటాయి. ఇవి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇతర లక్ష్యాలపై శ్రద్ధ పెట్టేందుకు ఫిట్‌నెస్ గోల్స్‌ ఉపయోగపడతాయి. వీటివల్ల మనసు ప్రశాతంగా ఉంటుంది. మెదడు చురుగ్గా మారుతుంది. అందువల్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకునేందుకు వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి ప్రయత్నించాలి. స్నేహితులతో కలిసి జాగింగ్, స్విమ్మింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా శారీరక, మానసిక ఆరోగ్యం సొంతమవుతుంది. వీటికి సమయం కేటాయించటేనివారు పజిల్స్, బ్రయిన్ టీజర్స్ వంటి మైండ్ గేమ్స్‌ను ఎంచుకోవచ్చు.

పనిలో విరామం
అదే పనిగా, కదలకుండా ఒకేచోట కూర్చొని పనిచేసేవారికి గుండెజబ్బుల ప్రమాదం ఎక్కువ అని పరిశోధనల్లో తెలిసింది. సాధారణంగా ఒక రోజులో ఉద్యోగులు ఏడు నుంచి తొమ్మిది గంటలు పనిచేస్తారు. వర్క్‌ ఫ్రమ్ హోమ్ వల్ల పని ఒత్తిడి ఎంతో కొంత పెరిగిందనేది నిజం. కానీ కదలకుండా ల్యాప్‌టాప్, కంప్యూటర్ల ముందు కూర్చోవడం ప్రమాదకరమైన అలవాటు. దీనివల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. అందువల్ల పని మధ్యలో విరామం తీసుకుంటూ తేలికపాటి కసరత్తులు చేయాలి. వర్కింగ్ టైమ్ అయిపోయిన తరువాత ఆఫీస్ వర్క్ గురించి ఆలోచించకుండా, ఇతర వ్యాపకాలపైన దృష్టి పెట్టాలి.

గందరగోళం వద్దు
కొత్త సంవత్సరం తీర్మానాలకు సంబంధించిన మోటివేషన్‌ను కోల్పోకుండా ఉంటాలంటే ప్రతి పనిని సమన్వయంతో చక్కబెట్టుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యాలపై ప్రభావం పడకుండా ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఆర్గనైజ్డ్ హోమ్‌ అనే నిర్దిష్టమైన విధానాన్ని అనుసరించాలి. ఇంటి పనులు లక్ష్యాలను దెబ్బతీయకుండా ప్రణాళిక వేసుకుంటే అన్నింట్లోనూ విజయం సాధించగలుగుతారు. ఇంట్లో, ఆఫీస్‌లో మీకు సంబంధించిన వస్తువులు, ముఖ్యమైన డాక్యుమెంట్లు చెల్లాచెదురుగా పడేయడం వల్ల గందరగోళంగా అనిపిస్తుంది. ఇది వర్కింగ్ కెపాసిటీపై ప్రభావం చూపిస్తుంది. ఇలాంటివి పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్తపడాలి.
Published by:Kishore Akkaladevi
First published: