GT Hemanth Kumar, Tirupati Correspondent, News18
రాష్ట్రాల సరిహద్దు గ్రామాలు.. చాలా ముచ్చటైన పల్లెలు.. పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉంటాయి.. వ్యవసాయంతో జీవనం సాగిస్తూ సందడిగా ఉండే గ్రామాలు.. నిత్య సంతోషంగా కనిపిస్తారు అక్కడి ప్రజలు.. కానీ ఇప్పుడు బిక్కు బిక్కుమంటూ అరచేతుల్లో ప్రాణం పెట్టుకొని జీవనంసాగిస్తున్నారు అక్కడి రైతులు. ముఖ్యంగా గజ రాజుల పేరు చెపితేనే వణికిపోతున్నారు రైతులు. ఎప్పుడూ సంతోషంగా కనిపించే ఆ రైతులకు ఇప్పుడు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి హాథిలు. అటవీ ప్రాంతం సరిహద్దులో ముసలిమడుగు, ఏటిగడ్డఇండ్లు, కాలోపల్లె, నూనెవరిపల్లె, కృష్ణాపురం, మండిపేటకోటూరు గ్రామాల ప్రజలు ఏనుగుల దాడులతో వణికిపోతున్నారు. కేవలం ఒకటి రెండు ఏనుగులు కాదు.. సుమారు 20కి పైగా ఏనుగులు.. అదీ గుంపులు గ్రామాల వైపు వచ్చి పడుతున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలోని.. మామిడి తోటలు పూర్తిగా ద్వంసం చేస్తున్నాయి. దాదాపు 20 ఎకరాల మేర మామిడి తోటలను పూర్తిగా నాశనం చేశాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
ఎన్ని ప్రయత్నాలు చేసిన పంట పొలాలపై ఏనుగుల విధ్వంసకాండ ఆగడం లేదు. కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన కందకాలు, సోలార్ ఫెన్సింగ్ లు ఏనుగుల రాకను నిలువరించి లేకపోతున్నాయి. పలమనేరు అటవీ శాఖ పరిధిలో 41 వేల హెక్టార్లలో దట్టమైన కౌండిన్య అభయారణ్యం విస్తరించి ఉంది. నీరు పుష్కలంగా చేరడం, చెట్ల పొదలు అపారంగా ఉండడంతో ఏనుగుల ఆవాసాలకు కౌండిన్య అభయారణ్యం నిలయంగా మారుతోంది.
ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ ఇస్తామని కాల్స్ వస్తున్నాయా.. డిటైల్స్ ఇస్తే అంతే
రెండు నెలల క్రితం కౌండిన్య అభయారణ్యంలోకి ప్రవేశించిన ఏనుగుల మందలు, ఇక్కడి వాతావరణానికి అలవాటుపడి వెనక్కు వెళ్ళడానికి ఆసక్తి చూపడం లేదు. ఏకంగా 55 ఏనుగులకు పైగా తిష్ట వేశాయి. ఇవి గుంపులుగా విడిపోయి పంటపొలాలపై విరుచుకుపడి, రోడ్లపైనే హల్చల్చేస్తూ హడలెత్తిస్తున్నాయి.
ఇదీ చదవండి: : ఉక్కపోత భరించలేక గాలికోసం చూస్తే.. ఇళ్లు గుల్ల అయ్యింది..? అసలేం జరిగింది..?
కౌండిన్య అటవీ ప్రాంతంలో ఎంతో రుచికరమైన ఆహార లభిస్తోంది. ఏనుగులు ఎక్కువగా ఇష్టపడే సిగరాకు వెలుతురు చెట్లు, బూరగ, మెత్తమామిడి తదితర వృక్షాలు అధికంగా ఈ అభయారణ్యంలో ఉన్నాయి. దీంతో పాటు వెదురు, కలబంద, జువ్విచెట్లు అక్కడ క్కడా ఉన్నాయి. అయినప్పటికీ ఏనుగులు పంటల రుచి బాగా మరిగాయి. చెరకు, మామిడి పంటలు రుచి కరమైన ఆహారం కావడంతో పగలంతో అటవీ ప్రాంత సరిహద్దుల్లో ఉంటూ పొద్దు వాలగానే పంటపొలా ల్లోకి ప్రవేశిస్తున్నాయి. పక్వానికి వస్తున్న మామిడి, వరి, రాగి పంటలను ఆరగించి వెనుదిరుగుతున్నాయి. ఏనుగుల దాడుల్లో పంటలను నష్టపోతున్న రైతులకు అందుతున్న పరిహారం అంతంత మాత్రంగానే ఉంది. ఎకరా చెరకును పండించాలంటే రూ.లక్ష 50 వేలకు పైగా ఖర్చు అవుతుంది.. ఇక వరికి రూ.80 వేలు, రాగికి రూ. 50 వేలు, వేరుశనగకు రూ.55 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అయితే ప్రభుత్వం ఫిక్స్ చేసిన పరిహారం అంతంత మాత్రమే ఉందని రైతులు వాపోతున్నారు. ఏనుగుల దాడుల నుంచి తమ గ్రామాలను కాపాడాలని అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Elephant attacks, Villagers