దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానం అంటే ప్రతి ఒక్కరికీ దసరా రోజు భారీ ఎత్తున నిర్వహించే రావణ దహనం గుర్తొస్తుంది. ప్రధానమంత్రి సహా పెద్ద పెద్ద నాయకులు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు భారీగా హాజరవుతారు. ప్రజల సంగతి చెప్పాల్సిన పనిలేదు. వేలాదిగా తరలివస్తారు. ఆ జనాలను కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే, ఈ సారి రామ్ లీలా మైదానంలో దసరా అంత కళకళలాడలేదు. కరోనా ఎఫెక్ట్ అక్కడ కూడా పడింది. రామ్ లీలా మైదానంలో ఈ సారి దసరా వేడుకలు కళావిహీనంగా మారాయి.
ప్రతి ఏటా తరహాలోనే ఈ సంవత్సరం కూడా రావణుడు, కుంభకర్ణుడి దిష్టిబొమ్మలను నిర్వాహకులు సిద్ధం చేశారు. అయితే, గతంలో నిర్వహించినట్టు అత్యంత భారీగా కాదు. కొంచెం చిన్న సైజు దిష్టిబొమ్మలను ఏర్పాటు చేశారు. రావణదహనం చూసేందుకు జనాన్ని కూడా నియంత్రించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా చూశారు. గేటు వద్దే ప్రతి ఒక్కరికీ మాస్క్ ఉందా? లేదా చూసి లోనికి పంపించారు. ఒకవేళ ఎవరి వద్ద అయినా లేకపోతే వారికి మాస్క్లు ఇచ్చి లోనికి పంపారు. అలాగే శానిటైజర్లు కూడా ఇచ్చారు. కరోనా సమయంలో మరింత రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు. అందుకే అలా అన్ని ఏర్పాట్లు చేశారు. ‘ఈసారి రావణ దహనంతో కరోనా పోవాలి.’ అని నిర్వాహకులు ఒకరు అన్నారు.
ఇక శాస్త్రి పార్క్లో కూడా రావణ, కుంభకర్ణ, మేఘనాథ్ దిష్టిబొమ్మలను సిద్ధం చేశారు. ఢిల్లీ ధార్మిక్ సంఘం (ఢిల్లీ దసరా ఉత్సవ సంఘం) ఈసారి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఒకేచోట భారీ ఎత్తున కాకుండా, ఎక్కడికక్కడ చిన్న చిన్న ఏర్పాట్లు చేసింది. దాని వల్ల సామాజిక దూరం పాటించేందుకు వీలు కలుగుతుందని అభిప్రాయపడింది. కరోనాతో పాటు కాలుష్యం వల్ల కూడా ప్రజలు రావణదహనం కార్యక్రమాలను పరిమిత స్థాయిలోనే నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో పలుచోట్ల రావణ దహనం కార్యక్రమాలను రద్దు చేశారు. మరికొందరు గత ఏడాది వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు. అలా కార్యక్రమం చేపట్టిన వారిని, గత ఏడాది వీడియోలు అప్లోడ్ చేస్తున్నవారిని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అభినందించారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా పర్వదినాన్ని జరుపుకొంటారు. ఊరూ వాడా రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేసి పండుగ చేసుకుంటారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది రావణదహనం కార్యక్రమాలు నిర్వహించడం చాలా కష్టంగా మారింది. ఒకవేళ నిర్వహించినా అక్కడ సామాజిక దూరం పాటించడం కష్టం. ప్రజలు ఒకచోట గుమిగూడడం వల్ల కరోనా మరింత పెరిగే ప్రమాదం ఉంటే, రావణదహనం వల్ల వాయుకాలుష్యం పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకరంగా మారింది. అందుకే ఈసారి చాలా చోట్ల రావణదహనాలు నిర్వహించలేదు. అదే సమయంలో సంప్రదాయాలను కొనసాగించడం కోసం చిన్న చిన్నగా దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసి వాటిని దహనం చేస్తున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.