ప్రొస్టేట్ క్యాన్సర్ (Prostate cancer) ప్రపంచంలో అత్యధికులు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు సింపుల్ పరిష్కారం కాఫీ (coffee) అని తాజాగా జరిగిన ఓ అధ్యయనం తేల్చింది. ప్రముఖ హెల్త్ జర్నల్ లో ఈమేరకు ప్రచురితమైన వివరాలు చాలా ఆసక్తిగొలుపుతున్నాయి. ముఖ్యంగా కాఫీ లవర్స్ కు ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మీరు రోజూ తాగే కాఫీ డోస్ కంటే అదనంగా తాగా ప్రతి కాఫీ కప్పుతో ఒక శాతం ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుందన్నది ఆ స్టడీ సారాంశం. మొత్తానికి కాఫీని ఇక నిర్భయంగా తాగచ్చన్నమాట. కాఫీ తాగడానికి ప్రొస్టేట్ క్యాన్సర్ కు చాలా దగ్గర సంబంధముంది. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వచ్చే రెండవ అతి పెద్ద కామన్ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్. పురుషుల్లో క్యాన్సర్ కారణంగా జరిగే మరణాల్లో ఇది ప్రధాన కారణంగా మారుతోంది.
ఆసియా ఖండంలో ప్రొస్టేట్ క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రొస్టేట్ క్యాన్సర్ పై లోతైన అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నాయి. ఎప్పటి నుంచో క్యాన్సర్ కు కాఫీకి ప్రత్యక్ష సంబంధం ఉందని తేలగా..ఈ కోణంలో సాగుతున్న పరిశోధనల్లో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
రోజుకి ఎన్ని కప్పులు?
10 లక్షల మందికిపైగా పురుషుల్లో కాఫీ తాగే అలవాటును కొంతకాలంపాటు లోతుగా పరిశోధించాక తేలిన విషయం ఏమిటంటే ఎక్కువ కాఫీ తాగేవారికి ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని. దీంతో కాఫీ తక్కువ తాగే వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ ఎక్కువ మందికి సోకినట్టు గుర్తించారు. రోజుకు 2 కప్పుల నుంచి 9 కప్పులు కాఫీ తాగేవారు క్యాన్సర్ బారిన పడకుండా తమను తాము కాపాడుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రోజు తాగే ప్రతి అదనపు కప్పుతో ఒక శాతం అదనంగా ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. కాఫీ సేవనానికి లివర్, బవెల్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటివాటితో ప్రత్యక్ష సంబంధం ఉంది. కానీ ఈ సంబంధాన్ని రుజువు చేసేందుకు ఇదమిత్థంగా రుజువులంటూ ఏమీ లేకపోయినప్పటికీ పలు అధ్యయనాలు మాత్రం ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి.
సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండోయ్..
నిజానికి అతిగా కాఫీ సేవనంతో ఊబకాయం (obesity), అల్సర్లు, నిద్రలేమి (insomnia) వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాఫీలోని కెఫిన్ (Caffeine) ను పరిమితమైన పరిమాణంలో తీసుకోవటం మంచిదైనప్పటికీ అతిగా సేవిస్తే మాత్రం కెఫిన్ లేకుండా మీరు చురుగ్గా ఉండలేరనే పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి మీరు కాఫీకి బానిసలు కాకుండా జాగ్రత్త పడండి. కాఫీలోని చక్కెరతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కనుక చక్కెర లేని కాఫీ, పాలు లేని బ్లాక్ కాఫీతో మెటబాలిజం (metabolism) ను పెంచుకోవచ్చు. కాబట్టి బ్లాక్ కాఫీ సేవనం అత్యుత్తమం. ఇన్స్టంట్ కాఫీతో పలు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి కనుక సంప్రదాయ కాఫీ, ఫిల్టర్ కాఫీలే సేవించండి, ఇన్స్టంట్ వంటివి ఎక్కువగా ఉపయోగించకండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cancer, Coffee, Health care, Health Tips, Life Style