మనలో దాదాపు 90 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పి(back pain) తో బాధపడతారని అంచనా. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. కానీ వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్ర పిండాలలో రాళ్లదాకా నడుము నొప్పికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే వెన్నుపాములో సమస్యల వల్ల వచ్చే నడుము నొప్పి(back pain) సర్వసాధారణం. ఎక్కువమందిలో కనిపించేదీ… అలక్ష్యం చేస్తే ప్రమాదకరమైనదీ అయిన నొప్పి మాత్రం డిస్కు సమస్యలవల్ల వచ్చే నడుము నొప్పే. కొన్ని సందర్భాల్లో నడుం నొప్పి ఉన్నప్పటికీ దానికి వెన్నుపాముతో ఎటువంటి సంబంధం ఉండదు. అలాగని అశ్రద్ధ చేయడం పనికిరాదు. ఇలాంటప్పుడు ఇతరత్రా సమస్యలేవైనా ఉండవచ్చు. అయితే నొప్పి లక్షణాన్ని బట్టి అది ఏ అవయవానికి సంబంధించిన సమస్యో కొంతవరకు నిర్థారించవచ్చు. కొన్ని గృహ చిట్కాలతో నడుం నొప్పిని దూరం (Back pain treatment )చేసుకోవచ్చు.
1. శొంటి కషాయానికి (అరకప్పు) ఆముదాన్ని (రెండు చెంచాలు) కలిపి రెండు పూటలా వారం లేదా పది రోజులపాటు తీసుకోవాలి.
2. వావిలి ఆకు కషాయాన్ని పూటకు అర కప్పు చొప్పున మూడు పూటలా పుచ్చుకోవాలి.
3. పారిజాతం ఆకుల కషాయాన్ని పూటకు అర కప్పు చొప్పున మూడు పూటలా తీసుకోవాలి.
ఆయుర్వేద చికిత్స
నడుమునొప్పిని ఆయుర్వేదం (Ayurveda)లో కటిశూల అంటారు. ఇదొక వాత ప్రధాన వ్యాధి. దీనికి స్నేహనం, స్వేదనం, అగ్నిదీపనం, వస్తకర్మ, వేదనాశ్యామక, వాతనాశిక అనేవి ఔషధాలు.
నరాలకు సంబంధించిన న్యూరోజెనిక్ నొప్పి(pain) నరం ఇరుక్కుపోవటం వల్ల వస్తుంది. వెన్నునుంచి బయటకు వచ్చే నరాల్లో వాపు ఏర్పడినా, ఒరుసుకుపోయినా, లేదా నలిగినా ఈ తరహా నొప్పి వస్తుంది. ఒక్కోసారి నరాలమీద ఏ రకమైన ఒత్తిడీ లేకపోయినప్పటికీ డిస్కులో పగుళ్ళు ఏర్పడినప్పుడు విడుదలైన రసాయనాలు (Chemicals) నరాలను రేగేలా చేసి నొప్పికి కారణమవుతుంటాయి. జాయింట్లు (joints) అరిగిపోవడంవల్ల ఏర్పడే నొప్పి కంటే నరాలు నలిగినప్పుడు ఉత్పన్నమయ్యే న్యూరోజెనిక్ నొప్పి ప్రమాదకరమైనది. ఈ రకం నొప్పిలో నడుమునొప్పి అంతగా ఉండదు. అయితే నరం ప్రయాణించినంత మేర లక్షణాలు కనిపిస్తాయి. నరంమీద పడే ఒత్తిడికి కండరాలు (muscles) ప్రభావితమవటం దీనికి కారణం. దీనివల్ల కండరాలు బలహీన పడటమే కాకుండా ప్రతిచర్యలు ఆలస్యమవుతాయి. నరం ప్రయాణించే మార్గంలో సూదులు గుచ్చినట్లు నొప్పి, మంట, తిమ్మిరి, స్పర్శ హాని వంటివి కనిపిస్తాయి. కాళ్ళు బలహీనపడి పక్షవాతం కూడా సంభవించవచ్చు.
కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు కూడా నడుం నొప్పి ఉంటుంది. అయితే ఇది అలా వచ్చి ఇలా పోతుంది. వచ్చినప్పుడల్లా పది నుంచి 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. నొప్పితోపాటు మూత్రంలో మంట ఉంటుంది. నొప్పి ఒక చోట ఉంటుంది. కాళ్లలోకి పాకదు. ఒక్కోసారి కిడ్నీలో నీళ్లు నిండిపోయినప్పుడు కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. దీంతోపాటు మూత్రం తక్కువ లేదా ఎక్కువ సార్లు రావడం, ఇతరత్రా మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Life Style, Treatment